Begin typing your search above and press return to search.

యార్లగడ్డ వర్సెస్ వల్లభనేని..ఇంకా చల్లారలేదా?

By:  Tupaki Desk   |   18 Jan 2020 4:47 PM GMT
యార్లగడ్డ వర్సెస్ వల్లభనేని..ఇంకా చల్లారలేదా?
X
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్న వర్గ పోరు.. ఇంకా చల్లారలేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మొన్నటి ఎన్నికలకు ముందు నుంచి అక్కడ వైసీపీ ఇంచార్జీ యార్లగడ్డ వెంకట్రావు - టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్నికల వేళకు ఆ మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే దాకా వెళితే.. వంశీ ఏకంగా తన మనుషులను యార్లగడ్డ ఇంటికి పంపినట్లుగా సాగిన ప్రచారం అక్కడ ఇరు పార్టీల మధ్య ఏ స్థాయిలో విభేదాలు నెలకొన్నాయన్న వాదనలూ వినిపించాయి. మొత్తంగా ఇక్కడ రెండు పార్టీల మధ్య వైరం కన్నా... యార్లగడ్డ వర్సెస్ వల్లభనేని మరింతగా కాక పుట్టించింది.

అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వంశీ ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసేసి వైసీపీకి దగ్గరగా జరిగారు. వైసీపీలో చేరకున్నా... టీడీపీకి రాజీనామా చేసిన ఆయన జగన్ తో సన్నిహితంగా మెలగుతున్నారు. ఈ క్రమంలో దాదాపుగా యార్లగడ్డ, వంశీ ఇద్దరూ వైసీపీలోనే ఉన్నట్లుగా చెప్పుకోవాలి. అంటే... పార్టీల గోల పోయిన ప్రస్తుత తరుణంలో యార్లగడ్డ - వంశీలు ఒకే జట్టుగా సాగుతారన్న వాదనలూ వినిపించాయి. అయితే అదంత ఈజీ ఏమీ కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో సాగిన వర్గ పోరు కూడా ఇద్దరు వ్యక్తుల కేంద్రంగానే సాగిందని - పార్టీల ప్రమేయం అంతగా లేదన్న వాదన ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే పార్టీ నేతలుగా ఉన్నా కూడా యార్లగడ్డ, వంశీల మధ్య అంతగా సఖ్యత లేదనే చెప్పక తప్పదు.

ఈ మాట నిజమేనన్నట్లుగా ఇప్పుడు ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరును పక్కనపెడితే... మొన్నటిదాకా తనతో పోరు సాగించి ఇప్పుడు తాను ఉంటున్న పార్టీలో చేరిన వంశీతో కలిసి సాగేదెలా అంటూ యార్లగడ్డ ఓ కొత్త వాదనను వినిపిస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వీరి మధ్య వర్గ పోరు సమసిపోలేదని చెప్పేందుకు నిదర్శనంగా నిలిచిన ఘటన వివరాల్లోకి వెళితే... సంక్రాంతి సందర్భంగా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంపాపురంలో ఇటు వంశీతో పాటు అటు యార్లగడ్డ కూడా కోడిపందేలు, జూద శిబిరాలు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. యార్లగడ్డ రోడ్డుకు అనుకునే తన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే... వంశీ దాని వెనకాల రోడ్డుకు దూరంగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ శిబిరాలపై దాడులు చేసుందుకు వచ్చిన పోలీసులు రోడ్డుకు ఆనుకుని ఉన్న యార్లగడ్డ శిబిరాన్ని వదిలేసి... దాని వెనకాల ఉన్న వంశీ శిబిరంపై దాడి చేశారు. ఈ దాడితో యార్లగడ్డ, వంశీల మధ్య వర్గ పోరు చల్లారలేదన్న వాదనలకు బలం చేకూరిందన్న మాట వినిపిస్తోంది.