Begin typing your search above and press return to search.

టీడీపీ చేసిన ఆ ప‌నికి ఆశ్చ‌ర్య‌పోనంటున్న‌ య‌శ్వంత్ సిన్హా!

By:  Tupaki Desk   |   14 July 2022 4:42 AM GMT
టీడీపీ చేసిన ఆ ప‌నికి ఆశ్చ‌ర్య‌పోనంటున్న‌ య‌శ్వంత్ సిన్హా!
X
జూలై 18న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున మాజీ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది ముర్ము, విప‌క్షాల త‌ర‌ఫున కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఇద్ద‌రు నేత‌లు ఆయా రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. వివిధ పార్టీల అధినేత‌ల‌ను, ముఖ్య‌మంత్రుల‌ను క‌లిసి త‌మ‌కు మ‌ద్దతు ఇవ్వాల‌ని కోరుతున్నారు.

కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికొస్తే అటు అధికార వైఎస్సార్సీపీ, ఇటు ప్ర‌తిప‌క్ష టీడీపీ రెండూ త‌మ మ‌ద్ద‌తును ఎన్డీయే అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు ప్ర‌క‌టించాయి. వాస్త‌వానికి ఈ రెండూ పార్టీలు ఎన్డీయే కూట‌మిలో లేవు. అయిన‌ప్ప‌టికీ ద్రౌప‌దికే మ‌ద్ద‌తు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. వైఎస్సార్సీపీని అయితే బీజేపీ అధిష్టానం ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరింది. కానీ టీడీపీని మాత్రం లైట్ తీసుకుంది. ఒక్క బీజేపీ అధిష్టాన‌మే కాకుండా విప‌క్షాల కూట‌మి కూడా పట్టించుకోలేదు.

అయిన‌ప్ప‌టికీ టీడీపీ త‌మ మ‌ద్ద‌తును ద్రౌప‌ది ముర్ముకు ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో విప‌క్షాల కూట‌మి త‌ర‌ఫున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ద్రౌప‌ది ముర్ముకు టీడీపీ మ‌ద్ద‌తు త‌న‌కు పెద్ద ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేద‌ని అన్నారు.

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డానికి ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఢిల్లీలో స‌మావేశం నిర్వ‌హించిన రెండుసార్లు టీడీపీని ఆహ్వానించ‌లేద‌ని య‌శ్వంత్ సిన్హా ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. కాబ‌ట్టి టీడీపీ ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంలో ఆశ్చ‌ర్య‌పోయేది ఏమీ లేద‌ని తెలిపారు.

అయితే ప్ర‌తిప‌క్ష పార్టీలు రెండుసార్లు నిర్వ‌హించిన స‌మావేశాల‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిని ఎందుకు పిల‌వ‌లేదో త‌న‌కు తెలియ‌ద‌ని య‌శ్వంత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారానికి అసోం వ‌చ్చిన ఆయ‌న ఈ మేర‌కు వ్యాఖ్య‌లు చేశారు.

కాగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు త‌మ ఆత్మ‌ప్ర‌భోదానుసారం ఓటేయాల‌ని య‌శ్వంత్ విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక అసాధార‌ణ ప‌రిస్థితుల్లో జ‌రుగుతోంద‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని మండిప‌డారు. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను, త‌న అధికారాన్ని దుర్వియోగం చేస్తోంద‌ని య‌శ్వంత్ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ ప్ర‌భుత్వాల‌ను బీజేపీ ప్ర‌భుత్వం కూలుస్తోంద‌ని నిప్పులు చెరిగారు.