Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా!

By:  Tupaki Desk   |   21 Jun 2022 4:48 AM GMT
ప్ర‌తిప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా!
X
తాము అనుకున్న ముగ్గురు అభ్య‌ర్థులు రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి పోటీ చేయ‌డానికి నిరాక‌రించ‌డంతో ప్ర‌తిప‌క్షాలు మ‌రో అభ్య‌ర్థిని వెతికే ప‌నిలో ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి య‌శ్వంత్ సిన్హాను రంగంలోకి దించ‌డానికి ఆ పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. జూన్ 21న మంగళ‌వారం ఢిల్లీలో 17 పార్టీలు రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డానికి స‌మావేశ‌మ‌వుతున్నాయి. ఈ స‌మావేశానికి నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి శ‌ర‌ద్ ప‌వార్ అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్నారు.

ఈ స‌మావేశంలో ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హాను ఎంపిక చేస్తార‌ని స‌మాచారం. బీహార్ కు చెందిన య‌శ్వంత్ సిన్హా గ‌తంలో ఐఏఎస్ ఆఫీస‌ర్ గా ప‌నిచేశారు. చంద్ర‌శేఖ‌ర్, అట‌ల్ బిహార్ వాజ్ పాయిలు ప్ర‌ధాన‌మంత్రులుగా ఉన్న‌ప్పుడు వారి మంత్రివ‌ర్గాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, విదేశాంగ మంత్రిగా కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

బీజేపీ త‌ర‌ఫున య‌శ్వంత్ సిన్హా బిహార్ లోని హ‌జారీబాగ్ నుంచి ప‌లుమార్లు లోక్ స‌భ‌కు ఎంపిక‌య్యారు. అలాగే బీజేపీలో చేర‌కు ముందు 1980 ద‌శ‌కంలో జ‌న‌తాద‌ళ్ పార్టీ ఏర్పాటులో కీల‌క‌పాత్ర పోషించారు.

ఆ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు కూడా ఎంపిక‌య్యారు. న‌రంద్ర‌మోదీ ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక ఆయ‌న‌తో విభేదించి బీజేపీకి య‌శ్వంత్ సిన్హా రాజీనామా చేశారు. గ‌తేడాది ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మతా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, విదేశాంగ మంత్రిగా, ఐఏఎస్ ఆఫీస‌ర్ గా ప‌నిచేసిన య‌శ్వంత్ సిన్హాను ప్ర‌తిప‌క్షాలు త‌మ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక బ‌రిలో నిల‌పాల‌ని యోచిస్తున్నాయి.

ముందు శ‌ర‌ద్ ప‌వార్, జ‌మ్ముకశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూఖ్ అబ్దుల్లా, మ‌హాత్మాగాంధీ మ‌నుమ‌డు, మాజీ గ‌వ‌ర్న‌ర్ గోపాల‌కృష్ణ గాంధీని రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా దించాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ వారు ముగ్గురూ పోటీలో ఉండ‌టానికి ఇష్ట‌ప‌డని సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో య‌శ్వంత్ సిన్హాను ప్ర‌తిప‌క్షాలు తెర‌మీద‌కు తెచ్చాయి.