Begin typing your search above and press return to search.

మిత్రులే.. యాంటీ మోడీ గ్రూప్ పెట్టారు

By:  Tupaki Desk   |   31 Jan 2018 6:05 AM GMT
మిత్రులే.. యాంటీ మోడీ గ్రూప్ పెట్టారు
X
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. జాతీయ‌స్థాయిలో బీజేపీ రాజ‌కీయం చూస్తే ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. బీజేపీ సీనియ‌ర్ నేత‌లుగా ఉన్న ముఖ్య‌నేత‌ల్లో ప‌లువురు ప్ర‌ధాని మోడీపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. మోడీ స‌ర్కారు అనుస‌రిస్తున్న తీరును వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. మోడీపై త‌మ‌కున్న అసంతృప్తిని బాహాటంగా వ్య‌క్తం చేస్తున్నారు.

పార్టీలో తిరుగులేని నేత‌గా ఆవిర్బ‌వించిన మోడీపై బాహాటంగా ఫైట్ చేసేందుకు ముందుకొచ్చిన అతి కొద్ది మందిలో మాజీ కేంద్ర‌మంత్రి య‌శ్వంత్ సిన్హా ఒక‌రు. మోడీ తీరును.. ఆయ‌న పాల‌నా వ్య‌వ‌హారాల్ని సునిశితంగా విమ‌ర్శించే ఆయ‌న‌.. రాష్ట్రీయ మంచ్ పేరుతో ఒక కొత్త వేదిక‌ను ఏర్పాటు చేశారు. మోడీని వ్య‌తిరేకించ‌ట‌మే ఈ వేదిక ల‌క్ష్యంగా చెప్పాలి.

ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌కు పెద్ద‌పీట వేస్తున్న మోడీ స‌ర్కారుకు చెక్ పెట్టేందుకు వీలుగా ఈ వేదిక ప‌ని చేయ‌నుంది. య‌శ్వంత్ సిన్హా స్టార్ట్ చేసిన ఈ వేదిక‌పై మ‌రో బీజేపీ ప్ర‌ముఖుడు ఆయ‌న‌కు క‌లిశారు. షాట్ గ‌న్ గా సుప‌రిచితుడైన మ‌రో బీజేపీ సీనియ‌ర్ నేత శ‌త్రుఘ్న సిన్హా మోడీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో త‌న‌కు ద‌క్కాల్సిన స్థానాన్ని.. ప్రాధాన్య‌త‌ను ద‌క్క‌కుండా చేయ‌టంలో మోడీషాలు కీ రోల్ ప్లే చేశార‌న్న భావ‌న‌లో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో మోడీపై అసంతృప్తి వ్య‌క్తం చేసే య‌శ్వంత్ తో జ‌త క‌ట్టిన శ‌త్రుఘ్న సిన్హా.. మోడీపై ఘాటు విమ‌ర్శ‌ల‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. బీజేపీకి చెందిన మోడీ వ్య‌తిరేక నేత‌ల వేదిక‌ను ప‌లు పార్టీల‌కు చెందిన నేత‌లు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. వీరికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న వారిలో తృణ‌మూల్ కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌..ఎన్సీపీ.. ఆమ్ ఆద్మీ.. జేడీయూ.. ఆర్ ఎల్డీ త‌దిత‌రులు మ‌ద్ద‌తు ప‌లుకుతుండ‌టంతో రానున్న రోజుల్లో మోడీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.