Begin typing your search above and press return to search.

అనంత్‌ ఉదయ్‌ భాస్కర్‌ ఉచ్ఛ స్థితి నుంచి పతనం దిశగా..

By:  Tupaki Desk   |   23 May 2022 10:36 AM GMT
అనంత్‌ ఉదయ్‌ భాస్కర్‌ ఉచ్ఛ స్థితి నుంచి పతనం దిశగా..
X
మాజీ డ్రైవర్‌ హత్య కేసు వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత్‌ ఉదయ్‌ భాస్కర్‌ వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. తన దగ్గర పనిచేసిన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రథమ నిందితుడిగా అందరి వేళ్లూ ఆయన వైపే చూపిస్తున్నాయి. దీంతో అనంత్‌ ఉదయ్‌ భాస్కర్‌ తీవ్ర చిక్కుల్లో పడ్డారు.

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన అనంత్‌ ఉదయ్‌ భాస్కర్‌ చిన్నతనం నుంచే దూకుడుగా ఉండేవారని అంటున్నారు. టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు.. జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులకు మేనల్లుడు.. ఉదయ్‌ భాస్కర్‌. అయితే తన కులాన్ని కొండ కాపుగా మార్చేసి ఎస్టీగా మార్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. యువకుడిగా ఉన్నప్పుడే అనుచరులతో తిరుగుతూ వివాదాల్లో తలదూర్చేవారని చెబుతున్నారు. దీంతో ఉదయ్‌ భాస్కర్‌పై రౌడీషీట్‌ కూడా నమోదైందని సమాచారం. రంపచోడవరం ఏజెన్సీ ఏరియా కావడంతో గంజాయి సాగులోనూ ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొంటున్నారు. దీంతో రాజకీయ నేతలతోనూ, పోలీసులతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించారని చెబుతున్నారు.

ఈ పరిచయాలతోనే 2014లో రంపచోడవరం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపికయ్యారని అంటున్నారు. అయితే అప్పట్లో సాంకేతిక కారణాలతో నామినేషన్‌ వేయలేకపోయారు. దీంతో వంతల రాజేశ్వరి అనే ఒక సాధారణ ఉపాధ్యాయురాలికి సీటు ఇప్పించి అక్కడ నుంచి ఆమెను గెలిపించుకున్నారు. అయితే పెత్తనమంతా అనంత్‌ ఉదయ్‌ భాస్కర్‌ చేసేవారని విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయన వైఖరి నచ్చని వంతల రాజేశ్వరి ఆ తర్వాత అప్పటి అధికార టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇక 2019లోనూ నాగులపల్లి ధనలక్ష్మి అనే సాధారణ టీచర్‌కు రంపచోడవరం సీటు ఇప్పించి వైఎస్సార్‌సీపీ తరఫున ఆమెను గెలిపించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఆ పార్టీ ముఖ్యులకు ఉదయ్‌ భాస్కర్‌ బాగా దగ్గరయ్యారని చెబుతున్నారు. ఈ సన్నిహిత సంబంధాలు, చొరవతో అనతికాలంలోనే వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారని పేర్కొంటున్నారు.

ఎమ్మెల్సీగా ఎన్నికైనా చిలక్కొట్టుడు వ్యవహారాలు మానుకోలేదని అంటున్నారు. ఒక మహిళా ప్రజాప్రతినిధితోనూ, కాకినాడకు చెందిన బడా వ్యాపారవేత్త కుమార్తెతోనూ, ఇంకా పలువురు మహిళలతోనూ అనంత్‌ ఉదయ్‌ భాస్కర్‌కు వివాహేతర సంబంధాలున్నాయని సమాచారం. మహిళా ప్రజాప్రతినిధితో కలసి ఉన్న వీడియో హత్యకు గురయిన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం వద్ద ఉందని.. ఇంకా ఉదయ్‌ భాస్కర్‌ అనేక రహస్యాలు డ్రైవర్‌కు తెలియడంతోనే అతడిని హత్య చేశారని చెప్పుకుంటున్నారు.

ఇలా తక్కువ కాలంలోనే ఎమ్మెల్సీగా ఉచ్ఛ స్థితికి చేరి.. సీఎం జగన్‌కు సన్నిహితుడిగా మారిన ఉదయ్‌ భాస్కర్‌ హత్య కేసులో ఇరుక్కుని పతనం దిశగా సాగుతున్నారని అంటున్నారు. హత్య కేసులో ఈయనే నిందితుడని వెల్లడయితే ఉదయ్‌ రాజకీయ జీవితం ముగియడం ఖాయమని చెబుతున్నారు.