Begin typing your search above and press return to search.

రాజధానులపైన నిర్ణయం మాదే..... రాజ్యసభలో వైసీపీ బిల్లు

By:  Tupaki Desk   |   5 Aug 2022 12:30 PM GMT
రాజధానులపైన నిర్ణయం మాదే..... రాజ్యసభలో వైసీపీ బిల్లు
X
మూడు రాజధానుల మూడ్ నుంచి వైసీపీ ఈ రోజుకూ బయటపడలేకపోతోంది. ఒక వైపు ఇది రెండేళ్ళ పై చిలుకు వ్యవహారం సాగి చివరికి హైకోర్టు తీర్పుతో అమరావతి ఏకైక రాజధాని అయింది. అయినా సరే మేమే నెగ్గాలి. మా మాటే చెల్లాలి అన్న పట్టుదలతో వైసీపీ ఉంది. ఈ క్రమంలో రాష్ట్రాలకే రాజధానుల ఏర్పాటు అధికారం ఉండాలంటూ వైసీపీ ఒక కీలకమైన పాయింట్ ని రైజ్ చేస్తోంది. ఆలోచన వచ్చిందే తడవుగా రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ఒక ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టారు.

నిజానికి ఈ బిల్లు నెగ్గడం అన్నది అటుంచి ఈ బిల్లు ప్రవేశపెట్టడం వెనక వైసీపీ ఉద్దేశ్యాలు ఏంటి అన్నవి అందరికీ తెలియాలన్నదే ఎత్తుగడగా ఉంది. మూడు రాజధానులు అంటూ హడావుడి చేసి బొక్క బోల్రాపడిన వైసీపీ పెద్దలు ఇపుడు అటు అమరావతిని ఒప్పుకోలేక ఇటు మూడు రాజధానులకు అనేక ప్రతిబంధనాలతో అడుగు ముందుకు వేయలేక సతమతమవుతున్నారు. దాంతో అమరావతి ఏకైక రాజధానిగా ఉంటే టీడీపీ గ్రాఫ్ పెరుగుతుంది.

రాజకీయంగా కూడా టీడీపీ లాభపడుతుంది. అందుకే మూడు రాజధానుల విషయంలో తాము ఇంకా కట్టుబడి ఉన్నామని చెప్పేందుకే ఈ బిల్లు ప్రవేశపెట్టారు అని అంటున్నారు. దీని ప్రకారం కేంద్రం వద్ద ఉన్న అధికారాలను రాష్ట్రాలకు ఇచ్చేయమనే అంటున్నారు. నిజానికి ఆర్టికల్‌ 3ఏని చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేపట్టడం చేయాలని విజయసాయిరెడ్డి కోరారు.

ఆ విధంగా చేస్తే ఏ రాష్ట్రం అయిన తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రాజధానులు పెట్టుకుంటూ పాతవి రద్దు చేసుకుంటూ పోతుంది. ఒక విధంగా ఇది గందరగోళ వ్యవహారమే అవుతుంది. పైగా కేంద్రం కేవలం ప్రేక్షక‌ పాత్ర పోషించడానికే పరిమితం అవుతుంది. అయితే ఇపుడు ఉన్న పరిస్థితులు కేంద్రం రాష్ట్రాలకు ఉన్న అధికారాలకే కత్తెర వేస్తున్న నేపధ్యం నుంచి చూసినపుడు ఈ బిల్లు విషయంలో ఏ మాత్రం ఆసక్తి లేనట్లుగానే ఉంటుందని చెప్పాలి.

నిజానికి కేంద్రం మూడు రాజధానుల విషయంలో పెద్దగా రియాక్ట్ కాలేదు. దానికి కారణం వైసీపీతో ఉన్న మంచి రిలేషన్స్. కానీ ఇపుడు అయితే ఏకంగా తమ పవర్స్ నే వదిలేసుకుని రాష్ట్రాలకు ఈ అధికారం ఇమ్మంటే కేంద్రం ససేమిరా అంటున్నారు. అయినా ప్రైవేట్ బిల్లులు చాలా ప్రవేశపెడుతూంటారు. అవేమీ నెగ్గేది ఉండదు. జస్ట్ తమ పార్టీ విధానం ఇది అని చెప్పుకోవడానికే.

ఈ విధంగా చేయడం ద్వారా వచ్చే ఎన్నికల వరకూ తాము మూడు రాజధానుల విషయంలో తగ్గలేదు ఏదో చేస్తున్నామని చెప్పుకోవడమే వైసీపీ లక్ష్యంగా ఉంది. ఏది ఏమైనా మూడు రాజధానుల కధకు ఒక ఫుల్ స్టాప్ పడిపోయింది అన్నది సగటు ఆంధ్రుడికి తెలిసిన సత్యం. ఈ విషయంలో వైసీపీ ఎన్ని చెప్పినా జనాలు ఏ మేరకు నమ్ముతారు అన్నది అతి పెద్ద డౌట్. అమరావతి విషయంలో వైసీపీ వేసిన రాంగ్ స్టెప్ కి ఈ టైమ్ లో దిద్దుబాట్లు ఉంటాయా అంటే అది కూడా డౌటే అంటున్నారు.