Begin typing your search above and press return to search.

వైసీపీతో బీజేపీ : ఎక్కడో తేడా కొడుతోంది...?

By:  Tupaki Desk   |   28 July 2022 5:30 PM GMT
వైసీపీతో బీజేపీ  : ఎక్కడో తేడా కొడుతోంది...?
X
ఏపీలో వైసీపీ మూడేళ్ల అధికారం పూర్తి చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో మరోమారు గెలిచి అధికారాన్ని సుస్థిరం చేసుకొవాలని చూస్తోంది. దానికి కేంద్రంలోని బీజేపీ పెద్దల అండదండలు పుష్కలంగా దక్కుతాయని కూడా ఏవేవో లెక్కలు వేసుకుంటూ ఇంతకాలం సాగింది. నిజానికి రాజకీయాల్లో స్నేహాలు ఎపుడూ శాశ్వతం కాదు, ఇక్కడ అవసరాలే నడిపిస్తాయి. ఏపీలో బీజేపీకి ఏమీ లేదు. కానీ వైసీపీ వంటి పార్టీని మచ్చిక చేసుకుని ఆ పార్టీకి చెందిన మొత్తం 31 మంది ఎంపీలను తనవారిగానే వాడుకుంటోంది. ఏ బిల్లు ప్రవేశపెట్టినా వైసీపీ మద్దతుని తీసుకుంటోంది.

ఇక అసలైన ఘట్టం అంటే రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. బీజేపీ కోరుకున్న వారే రాష్ట్రపతి భవన్ లో కొలువు తీరారు. ఉప రాష్ట్రపతి గా జగదీప్ ధన్ కర్ ని ఎంపిక చేశారు. ఆయన కూడా గెలవడం లాంచనమే. ఇక్కడ వైసీపీ మద్దతు ఇవ్వడమూ అంతే లాంచనం. ఇదంతా ఆగస్ట్ 6 తో పూర్తి అయ్యే వ్యవహారం. కానీ కేంద్రంలోని బీజేపీ వైసీపీతో ఎలా తన భవిష్యత్తు సంబంధాలను కొనసాగిస్తుంది అనడానికి కొన్ని సంకేతాలు అపుడే వెలువడ్డాయి.

వైసీపీతో అవస‌రం తీరిపోయిన స్థితిలో కమలం పార్టీ ఉంది. ఏపీలో వైసీపీ మాత్రం బీజేపీతో బంధం ఇంకా గట్టిగా వచ్చే ఎన్నికల దాకా ఉండాలని కోరుకుంటోంది. ఏపీలో తన రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబు జట్టు కట్టకుండా బీజేపీ ఉంటే చాలు మళ్లీ గెలుపు తనదే అని కూడా వైసీపీ భావిస్తోంది. అయితే కమలం ఇక్కడే భరోసా ఇవ్వడం లేదు. ఆ పార్టీ పోతున్న పోకడలు ఎక్కడో తేడా కొడుతోంది అనిపించేలా ఉన్నాయి.

ఏపీలో వైసీపీని బదనాం చేయడానికి టీడీపీ పొంచి ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ రాజకీయ‌ అవసరం అలాటిది. దానికోసమే బీజేపీకి దగ్గర అవుతోంది టీడీపీ. అలాంటి టీడీపీకి కోరి మరీ అస్త్రాలను బీజేపీ ఇస్తోంది. పార్లమెంట్ సమావేశాలు మొదలవుతూనే కేంద్ర విదేశాంగమంత్రి జయశంకర్ అయితేఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఏపీ పరువు తీశారు. ఆ తరువాత టీడీపీ ఎంపీలు ఉభయ సభలలో అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఎపీ అప్పుల కుప్పే అంటూ ఇచ్చిన సమాధానం కూడా వైసీపీకి దెబ్బ తీసేందే.

అంతే కాదు ఏపీలో రైల్వే ప్రాజెక్టులు అన్నీ ఆగిపోవడానికి వైసీపీ సర్కారే కారణం అని బీజేపీ పార్లమెంట్ సాక్షిగా చెప్పి పరువు తీసింది. విశాఖ రైల్వే జోన్ లేట్ కావడానికి ఎవరు ఆలస్యం అంటే చెప్పలేదు కానీ ఏపీ మీద ఇలా అతి పెద్ద బండ వేశారు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్. ఇంకోవైపు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం అవడానికీ వైసీపీ సర్కారే కారణం అని మరో మంత్రి పార్లమెంట్ లో చెప్పారు.

ఇక లేటెస్ట్ గా ఏపీ తెలంగాణాలలో పెరగాల్సిన అసెంబ్లీ సీట్ల విషయంలోనూ కేంద్రం ఎగనామం పెట్టింది. తెలంగాణా మీద గుర్రుగా ఉన్న మోడీ సర్కార్ తన అడుగులకు మడుగులు ఒత్తుతున్న ఏపీ సర్కార్ ని కూడా అదే గాటిన కట్టేసింది. అంటే మాకు టీయారెస్, వైసీపీలలో ఎవరూ దగ్గర కాదు అన్న సందేశాన్ని అలా వినిపించింది అన్న మాట. ఇలా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతూనే వైసీపీని అన్ని రకాలుగా బద‌నాం చేసే పనులే కేంద్రం చేస్తోందా అన్న అనుమానాలు అయితే నానాటికీ పెరిగిపోతున్నాయి.

ఏపీలో అభివృద్ధి లేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇప్పట్లో పూర్తి కాదు, అప్పులు మా గొప్పగా పెరిగిపోయాయి అంటూ కేంద్రంలోని బీజేపీ వైసీపీ మీద బండలు వేస్తోంది. మరి ఇప్పటిదాకా బీజేపీని మోస్తున్న వైసీపీకి ఇది గగుర్పాటు కలిగించే పరిణామమే. బీజేపీ చేయి విడవకుండా ఉంటుందని, దాంతో బీజేపీ అండతో మరో మారు ఆంధ్రదేశాన్ని అందుకోవచ్చు అని కలలు కంటున్న వైసీపీ పెద్దలకు కలవరం కలిగించే పరిణామమే ఇది అంటున్నారు.

అందుకేనేమో జగన్ యాధృచ్చికంగా అన్నారా లేకా ఇలాంటివి చూసి అన్నారా తెలియదు కానీ అల్లూరి జిల్లా పర్యటనలో కేంద్రంతో యుద్ధం చేస్తున్నామని చెప్పారు. మీ మాటలు అన్నీ కూడా నేరుగా కేంద్రానికి చెబుతాం అన్నారు. కేంద్రమే ఇరవై వేల కోట్లు పోలవరం పునరావాస ప్యాజేకి ఇవ్వాలని అని జనాలలో చెప్పి బీజేపీని అడ్డంగా బుక్ చేసారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే బీజేపీ పెద్దల ఆలోచనలు మెల్లగా మారుతున్నట్లుగానే ఉన్నాయి.

ఏపీలో తాము అధికారంలోకి రావాలని లేకపోయినా రేపటి సభలో తమ ప్రాతినిధ్యం ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. అలాగే కొన్ని ఎంపీ సీట్లు అయినా తమకు ఏపీ నుంచి దక్కాలని కూడా చూస్తోంది. ఆ విధమైన సీట్ల ఒప్పందానికి వత్తిడి పెట్టే క్రమంలోనే ఈ రకమైన ఎత్తుగడలు వేస్తోంది అని అంటున్నారు. 2024 ఎన్నికల వేళ బీజేపీ పొత్తులకు తయారుగా ఉంటుంది. అయితే వైసీపీ లేకపోతే టీడీపీ అన్న లెక్కలను కూడా పెట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీతో పొత్తు లేదు, తెర వెనక మాత్రమే దోస్తీ అని వైసీపీ పెద్దలు అంటే మాత్రం చాలా పెద్ద తేడాలు వచ్చేస్తాయి.

అయితే వైసీపీ పొత్తు పెట్టుకోలేని నిస్సహాయతతో ఉంది. ఆ పార్టీకి మైనారిటీ ఓటు బ్యాంక్ ఎక్కువ. బీజేపీతో డైరెక్ట్ గా పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా వైసీపీ రాజకీయంగా నష్టపోతుంది. దాంతో సహజంగానే నో చెప్పాల్సి ఉంటుంది. అలా వైసీపీ చేతనే నో చెప్పించుకున్న మీదటనే బీజేపీలో ఏపీలో అసలైన రాజకీయాన్ని స్టార్ట్ చేస్తుంది అంటున్నారు.