Begin typing your search above and press return to search.

హైకోర్టులో ఏపీ సర్కార్ సంజాయిషీ...ఎందుకంటే....

By:  Tupaki Desk   |   6 Oct 2021 11:39 AM GMT
హైకోర్టులో ఏపీ సర్కార్ సంజాయిషీ...ఎందుకంటే....
X
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. పంచాయతీ కార్యాలయాలకు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై కొందరు కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం గతంలో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కోర్టు జోక్యంతో వైసీపీ జెండా రంగులను ప్రభుత్వం తొలగించడంతో ఆ వివాదం సద్దుమణిగింది.

అయితే, తాజాగా ఏపీలో కొత్తగా ప్రారంభించిన చెత్త సేకరణ వాహనాలకు కూడా వైసీపీ జెండా రంగులు వేయడంతో ఆ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సారి కూడా ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో...ఇకపై ఏ ప్రభుత్వ కార్యక్రమానికీ వైసీపీ జెండా రంగులు వేయబోమని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది.

ఇటీవ‌ల క్లీన్ ఏపీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించేందుకు వీలుగా ఏపీలో 4 వేల పైచిలుకు చెత్త సేక‌ర‌ణ వాహ‌నాల‌కు జగన్ ప‌చ్చ‌జెండా ఊపారు. అయితే, గతంలో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్వని ఏపీ సర్కార్ తాజాగా ఆ వాహ‌నాల‌కు కూడా వైసీపీ జెండా రంగులు వేసింది. దీంతో, ఈ వ్యవహారంపై జై భీమ్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు....హైకోర్టులో పిటిషన్ వేశారు.

ప్ర‌భుత్వ వాహ‌నాల‌కు పార్టీ రంగుల‌ు వేయడంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పిటిషన్ లో కోరారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు...ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా హైకోర్టులో ఏపీ ప్ర‌భుత్వం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఆ వాహ‌నాల‌కు వేసిన వైసీపీ జెండా రంగులు తొలగిస్తున్నామని ఏపీ సర్కార్ వెల్లడించింది. దీంతోపాటు, భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి, వాహనానికి పార్టీ రంగులు వేయబోమని హైకోర్టుకు హామీ ఇచ్చింది.

ప్రభుత్వం తరఫును కోర్టుకు హాజరైన పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి జి.కె.ద్వివేది అఫిడ‌విట్‌ దాఖలు చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో, ప్రభుత్వానికి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వాహనాలకుప పార్టీ రంగులు తొలగించిన త‌ర్వాత‌.. మరోసారి తాజా అఫిడ‌విట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏది ఏమైనా...గతంలో రంగుల విషయంలో దెబ్బతిన్న జగన్ సర్కార్...మరోసారి అదే తప్పును రిపీట్ చేయడం...కోర్టు ముందు సంజాయిషీ ఇచ్చుకోవడం విమర్శలకు తావిస్తోంది.