Begin typing your search above and press return to search.

వైసీపీలో దెబ్బ తినేశామన్న సీనియర్ మంత్రి

By:  Tupaki Desk   |   21 Dec 2022 2:30 AM GMT
వైసీపీలో దెబ్బ తినేశామన్న సీనియర్ మంత్రి
X
వైసీపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ బంపర్ విక్టరీ సాధించి పవర్ ఫుల్ గా పవర్ చలాయిస్తోంది. ఆ పరిస్థితుల్లో అధికార పార్టీ వారి లెక్క ఎలా ఉండాలి. వారి దర్జా ఏ రేంజిలో వెలగాలి. వారి దూకుడు ఏ స్థాయిలో ఉండాలి. వారి మాట శాసనంగా ఉండాలి కదా. కానీ సీన్ అలా ఉందా. వైసీపీలో ఉన్న వారు అలా అనుకుంటున్నారా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అంతో ఇంతో నాయకులు కార్యకర్తలు బాగుపడిన ఉదంతాలు ఉన్నాయి.

కానీ వైసీపీ రాజ్యంలో మాత్రం మంత్రులు సామంతుల నుంచి కార్యకర్తల దాకా అంతా గోడుమంటున్నారు. మేము అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నామా అని తెల్లారిలేస్తే తమ ఒంటిని తామే గిల్లుకుని భ్రమల నుంచి బయటపడుతున్నారు. ఈ విషయాలు అన్నీ కూడా అంతా రాస్తున్నవే. మీడియాలో కూడా ప్రచారంలో ఉన్నవే. కానీ ఒక సీనియర్ నేత. వైసీపీలో కీలకమైన రెవిన్యూ శాఖను నిర్వహిస్తున్న ధర్మాన ప్రసాదరావు పుసుక్కున దీని మీద మాట అనేశారు.

అది ఆయన పాజిటివ్ వే లో అన్నా కూడా ఇపుడు టాక్ ఆఫ్ ది స్టేట్ అయి కూర్చుంది. జగన్ బర్త్ డే అని అంతా సంబరాలు చేసుకుంటున్న వేళ ధర్మాన ధర్మంగా మాట్లాడి ముఖ్యమంత్రి గారి ఏలుబడిలో పార్టీ నేతలు కార్యకర్తలు ఏమనుకుంటున్నారో వారి రియల్ పొజిషన్ ఏంటో ఒక్క ముక్కలో చెప్పేశారు. మేమంతా చెడిపోయామని ఒక్క మాట అనేశారు. అదేంటి పచ్చగా పార్టీ ఉంది. పైగా అధికారంలో ఉంది. మరి చెడిపోవడమేంటి మాస్టారూ అంటే అదే కదా మ్యాటర్ అని అంటున్నారు ధర్మాన వారు.

మేము అధికారంలో ఉన్నాం, కానీ ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు, మేమే కాదు మా కార్యకర్తలు నాయకులు కూడా చేయలేదు. పైగా ఉన్న ఆస్తులు అమ్ముకుని ఆర్ధికంగా చితికిపోయారు అని ధర్మాన వారు అసలు నిజాలు చెప్పేశారు. మేమంతా పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తున్నాం, మేము చెడిపోయినా వ్యవస్థ చెడిపోకూడదని పనిచేస్తున్నామని ఆయన అంటున్నారు. ఒక్క పైసా వైసీపీ నేతలు అవినీతి చేశారు అని రుజువు చేయగలరా అని ఆయన ప్రతిపక్షాలను సవాల్ చేశారు.

ప్రభుత్వ పధకాలు అన్నీ ఏ దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా జనం ఖాతాలలోకే వెళ్తున్నాయని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా తప్పు పట్టలేరని ధర్మాన గట్టిగా చెప్పుకున్నారు. ఏపీలో అవినీతి లేని పాలన అన్నదే తమ లక్ష్యమని ధర్మాన స్పష్టం చేశారు. అవినీతి వ్యవస్థలో మార్పు తీసుకుని వచ్చేందుకు జగన్ కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఆ మార్పు తప్పకుండా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఏలుబడిలో పూర్తిగా బ్రోకర్ల వ్యవస్థ రాజ్యమేలింది అని ఆయన విమర్శించారు. చంద్రబాబు కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారని, అవినీతి లేకుండా ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఆస్తుల మీద విచారణ కోరితే కోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటారు తప్ప నిజాలు చెప్పరంటూ ధర్మాన మండిపడ్డరు. ఎక్కడో హైదరాబాద్ లో ఉండి బాబు ఏపీ నుంచి మాట్లాడుతున్నారని ఆయన నిష్టూరమాడారు. ఏపీలో రేపటి ఎన్నికల్లో గెలవకపోతే కచ్చితంగా బాబు ఉండేది హైదరాబాద్ లోనే అని ఆయన స్పష్టం చేశారు. బాబుకు ఏపీతో అవసరం లేదని ఆయన అన్నారు.

ఈ మాటలు అన్నీ ఎలా ఉన్నా ఏపీలో వైసీపీ ఏలుబడిలో క్యాడర్ లీడర్ ఇద్దరూ దెబ్బడిపోయారు అంటూ ధర్మాన అన్న మాటలు మాత్రం ధర్మబద్ధంగా ఉన్నాయనే అంటున్నారు. పెద్దాయన చెప్పాల్సింది చక్కగా చెప్పారని కూడా అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.