Begin typing your search above and press return to search.

అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు.. అదే త‌ప్పు!

By:  Tupaki Desk   |   22 Sep 2021 10:30 AM GMT
అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు.. అదే త‌ప్పు!
X
రాజ‌కీయాల్లో ఏదీ శాశ్వ‌తం కాదు. ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు తారుమారు అవుతూనే ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీ ప్ర‌తిప‌క్ష పార్టీగా.. అప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ ఆ త‌ర్వాత అధికారం చేజిక్కించుకోవ‌డం చూస్తూనే ఉన్నాం. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన పార్టీ ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. ఆచితూచి అడుగులు వేస్తూ త‌మ అధికారాన్ని కాపాడుకోవ‌డ‌మే కాకుండా భ‌విష్య‌త్‌లోనూ తిరుగులేని విధంగా తీర్చిదిద్దుకోవాలి. కానీ గ‌త ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీ చేసిన త‌ప్పులే.. ఇప్పుడు తాము చేస్తే ఏం ఫ‌లితం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా వైసీపీ ప్ర‌భుత్వం అలాంటి ప‌ద్ధ‌తినే అనుస‌రిస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గ‌తంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ చాలా తప్పులు చేసింద‌నే వ్యాఖ్య‌లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉన్నాయి. గ‌తంలో 67 మంది శాస‌న స‌భ్యులున్న వైసీపీకి శాస‌న స‌భ‌లో మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కుండా స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌ను అడ్డుపెట్టుకుని టీడీపీ సాగించిన నియంతృత్వం గురించి తెలిసిందే. గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అనుస‌రించిన అప్ర‌జాస్వామిక విధానాల‌కు టీడీపీ భారీ మూల్య‌మే చెల్లించింది. 2019 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఘోర ఓట‌మి చ‌విచూసింది. ప్ర‌జ‌లు జ‌గ‌న్ వైపు మొగ్గు చూపి అఖండ విజ‌యాన్ని అందించారు. కానీ ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదే త‌ప్పు చేస్తున్నార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తాజాగా టీడీపీ శాస‌న స‌భాప‌క్ష ఉప నేత‌లు కింజ‌రాపు అచ్చెన్నాయుడు, నిమ్మ‌ల్ రామానాయుడికి వ‌చ్చే శాస‌న‌స‌భలో మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ హ‌క్కుల సంఘం తీర్మానించింది. దీన్ని రెండున్న‌రేళ్ల పాటు.. అంటే ఈ ప్ర‌భుత్వం ఉన్న‌న్నాళ్లూ.. ఈ అసెంబ్లీ కొన‌సాగినంత కాలం అమ‌లు చేయాల‌ని సిఫార్సు చేసింది. అంటే ఇక వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ ఈ ఇద్ద‌రు టీడీపీ నేత‌ల‌కు అసెంబ్లీలో మాట్లాడే అవ‌కాశం ఉండ‌ద‌న్న‌మాట‌. వీళ్ల‌పై ఈ చ‌ర్య తీసుకోవాల‌ని వైసీపీ ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్ ప్ర‌తిపాదించ‌గా.. మ‌రో ఎమ్మెల్యే విష్ణు బ‌ల‌ప‌రిచిన‌ట్లు స‌మాచారం.

ఇప్పుడు ఈ విష‌యంపై రాష్ట్ర రాజ‌కీయాల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో శాస‌న‌స‌భ‌లో మద్యం దుకాణాల సంఖ్య‌పై స‌భా వేదిక‌గా అచ్చెన్నాయుడు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని, పింఛ‌న్ల సంఖ్య విష‌యంలో రామానాయుడు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని వాళ్ల‌పై వ‌చ్చిన ఫిర్యాదుల‌పై వారిద్ద‌రూ స‌రైన వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డంతోనే ఇప్పుడు వాళ్ల‌కు అసెంబ్లీలో మైక్ క‌ట్ చేస్తున్నార‌నే నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని ఓ వ‌ర్గం వాద‌న‌. మ‌రోవైపు మాత్రం అధికారం ఉంద‌ని వైసీపీ క‌క్ష‌పూరితంగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఏదేమైనా అధికారంలో ఉన్న పార్టీ అన్ని విష‌యాల్లోనూ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నిపుణులు అంటున్నారు.