Begin typing your search above and press return to search.

గోరంట్ల మాధవ్ విషయంలో వైసీపీ హై కమాండ్ ఎందుకు సైలెంట్...?

By:  Tupaki Desk   |   6 Aug 2022 7:39 AM GMT
గోరంట్ల మాధవ్ విషయంలో వైసీపీ హై కమాండ్ ఎందుకు సైలెంట్...?
X
ఆయన నగ్నంగా పార్టీ పరువు తీశారని అంతా అంటున్నారు. ఆయన మాత్రం ఇదంతా మార్ఫింగ్ కుట్ర అంటూ గట్టిగా మాట్లాడుతున్నారు. విపక్షాలు అయితే దీన్ని పట్టుకుని ఎక్కడికక్కడ ఏకి పారేస్తున్నాయి. అయినా సరే వైసీపీలో చూస్తే అంతా గప్ చుప్ గా ఉన్నారు. అంతా సైలెంట్ గా ఉన్నారు. ఇంతకీ వైసీపీలో ఏమి జరుగుతోంది. ఎందుకు ఇంత మౌనం. ఈ మౌనం వెనక ఉద్దేశ్యాలు ఏంటి ఇదే ఇపుడు సొంత పార్టీ లోపలా బయటా కూడా అతి పెద్ద చర్చ సాగుతోంది.

ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ విషయానికి వస్తే ఆయన న్యూడ్ వీడియో బయటపడి అపుడే మూడు నాలుగు రోజులు గడచిపోయాయి. దాని మీద రచ్చ అంతా ఇంతా కాదు, ఒక విధంగా వైసీపీ పరువు పోయింది. నైతికంగా కూడా ఆ పార్టీకి అది పెద్ద డ్యామేజ్ అయింది. మరి గోరంట్ల మాధవ్ అయితే ఇందులో తన తప్పు ఏమీ లేదని అంటున్నారు. ఆయన తన మీద ఎవరో కుట్ర చేశారని అంటున్నారు. పదే పదే అదే చెబుతున్నారు.

అయితే ఈ విషయంలో మొదటి రోజు బయటకు వచ్చి గట్టిగా గర్జించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆ తరువాత మాత్రం పార్టీ నుంచి మరే విధమైన అప్ డేట్ ఇవ్వలేకపోయారు. నిజానికి గోరంట్ల చేసిన డ్యామేజ్ వైసీపీని మొత్తం చుట్టేస్తోంది. అయినా సైలెంట్ గా ఉండడం అంటే దీని వెనక ఆ పార్టీ పెద్దల వ్యూహం ఏమై ఉంటుంది అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.

అంతే కాదు తాజాగా ఢిల్లీలో జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగులో గోరంట్లను ఆహ్వానించారు. ముందు వరసలో కూర్చోబెట్టారు. దీంతో ఈ ఫోటోలను బయటకు వదిలిన టీడీపీ వైసీపీ మీద ఇంకా పెద్ద ఎత్తున విరుచుకుపడింది. వైసీపీ పెద్దలు ఇంత జరిగినా గోరంట్లకు పెద్ద పీట ఎలా వేస్తారు అని కూడా టీడీపీ నేతలు గట్టిగా నిలదీస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే అటు గోరంట్ల కూడా తాను శీల పరీక్షకు సిద్ధమని అంటున్నారు. తాను తప్పు చేయలేదని కూడా గట్టిగా చెబుతున్నారు. మరో వైపు ఈ విషయం బయటకు వచ్చాక ప్రభుత్వం కూడా ఈ న్యూడ్ వీడియోను ఫోరెన్సిక్ లాబ్ కి పంపిందని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఆ నివేదిక వచ్చాక తగిన చర్యలు ఉంటాయని కూడా పేర్కొన్నారు. మరి ఆ నివేదిక ఇంతకూ వచ్చిందా. వచ్చినా కూడా దానిని బయటపెట్టలేదా అన్నది కూడా మరో వైపు జరుగుతున్న చర్చగా ఉంది.

నిజానికి ఫోరెన్సిక్ నివేదిక రావడానికి ఎంత టైం పడుతుంది. ఇప్పటికి నాలుగు రోజులు గడిచాయి. ఇష్యూ చూస్తే సీరియస్ గానే ఉంది మరి. ఇలా రోజుల తరబడి రచ్చ సాగడం వల్ల వైసీపీకే అది దెబ్బ అంటున్నారు. అందువల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అన్న మాట కూడా ఉంది. అయితే నివేదిక అంటూ టైమ్ పాస్ చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయట.

ఎందుకంటే గోరంట్ల మీద యాక్షన్ తీసుకుంటే ఆయన ఒక్కడితోనే ఇది ఆగిపోదు. ఇపుడు సోషల్ మీడియాలో మరో ఇద్దరి పేర్లు నలుగుతున్నాయి. వారే మాజీ తాజా మంత్రులు అవంతి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు. ఈ ఇద్దరు మీద కూడా యాక్షన్ తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. వీరిని వదిలేసి కేవలం గోరంట్ల మీదనే యాక్షన్ అంటే అది కులపరమైన వివక్షకు దారి తీస్తుంది. మాధవ్ బోయ సామాజికవర్గానికి చెందిన వారు. పక్కా బీసీ. మరి అగ్ర కులానికి చెందిన ఇద్దరు పెద్దలను వదిలేసి మాధవ్ మీద యాక్షన్ అంటే ఆయన బీసీ కాబట్టే సులువుగా యాక్షన్ కి దిగిపోయారు అన్న విమర్శలు కూడా వస్తాయి.

ఒక వేళ యాక్షన్ అంటూ అందరి మీద తీసుకుంటే అంబటి రాంబాబు పదవి కూడా పోతుంది. మరి అదే జరిగితే వైసీపీలో ముసలం కూడా బయలుదేరుతుంది. కాపులు కూడా పెద్ద ఎత్తున మండిపోతారు. అసలే కాపులు వైసీపీ పట్ల గుర్రుగా ఉన్నారు. ఇలా అనేక రకాలైన సమీకరణలు, సామాజిక రాజకీయ ఆంటంకాలు. లెక్కలు ఇబ్బందులు వీటన్నింటి మధ్యనే వైసీపీ అధినాయ‌కత్వం కొట్టుమిట్టాడుతోంది అంటున్నారు. అందువల్లనే సైలెంట్ అయింది అంటున్నారు. కొద్ది రోజుల్లో ఈ వివాదం సమసిపోతుంది అన్న ఆశతో కూడా పెద్దలు ఉన్నారని అంటున్నారు. కానీ ఈ ఇష్యూ ని ఒక పొలిటికల్ కంక్లూషన్ కి తీసుకువచ్చేదాకా టీడీపీ ఊరుకునేలా కనిపించడంలేదు అంటున్నారు. దాంతో కచ్చితంగా వైసీపీ ఇబ్బందుల్లో పడడం ఖాయమనే అంటున్నారు.