Begin typing your search above and press return to search.

విరాళాల్ని సైతం ఖర్చు పెట్టని పార్టీగా దేశంలో ఫస్ట్ ప్లేస్ జగన్!

By:  Tupaki Desk   |   28 May 2022 2:30 PM GMT
విరాళాల్ని సైతం ఖర్చు పెట్టని పార్టీగా దేశంలో ఫస్ట్ ప్లేస్ జగన్!
X
మన డబ్బులకి.. ఎదుటోడి డబ్బులకు తేడా చాలానే ఉంటుంది. ఎదుటోడి చేత ఉత్తరగా ఖర్చు చేయించేటోళ్లు.. తమ చేతిలోని పైసలు తీసేందుకు మనసు ఒప్పదు కానీ.. ఎదుటోడి జేబులోని డబ్బుల్ని ఖర్చు చేయించేటోళ్లు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటారు. అలాంటి సీన్ గుర్తుకు వచ్చే వివరాలు బయటకు వచ్చాయి. ప్రజలు కట్టే పన్నుల్ని జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన ప్రభుత్వాలు.. పప్పు బెల్లాల మాదిరి ఖర్చు చేయటమే కాదు.. వాటి కోసం అప్పుల్ని సైతం భారీగా చేసే పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. అలాంటి పార్టీల్లో ఒకటి వైసీపీ.

ప్రజాసంక్షేమాన్ని కాదంటావా? నీకెంత ధైర్యం. బడుగు జీవి బాగుపడుతుంటే ఇలాంటి మాటలు మాట్లాడటానికి నీకేం పోయేకాలం అంటూ కొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేయొచ్చు. కానీ.. మొత్తం చదివిన తర్వాత ఈ గుస్సా పోవటం ఖాయం. ఎందుకంటే.. తాజాగా వెల్లడైన వివరాల ప్రకారం దేశంలోని రాజకీయ పార్టీల్లో.. తమకు వచ్చిన విరాళాల్ని సైతం ఖర్చు చేయకుండా ఎక్కువగా తమ వద్దే ఉంచుకున్న పార్టీగా తొలిస్థానాన్ని సొంతం చేసుకుంది ఏపీ అధికారపక్షమైన వైసీపీ.

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయ వ్యయ లెక్కల ఆధారంగా చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో వైపీపీకి రూ.107.89 కోట్ల విరాళాలు దక్కాయి. అందులో ఆ పార్టీ ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.80 లక్షలు మాత్రమే.

అదే సమయంలో విపక్ష తెలుగుదేశం పార్టీకి రూ.3.25 కోట్ల విరాళాలు రాగా.. రూ.54.76 కోట్లు ఖర్చు చేసింది. ఇక.. తెలంగాణ అధికారపక్షమైన టీఆర్ఎస్ కు రూ.37.65 కోట్ల ఆదాయం రాగా.. అందులో రూ.22.34 కోట్లను ఖర్చు చేసింది. మజ్లిస్ విషయానికి వస్తే ఆ పార్టీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.62 కోట్ల మొత్తం విరాళాల రూపంలో వస్తే అందులో రూ.19.4 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది.

మొత్తంగా చూస్తే.. తమకు వచ్చే విరాళాలకు దాదాపు 1584 శాతం అధికంగా తెలుగుదేశం పార్టీ ఖర్చు చేస్తే.. అధికార వైసీపీ మాత్రం తనకు వచ్చిన విరాళాల్లో (ఆర్థిక సంవత్సరం లెక్క మాత్రమే) కేవలం 0.75 శాతం(అంటే ఒక శాతం కంటే తక్కువ) మాత్రమే ఖర్చు చేయటం గమనార్హం. దేశంలో అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా తమిళనాడు అధికార పక్షమైన డీఎంకే నిలిచింది.

రూ.149.95 కోట్లు విరాళాల రూపంలో వస్తే.. తర్వాతి స్థానం వైసీపీ సొంతమైంది. ఆ పార్టీకి రూ.107.99 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. మూడో స్థానంలో బీజేడీ నిలిచింది. ఆ పార్టీకి రూ.73.34 కోట్లు విరాళాలుగా వచ్చాయి. టీఆర్ఎస్ కు రూ.37.65 కోట్లు రాగా.. విరాళాలు వచ్చిన జాబితాలో పదకొండో స్థానంలో టీడీపీ నిలిచింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అత్యధిక విరాళాలు పొందిన పార్టీల జాబితాలో వైసీపీ రూ.96.25 కోట్లతో మొదటి స్థానంలో నిలిస్తే.. డీఎంకే రూ.80 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.