Begin typing your search above and press return to search.

ఏపీపై కేంద్రం సవతితల్లి ప్రేమ: విజయసాయిరెడ్డి

By:  Tupaki Desk   |   1 Feb 2021 4:01 PM GMT
ఏపీపై కేంద్రం సవతితల్లి ప్రేమ: విజయసాయిరెడ్డి
X
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ నాయకత్వం పూర్తిగా లొంగిపోయిందని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తున్న తరుణంలో ఆశ్చర్యకరమైన ఎదురుదాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. వైసీపీలో నంబర్ 2.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయ్ సాయి రెడ్డి బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. కేంద్రం బడ్జెట్ లో ఏపీని విస్మరించిందని విమర్శించారు.

బడ్జెట్‌లో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపించిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. త్వరలో ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాల్లోని ప్రజలను ప్రసన్నం చేసుకోవటానికి తమిళనాడు, అస్సాం, కేరళ మరియు బెంగాల్ లకు నిధులు కురిపించారని మండిపడ్డారు. ఎన్నికల ఆధారిత బడ్జెట్‌గా ఇది కనిపిస్తుందని విజయసాయి రెడ్డి బడ్జెట్ ప్రకటన తర్వాత విలేకరుల సమావేశంలో తూర్పార పట్టారు.

ఆరు సంవత్సరాలుగా రాష్ట్రానికి మెట్రో రైలు ప్రాజెక్టును మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినా బడ్జెట్ లో పెడచెవిన పెట్టారని విజయసాయిరెడ్డి విమర్శించారు. కేంద్రం దీనిని పరిగణించలేదని, చెన్నై, కొచ్చి, బెంగళూరులకు మెట్రో రైలు ప్రాజెక్టులకు భారీగా నిధులు మంజూరు చేశారని విమర్శించారు. త్వరలో ఎన్నికలు జరగనుండమే అక్కడ నిధుల వరదకు కారణమని ఆక్షేపించారు..

"విజయవాడ, విశాఖపట్నం కోసం మెట్రో రైలు ప్రాజెక్టుల గురించి ప్రస్తావించకపోవడం దురదృష్టకరం, దీనికి గతంలో అనేక సార్లు లేవనెత్తినా కేంద్రం ప్రాధాన్యత ఇవ్వలేదని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తావించదగిన ఒక్క రైల్వే ప్రాజెక్టును కూడా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించలేదని, రాష్ట్రాన్ని కలిపే ఏకైక కారిడార్ మంజూరు చేశారని.. ఇది రాష్ట్రానికి ఉపయోగపడదని విమర్శించారు. కిసాన్ రైళ్లలో రాష్ట్రానికి ప్రస్తావించలేదని ఆయన అన్నారు.

వరి సేకరణకు రాష్ట్రానికి 4,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు గురించి కేంద్రం మాట్లాడటం లేదని సాయిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఉపాధిహామీ పథకానికి నిధుల విడుదల గురించి బడ్జెట్‌లో మాట్లాడలేదని మండిపడ్డారు.