Begin typing your search above and press return to search.

నా గ్లాసులో నీరుంది చూడు బాబూ....ఇంతకీ జగన్ చెప్పేదేంటి...?

By:  Tupaki Desk   |   25 Dec 2022 2:30 AM GMT
నా గ్లాసులో నీరుంది చూడు బాబూ....ఇంతకీ జగన్ చెప్పేదేంటి...?
X
ఈ మధ్య జగన్ తన మాటల దూకుడు పెంచారు. అంతే కాదు ప్రత్యర్ధుల మీద పంచులు వేస్తున్నారు. అదే సమయంలో కొన్ని ఉదాహరణలను తెలిసిన సామెతలను కూడా ప్రసంగాలలో తగిలించి మసాలా అద్దుతున్నారు. తన సొంత గడ్డ కడప జిల్లాలో జగన్ ప్రస్తుతం టూర్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా పులివెందులలో అనేక ఆభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశారు. అక్కడ జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ మా గ్లాస్ లో నీళ్ళు నిండా ఉన్నాయి చూడు బాబూ అని చంద్రబాబుని ఉద్దేశించి సెటైర్లు వేశారు. గ్లాస్ ఏంటి నీరేంటి అని ఎవరైనా డౌట్ పడవచ్చు. కానీ జగన్ అందరికీ తెలిసిన విషయమే తన పంధాలో చెప్పారు.

గ్లాసులో నీళ్ళు ముప్పావు వంతు ఉంటే పావు వంతు ఎపుడూ ఖాళీగా ఉంటుంది. పాజిటివ్ గా చూసేవారు ముప్పావు వంతు నీరు ఉంది అంటారు. నెగిటివిటీతో ఆలోచించేవారికి గ్లాస్ లో పావు వంతు నీరే కనిపిస్తుంది. అలా తమ ప్రభుత్వంలో నూటికి తొంబై తొమ్మిది హామీలు తీర్చి అన్ని వర్గాలకు మేలుచ్ చేస్తున్నా కూడా చంద్రబాబు మాత్రం పూర్తి నెగిటివిటీని పెంచుకునే అలాగే ఆలోచిస్తూ తన అనుకూల మీడియా ద్వారా విషయం చిమ్ముతున్నారు అని జగన్ విమర్శించారు.

చంద్రబాబుకు ఎపుడూ తమ ప్రభుత్వంలో మంచి కనబడదు అనడానికే ఈ గ్లాస్ నీళ్ళు ఉదాహరణ అని అంటున్నారు. పులివెందులలో అభివృద్ధి కానీ ఏపీలో ప్రగతి కానీ బాబుకు అసలు కనిపించకపోవడం విడ్డూరం కాదని, ఆయన నెగిటివిటీకి అది ఉదాహరణ అని జగన్ విమర్శలు గుప్పించారు. ఇక జగన్ మరో మాట కూడా అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అప్పులు చేస్తున్నామని అంతా అంటున్నారు.

కానీ అప్పులు ఎక్కువగా చేసింది చంద్రబాబు ప్రభుత్వమే అని ఆయన ఆరోపిస్తున్నారు. అప్పులు అన్నీ కూడా విరివిగా చేసి వాటికి సంబంధించిన ఖర్చు ఎక్కడ చేశారో కూడా చెప్పకుండా దోచుకున్నది బాబు సర్కార్ అని ఆయన అంటున్నారు. అదే తమ ప్రభుత్వంలో అప్పులు తక్కువగా చేశామని, దాన్ని సంక్షేమానికి ఉపయోగిస్తున్నామని, ప్రజలకు నేరుగా వారి ఖాతాలలో నగదు వేసిన ఘనత తమ సర్కార్ కే దక్కుతుంది అని జగన్ చెప్పారు. తమ ప్రభుత్వం మంచి చేస్తోందని, పేదల కోసం పాటు పడుతోందని, అవినీతి లేని పాలనను ఏపీలో అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు.

అయితే ప్రభుత్వం మీద ఎపుడూ బురద జల్లాలనుకునే చంద్రబాబుకు ఇతర పక్షాలకు మాత్రం ఇవేమీ పట్టవని, ఎందుకంటే వారు తమ మీద గురి పెట్టి విమర్శలు చేస్తున్నారు కనుక అంటున్నారు జగన్. మొత్తానికి జగన్ చెప్పేది ఏంటి అంటే తమ గ్లాసులో నిండా నీళ్ళు ఉన్నాయని. వాటిని చూసేందుకు మాత్రం బాబుకు మనసు లేదని, ఆయన వ్యతిరేకతతోనే ఉన్నారని. మరి జగన్ గ్లాసు లో నీళ్ళు ఉన్నాయా లేవా అన్నది బాబు కాదు జనాలు కూడా చెప్పాల్సి ఉంది. అదే అసలైన ప్రజా తీర్పు కూడా.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.