Begin typing your search above and press return to search.

వై నాట్ అంటే ఎలా : ఓవర్ అయిందేమో జగన‌న్నా...?

By:  Tupaki Desk   |   9 Jun 2022 6:37 AM GMT
వై నాట్ అంటే ఎలా :  ఓవర్ అయిందేమో  జగన‌న్నా...?
X
ప్రతి మనిషికీ ఆత్మ విశ్వాసం ఉండాలి. అలాగే ప్రతీ పార్టీకి కూడా కావాల్సింది అదే. ఇక అధినేతలు తమ క్యాడర్ ని ఉత్సాహపరచడానికి పార్టీ సభలలో బహిరంగ సమావేశాలలో కాస్తా అతి మాటలు చెబుతూంటారు. అవి సరిగ్గా అతకకపోయినా క్యాడర్ ఫుల్ జోష్ లో ఉంచడానికి మాత్రం పనికి వస్తాయి. కానీ నాయకులతో చేసే పార్టీ సమీక్ష అంటే మాత్రం అది నిజాయతీగా జరగాలి. ఉన్నది ఉన్నట్లుగా తెసుకోవాలి. అపుడే ఉత్తమ ఫలితాలు వస్తాయి.

కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ అధినేత హోదాలో చేస్తున్న సమీక్షలలో ఆ నిజాయతీ ఉందా అన్నదే ఇక్కడ చర్చ. తాజాగా పార్టీకి చైందిన మంత్రులు, పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో నిర్వహించిన వర్క్ షాప్ లో జగన్ మాట్లాడుతూ 175 కి 175 సీట్లూ ఎందుకు సాధించకూడదు అని పార్టీ వారినే ప్రశ్నించారు. వై నాట్ అని కూడా ఆయన మరో ప్రశ్న వేశారు.

మనం సాధించాలీ అనుకుంటే తప్పకుండా సాధిస్తామని కూడా ఆయన చెప్పారు. కుప్పం మునిసిపాలిటీలో గెలుస్తామని అనుకున్నామా అని ఒక ఉదాహరణ కూడా వినిపించారు. అయితే కుప్పం కధ వేరు, టోటల్ స్టేట్ కధ వేరు. అంతే కాదు, కుప్పం సహా లోకల్ బాడీస్ కి జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలిచింది అంటే ఆ కధ వేరు. కానీ రేపటి రోజున జరిగే జనరల్ ఎలక్షన్స్ లో జరిగే స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది.

మరి పార్టీ పెట్టి పుష్కర కాలం అయింది. ఎన్నో రాజకీయ యుద్ధాలలో ఆరితేరిన జగన్ కి ఈ చిన్నపాటి లాజిక్ అర్ధం కాలేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆయన వై నాట్ అంటే జవాబు ఏ వైసీపీ మినిష్టర్ కానీ నాయకుడు ఇవ్వగలడు కానీ లాజిక్ మిస్ అయి ఆయన చేస్తున్న 175 కి 175 అన్న వాదన మాత్రం పూర్తిగా అర్ధరహితం అనే అంటున్నారు అంతా. ఇక 151 సీట్లు మనం 2019లో సాధించామ‌ని జగన్ చెప్పుకున్నారు.

అపుడు జగన్ కేవలం పార్టీ అధినేత మాత్రమే. ఆయన పాలన ఎలా ఉంటుందో ఆనాటికి ఎవరికీ తెలియదు. ఆయన తన తండ్రి వైఎస్సార్ లా పాలిస్తారు అన్న ఉత్సాహంతో పాటు యువకుడిగా జగన్ ఏమి చేస్తారో అన్న ఆసక్తి కూడా ఆయనకు అన్ని సీట్లు రావడానికి కారణం అయింది. అంతే కాదు నాటి టీడీపీ సర్కార్ మీద ఉన్న వ్యతిరేకత కూడా జగన్ కి ఈ బంపర్ విక్టరీ దక్కేలా చేసింది.

అయితే 2019 నాటి మాదిరిగా 151 సీట్లూ అలాగే ఉంటాయని, అదనంగా మరో 24 వాటిలోకి వచ్చివాటిలో చేరతాయ‌ని జగన్ అనుకుంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రమే అంటున్నారు. అదెలా అంటే 2024 ఎన్నికల్లో జనాలు జగన్ని సీఎం గా చూసి ఓటు వేస్తారు. ఆయన అయిదేళ్ళ పాలన తీరుని చూసి ఓట్లు వేస్తారు. అంతే కాదు ఆయన పార్టీ ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ కూడా చూసి ఓటు వేస్తారు. ఓవరాల్ గా ప్రతీ చిన్న విషయాన్ని చూసి ప్రజలు ఓటు వేస్తారు.

అలా చూసుకుంటే యాంటీ ఇంకెంబెన్సీ కచ్చితంగా వైసీపీకి ఉంటుంది. దాన్ని గుర్తించకుండా 175 కి 175 సీట్లు అని జగన్ అంటే కచ్చితంగా ఆయన భ్రమలలో ఉన్నారనే అంటున్నారు. ఇక కుప్పం దగ్గరకే మళ్ళీ వస్తే అక్కడ పూర్తిగా చంద్రబాబు తప్పిదం ఉంది. ఆయన 1989లో తొలిసారి గెలిచినపుడు తప్ప మరెప్పుడూ ప్రచారం అయితే చేయలేదు. ఆయన నామినేషన్ ఎవరో దాఖలు చేసేవారు. ఎవరో గెలుపు పత్రాన్ని తీసుకునేవారు బాబు గత మూడు దశాబ్దాల కాలంలో కుప్పం వెళ్ళినది బహు తక్కువ.

ఆ విధంగా ఆయన మీద ఉన్న అసంతృప్తి కూడా వైసీపీకి కలసి వచ్చి కుప్పం మునిసిపాలిటీ సీటు గెలుచుకోవడం జరిగింది. పైగా అధికారంలో వైసీపీ ఉంది. లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి జనాలు మొగ్గు చూపినా చూపవచ్చు. మరి కుప్పంలో మాదిరిగా అన్నిటా ఏపిలో గెలిచేస్తామని జగన్ అనుకోవడం అంటే అది గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ కి అద్దం పట్టనట్లుగానే చూడాలి.

ఇక కుప్పం సంగతి పక్కన పెడితే ఏపీలో టీడీపీ చాలా చోట్ల బలంగా ఈ రోజుకీ ఉంది. ఒక్క ఎన్నికలో ఓడిపోతే పోవచ్చు కాక మరి అక్కడ వారిని వచ్చే ఓడించగలరా. అలాగే వైసీపీ తరఫున ప్రస్తుతం గెలిచిన 151 మంది కూడా బలవంతులైన వారేనా. టీడీపీ సీట్లలో వారిని ఓడించే సత్తా గలవారు 175 సీట్లలోనూ వైసీపీకి ఉన్నారా ఇవన్నీ ప్రశ్నలే.

ఇక ఒక్క సీటే కాబట్టి అది కూడా లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి కుప్పం మునిసిపాలిటీ మీద వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టగలిగింది. మరి అదే తీరున రేపటి రోజున మొత్తం 175 సీట్ల మీద ఫోకస్ పెట్టడం వైసీపీ వల్ల అవుతుందా. అందువల్ల 175 వై మనవే వైనాట్ అంటూ చెప్పుకోవడానికి ఇవనీ బాగుంటాయి కానీ గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ వేరుగా ఉంటాయి. మొత్తానికి తేలేది ఏంటి అంటే వర్క్ షాప్ లో జగన్ చేసిన ప్రసంగం ఓవర్ కాన్ఫిడెన్స్ గానే అంతా చూస్తున్నారుట. మరి ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ అసలు నిజాలు విస్మరిస్తే మొదటికే చేటు అన్న మాట సొంత పార్టీ నుంచే వస్తోంది. తస్మాత్ జాగ్రత్త.