Begin typing your search above and press return to search.

జ‌గ‌న‌న్న పాల‌న‌లో అవినీతి చిట్టా... విప్పింది వైసీపీ నేత‌లే!

By:  Tupaki Desk   |   25 Jun 2022 2:30 AM GMT
జ‌గ‌న‌న్న పాల‌న‌లో అవినీతి చిట్టా... విప్పింది వైసీపీ నేత‌లే!
X
ఏపీలోని వైసీపీ స‌ర్కారు పాల‌న అద్భుతంగా ఉంద‌ని.. ప్ర‌జ‌ల‌కు పార‌ద‌ర్శ‌క పాల‌న చేరువ అవుతోంద‌ని ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఆయ‌న పాల‌న తాలూకు వ్య‌వ‌హారంపై ఆయ‌న పార్టీ నేత‌లే బ‌హిరంగంగా చేస్తున్న విమ‌ర్శ‌లు.. విప్పుతున్న అవినీతి చిట్టాలు.. ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీడీవో కార్యాలయం.. అవినీతికి కేంద్రంగా మారిపోయింద‌ని.. వైసీపీ నేత‌లే గ‌గ్గోలు పెట‌ట్ఆరు.

వైసీపీకి చెందిన ఎంపీపీ పోరెడ్డి అరుణ అవినీతి చిట్టాను బ‌య‌ట ప‌ట్టారు. అది కూడా స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఎంపీడీవో టి.హనుమంతరావు ఏఏ పనులలో ఏవిధంగా దొంగబిల్లులు పెట్టి సొమ్ము డ్రా చేసుకొంటున్నదీ చదివి వినిపించారు. ఆయన ప్రతీ నెల లక్షకు తక్కువ కాకుండా సుమారు రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వ సొమ్ము స్వాహా చేస్తున్నారని పోరెడ్డి అరుణ ఆరోపించారు. ఒక వాలంటీరు ఉద్యోగానికి రూ.7 వేల‌ నుంచి రూ.10,000 లంచం తీసుకొంటున్నారని ఆరోపించారు.

సచివాలయం ఉద్యోగులు, పంచాయతీ పరిధిలో కార్మికులకు జీతాలు చెల్లించాలంటే నెలనెలా కనీసం రూ.35,000 ముట్ట జెపితేనే, ట్రెజరీ నుంచి క్యాష్ డ్రా చేసి ఇస్తారని లేకుంటే ఉద్యోగులు, కార్మికులకు సకాలంలో జీతాలు అందకుండా ముప్పాతి ప్పలు పెడుతున్నారని ఆరోపించారు. అధికార‌ పార్టీకే చెందిన ఎంపీడీవో ఈవిదంగా అవినీతికి పాల్పడుతున్నారని సమావేశంలో అందరి ముందు కుండబద్దలు కొట్టినట్లు బయటపెట్టగా, అదేస‌మ‌యంలో ఎంపీడీవో కూడా అరుణ దంపతుల అవినీతి భాగోతం బయటపెట్టడం మరో విశేషం.

ఎంపీడీవో హనుమంతరావు ఆమెకు బదులిస్తూ, “మీ ఆయన చెంచి రెడ్డి ప్రతీ నెల లక్ష రూపాయలు ఇవ్వాలని నన్ను వేధిస్తున్నారు. అయినా ఏమీ తెలియనట్లు నేనే అవినీతిపరుడిని అన్నట్లు ఆరోపణలు చేయడం సరికాదు. మండల పరిషత్తుకి ఏడాదికి జనరల్ ఫండ్ కింద వచ్చేది కేవలం రూ.10 లక్షలే అయితే మీకు నెలనెలా లక్ష రూపాయలు నేనెక్కడి నుంచి తెచ్చివాలి? మా ఇంట్లో డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయనుకొన్నారా?” అని ప్రశ్నించేసరికి అందరూ నివ్వెరపోయారు.

ఈ ప‌రిణామాల‌తో విస్తుపోయిన ఎంపీపీ పోరెడ్డి అరుణ, ఆమె భర్త చెంచిరెడ్డి ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎంపీడీవో హనుమంతరావు కూడా వారిని అదే స్థాయిలో ఎదుర్కోవడంతో సమావేశం రసాభాసగా మారింది. చివరికి మిగిలిన సభ్యులు కలుగజేసుకొని వారిని శాంతింపజేశారు.

అయితే వైసీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారనే విషయం స్ప‌ష్టం కావ‌డం.. ఎంపీపీ, ఏపీడీవో స్థాయిలోనే ఇన్ని లక్షల అవినీతి జరుగుతుంటే మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల స్థాయిలో ఎంత అవినీతి జరుగుతోందో అన్న చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.