Begin typing your search above and press return to search.

పాలిటిక్స్ ని సెట్ చేస్తున్న జగన్.. ?

By:  Tupaki Desk   |   15 Oct 2021 11:30 PM GMT
పాలిటిక్స్ ని సెట్ చేస్తున్న జగన్.. ?
X
నేను ట్రెండ్ సెట్టర్ ని కాదు, క్రియేటర్ ని అని వైఎస్ జగన్ అంటున్నారు. అది నిజం కూడా. ఆయన మాదిరిగా రాజకీయాల్లో రాణించిన వారు లేరు. ఒకే ఒక్కడుగా ముందుకు వచ్చి ఈ రోజు ఏపీని మొత్తం వైసీపీతో నింపేసిన జగన్ సరిసాటి లీడర్ వర్తమానంలో లేరనే చెప్పాలి. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ఫ్యాన్ గిర్రున తిరిగేస్తోంది. ఏపీలో రెండో పార్టీకి నో చాన్స్ అన్న బోర్డుని పెట్టి మరీ రాజకీయ రచ్చ చేస్తున్నారు జగన్. ఇవన్నీ పక్కన పెడితే జగన్ రెండున్నరేళ్ళ పాలనలో అవినీతి అన్న మాట లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయన మీద ఎన్నో ఆరోపణలు విపక్షాలు చేస్తున్నా ఆవినీతి అన్న నింద మాత్రం వేయలేకపోతున్నాయి. దానికి ఆధారాలు కూడా ఎక్కడా లేవు. జగన్ నుంచి నేరుగా లబ్దిదారుల అకౌంట్ లోకే నగ‌దు బదిలీ జరగడం వల్ల మధ్య దళారీలు ఎవరూ లేరు. దాంతో ఏపీలో సంక్షేమం క్షేమంగా సాగుతోంది. అలాగే ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా జగన్ పర్యవేక్షణలోనే సాగుతున్నాయి.

ఇక పాలనాపరమైన అవినీతిని బాగా అదుపు చేసిన జగన్ రాజకీయ అవినీతికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నారుట. అదెలా అంటే ఎన్నికల్లో కోట్లకు కోట్లు డబ్బులు గుమ్మరించి గెలవడం ఆ మీదట విచ్చలవిడిగా సంపాదించడం. ఇలా ఒక రకమిన విష చక్రంలో రాజకీయం పడి నలుగుతోంది. ఎందుకు రాజకీయ అవినీతి సాగుతోంది అంటే జనాల నుంచి ఓటుకు నోట్లు ఇచ్చి కొంటున్నారు కాబట్టి అన్న సింపుల్ ఆన్సర్ వస్తోంది. మరి దాన్ని మొదట్లోనే తుంచేస్తే రాజకీయంగా కొంత ప్రక్షాళన జరుగుతుంది కదా అన్న వినూత్న ఆలోచన జగన్ లో ఉంది. నిజానికి వైసీపీ నేతలు కూడా 2019 ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టారన్న ప్రచారం ఉంది.

కానీ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఈ ఖర్చులను జగన్ బాగా తగ్గించగలిగారు. దానికి ఆయన పార్టీ నేతలకు ఇచ్చిన సందేశం, భరోసా ఏంటి అంటే మనం ప్రజలకు ఎన్నడూ కనీ వినీ ఎరగని విధంగా పధకాలు అమలు చేస్తున్నాం. కాబట్టి వారికి ప్రత్యేకంగా డబ్బులు ఎందుకు పంచడం అన్న లాజిక్ పాయింట్ తో వెనక్కు తగ్గేలా చేశారు, ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎనికల్లో కూడా జగన్ తమ పార్టీ నేతలకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు ఒక్క రూపాయి కూడా ఓట్ల కోసం ఖర్చు చేయవద్దు అన్నదే ఆ ఆదేశం. దాంతో టీడీపీ కూడా నాడు సంతోషించింది. అధికార పార్టీయే ఇలా ఉండడంతో ఆ పార్టీ కూడా ఖర్చు చేయలేదు. దాంతో తిరుపతి ఉప ఎన్నిక ఒక విధంగా క్లీన్ గానే సాగింది.

ఇక ఇపుడు బద్వేల్ ఉప ఎన్నిక ఉంది. అది కూడా జగన్ సొంత జిల్లాలో జరుగుతోంది. మరి అక్కడ ఎలా అంటే సేమ్ టూ సేమ్ తిరుపతి బై పోల్ లాగానే అంటున్నారుట జగన్. ఒక్క పైసా కూడా తీయవద్దు. ప్రభుత్వం రెండున్నరేళ్ళుగా ఏం చేసింది అన్నదే జనాలకు చెప్పడి. ఆ విధంగానే ప్రచారం చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది అని నేతలకు జగన్ దిశా నిర్దేశం చేశారుట. వైసీపీ నుంచి ఈ రకమైన వైఖరి ఉండడాన్ని అక్కడ పోటీలో ఉన్న ప్రతిపక్షాలు కూడా స్వాగతిస్తున్నాయట. నిజానికి అధికారంలో ఉన్న పార్టీ ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేయగలదు, దాంతో పోటీ పడే సత్తా విపక్షాలు అసలు ఉండదు, జగన్ నిర్ణయంతో తమ నెత్తిన పాలు పోశారని వారు మనసులో భావిస్తున్నారుట.

అయితే జగన్ ఈ రకంగా ఆలోచించడం వెనక మరో వ్యూహం కూడా ఉంది అంటున్నారు. 2024 ఎన్నికల వేళ తన పధకాలకు ఓట్లు వస్తాయా రావా. ఎన్నికల్లో డబ్బులు పంచకుండా క్లీన్ గా నీట్ గా వ్యవహరిస్తే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూసేందుకే జగన్ తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికలు అన్నవి ప్రయోగాత్మకంగా ఎంచుకున్నారు అంటున్నారు మొత్తానికి చూస్తే జగన్ రాజకీయాల్లో ఎంతో కొంత అవినీతి లేని విధానం తీసుకురావలని అనుకుంటున్నారు. ఆ విషయంలో ఆయన విజయం సాధిస్తే మాత్రం రానున్న రోజుల్లో ఏపీలోనే కాదు దేశంలోనూ ఎంతో కొంత నీట్ క్లీన్ పాలిటిక్స్ కి దారి చూపించినట్లు అవుతుంది అని మేధావులు కూడా అంటున్నారు.