Begin typing your search above and press return to search.

మాధవ్ పై వేటేస్తే ఏం జరుగుతుందంటే?

By:  Tupaki Desk   |   9 Aug 2022 2:30 AM GMT
మాధవ్ పై వేటేస్తే ఏం జరుగుతుందంటే?
X
ఎంపీ గోరంట్ల మాధ‌వ్ ను స‌స్పెండ్ చేయాల‌ని నిన్న‌టి వేళ శ్రీ‌కాకుళం లో తెలుగు త‌మ్ముళ్లు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. హిందూపురంలో తెలుగు త‌మ్ముళ్లు చేయ‌లేని ప‌ని, శ్రీ‌కాకుళంలో తెలుగు త‌మ్ముళ్లు చేసి తమ ఆవేద‌న‌కు అర్థం ఇది అని నిరూపించారు. దీంతో మాధ‌వ్ విష‌య‌మై వైసీపీ మాట్లాడాల్సిన స‌మ‌యం రానే వ‌చ్చింది. కానీ వైసీపీలో ఓ అంత‌ర్మ‌థ‌నం సాగుతోంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే మాధవ్ ను స‌స్పెండ్ చేస్తే బీసీ వ్య‌తిరేక ప్ర‌భుత్వం అన్న‌వాద‌న ఒక‌టి స్థిరం అయిపోతుందున్న ఆందోళ‌న ఒక‌టి జ‌గ‌న్ లో ఉంద‌ని తెలుస్తోంది. అందుకే స‌స్పెన్ష‌న్ పై ఊగిస‌లాటలు సాగుతున్నాయి.

పార్టీ నుంచి త‌న‌ను స‌స్పెండ్  చేస్తే చేయండి కానీ ఎంపీ ప‌ద‌వికి మాత్రం రాజీనామా చేయ‌మ‌ని త‌న‌కు చెప్ప‌వ‌ద్ద‌ని గోరంట్ల మాధ‌వ్ అంటున్నార‌ని కూడా తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఎంపీ గోరంట్ల మ‌రింత బ‌ల‌ప‌డ్డారా లేదా ఆయ‌న బ‌లం మ‌రింత పెంచేందుకు కొంద‌రు అదే ప‌నిగా ఆయ‌న‌కు మ‌ద్దతుగా ఉంటున్నారా ? ఇదేవిష‌య‌మై రోజా స్పందించారు కానీ అవి కూడా స‌హేతుకంగా లేని మాట‌లే ! అయి ఉన్నాయి. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ మాధ‌వ్ ఇష్యూ, అనంత బాబు ఇష్యూ ఈ రెండూ కూడా వైసీపీకి తల‌నొప్పిగానే ఉన్నాయి.

అనంత బాబును పార్టీ నుంచి స‌స్పెండ్ చేసే విష‌య‌మై చాలా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న జ‌రిగింది. ఆఖ‌రికి ఆయ‌న్ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించి చేతులు దులుపుకుంద‌న్న వాద‌న కూడా ఉంది. బాధిత వ‌ర్గాల‌కు స‌రైన న్యాయం చేయ‌కుండా ఇటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం నిష్ప్రయోజనం అని ద‌ళిత సంఘాలు, ఆదివాసీ సంఘాలు మండిప‌డ్డాయి. మ‌న్యంపై మంచి ప‌ట్టున్న వైసీపీకి అనంత‌బాబు ఇష్యూ తో అనేక ఇబ్బందులు వ‌చ్చాయి. ఆఖ‌రికి ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా అయితే చేయించ‌లేక‌పోయారు.

ఇప్పుడు కూడా మాధ‌వ్ ఇష్యూలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మ‌రిన్ని త‌ప్పుడు సంకేతాలు అందుతాయి అని జ‌గ‌న్ తో పాటు ఇంకొంద‌రు అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డారు. మ‌రోవైపు అనిత (టీడీపీ నాయ‌కురాలు) మాత్రం ఘ‌ట‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ హోం మంత్రి తానేటి వ‌నిత మాత్రం స్పందించ‌లేద‌ని మండిప‌డుతూ ఉన్నారు.

 తాము ఎన్ని ఆందోళ‌న‌లు చేసినా కూడా ప్ర‌భుత్వం త‌ర‌ఫున చ‌ర్య‌లు ఏవీ చెప్పుకోద‌గ్గ రీతిలో లేవ‌ని కోపం అవుతున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే అటు ఎస్సీ, ఇటు ఎస్టీ కులాల‌కు చెందిన సంఘాలు బాధిత వ‌ర్గాల‌కు మేలు చేయ‌కుండా ఎటువంటి రాజ‌కీయ చర్య‌లు తీసుకున్నా లాభం లేదనే ప‌దే ప‌దే అంటున్నాయి.

ఇదిలా ఉంటే ఇదే స‌మ‌యంలో ఆ రోజు అంబ‌టిని కానీ అవంతిని కానీ ఇలానే స‌స్పెండ్ చేయాల‌నుకున్నారా క‌నీసం ఆ ఆలోచ‌న అయినా చేశారా అన్న వాద‌న ఒక‌టి కూడా వినిపిస్తోంది. ఏదేమ‌యినా ర‌ఘురామ రాజు విష‌య‌మై స్పీడుగా ఉన్న జ‌గ‌న్ అదే స్పీడు గోరంట్ల‌పై మాత్రం చూపించేందుకు కాస్త వెనుకడుగులు వేస్తున్నార‌నే తెలుస్తోంది. మ‌రోవైపు గోరంట్ల మాధ‌వ్ కు వ్య‌తిరేకంగా మాట్లాడిన‌వారందరిపైనా కేసులు న‌మోదుచేసేందుకు వైసీపీ స‌ర్కారు భావిస్తోంది. పోలీసులు కూడా ఆ దిశ‌గా ఇప్ప‌టికే ప‌లు చ‌ర్య‌లు తీసుకున్నారు.  ఆ విధంగా జిల్లాల‌లో టీడీపీ నాయ‌కుల‌పై కేసులు న‌మోద‌యి ఉన్నాయి.