Begin typing your search above and press return to search.

జనసేన అడిగినందుకే అంబేడ్కర్ జిల్లా అనేటోళ్లు ఇప్పుడేమంటారో?

By:  Tupaki Desk   |   26 May 2022 12:30 PM GMT
జనసేన అడిగినందుకే అంబేడ్కర్ జిల్లా అనేటోళ్లు ఇప్పుడేమంటారో?
X
తప్పు జరిగిన ప్రతిసారీ ఎదుటోళ్ల మీదకు నెట్టేసే విచిత్రమైన గుణం... జరిగింది జరిగినట్లుగా చెప్పి.. చెంపలు వేసుకుంటే పోయేదానికి.. ఏదేదో చేసి.. మరేదో నెత్తి మీద తెచ్చుకునే వరకు వారు ప్రశాంతంగా ఉండరు. అంతేనా.. చిన్నసమస్యకు పరిష్కారంగా పెద్ద సమస్యను.. దాన్ని అధిగమించేందుకు మరింత పెద్ద ఇష్యూను కెలికి మరీ తెచ్చుకోవటంలో వారి తర్వాతే ఎవరైనా.

కోనసీమ జిల్లాకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జిల్లాగా పేరును ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయటం.. నెల వ్యవధిలో అభ్యంతరాలు ఉండే చెప్పాలన్న జగన్ సర్కారు నిర్ణయంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో తెలిసిందే. ఇదంతా జరిగిన తర్వాత.. జనసేన.. టీడీపీల డిమాండ్ తోనే తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వైసీపీ నేతలు కొందరు వ్యాఖ్యానించటం తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఏపీలో కొలువు తీరిన తర్వాత విపక్షాలు డిమాండ్ చేసిన వాటిని ఒప్పుకొని అమలు చేసింది ఏమైనా ఉందా? అంటే.. లేదనే మాటే అందరి నోటి నుంచి వస్తుంది.

ఆ మాటకు వస్తే.. విపక్షాలు అడిగితే చేసేది కూడా చేయకుండా ఉంటే టాలెంట్ జగన్ సర్కారుదేనన్న విమర్శ కూడా వినిపిస్తూ ఉంటుంది. అలాంటిది కోనసీమకు ముందు అంబేడ్కర్ పేరును పెట్టమని విపక్షాలు అడగటంతోనే పెట్టినట్లుగా చెబుతున్న వైసీపీ నేతలకు జనసేన ఇప్పుడు సరైన సమాధానం ఇచ్చింది. తమ మాటలతో కొత్త చిక్కులు తెచ్చుకునే వైసీపీ నేతలకు.. వారికి అర్థమయ్యేలా చెప్పాలని జనసేన డిసైడ్ అయినట్లుగా ఉంది. అందుకే.. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.

వైసీపీ ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పట్ల నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కడప జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అది వీలు కాని పక్షంలో 27వ జిల్లాను పులివెందుల కేంద్రంగా ఏర్పాటు చేసి ''భీమ్ రావ్ జిల్లా''గా నామకరణం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గాన్ని ఈ విధంగా చేస్తే బాబా సాహెబ్ స్ఫూర్తి తెలుస్తుందన్నారు. "పచ్చటి కోనసీమలో అల్లర్లకు కారణమైన వైసీపీ నిర్ణయం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. కులాల మధ్య చిచ్చుపెట్టే ఉద్దేశ్యంతో, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నాయకులు ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.

రాజకీయ లబ్ది కోసమే వైసీపీ ప్రభుత్వం జిల్లాల పేరు అంశాన్ని తెర మీదకు తెచ్చిందని.. ఇంత అల్లర్లు జరుగుతుంటే బాధ్యతగా స్పందించాల్సిన మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాల పేర్లు మార్చడం ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పారని.. పేర్లు మార్చడంతోపాటు కొత్త జిల్లాల ఏర్పాటు కూడ ఒక నిరంతర ప్రక్రియగా పెట్టుకోవాలని జనసేన పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

''కడపకు వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టారు. వైద్య వృత్తిలో ఉన్న వైఎస్ఆర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు అంటే అందుకు కారణం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే ఇవాళ కశ్మీర్ భారత భూభాగంలో ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి పేరుని వివాదాల్లోకి లాగి వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన పనులు చేస్తోంది. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కడపకు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ గారి పేరుని పెట్టి దాన్ని నిరూపించుకోవాలి. 27వ జిల్లాగా బీమ్ రావ్ జిల్లాను పులివెందుల కేంద్రంగా ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని.. జగన్ రెడ్డిని కోరుతున్నాం'' అని పేర్కొన్నారు. మరి.. జనసేన తాజా డిమాండ్ కు వైసీపీ నేతలు ఏమని బదులిస్తారో చూడాలి.