Begin typing your search above and press return to search.

విప‌క్షం ట్రాప్‌ లో వైసీపీ నేత‌లు..ఇలా అయితే క‌ష్ట‌మే!

By:  Tupaki Desk   |   25 Sep 2020 6:27 PM GMT
విప‌క్షం ట్రాప్‌ లో వైసీపీ నేత‌లు..ఇలా అయితే క‌ష్ట‌మే!
X
రాజ‌కీయాల్లో దూకుడు ఉండాల్సిందే. కాద‌నేవారు ఎవ‌రూ ఉండ‌రు. కానీ, ఆ దూకుడులోనూ సంయ‌మ‌నం.. ఆలోచ‌న‌.. ప్ర‌త్య‌ర్థి ప‌క్షానికి ఆయుధాలు అందించేలా మాత్రం ఉండ‌కూడ‌దు. పైగా.. ప్ర‌త్య‌ర్థి ప‌క్షాలు విసిరే.. ట్రాప్‌ ల‌కు అస‌లే చిక్కుకోకూడ‌దు. ఈ ఫార్ములాను ప్ర‌తిపార్టీ దాదాపు అనుస‌రిస్తూనే ఉంటుంది. వైసీపీ అధినేత - సీఎం జ‌గ‌న్ కూడా అనేక సంద‌ర్భాల్లో ఇలాంటి ట్రాప్‌ల‌కు చిక్కుకున్నారు. కానీ, ఎప్పుడూ సంయ‌మ‌నాన్ని ఆయ‌న వీడ‌లేదు. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న‌పై జ‌రిగిన ప్ర‌చారం అంతా ఇంతా కాదు. న‌రాలు తెగిపోయే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా కూడా ప్ర‌త్య‌ర్థులు విసిరిన విమ‌ర్శ‌ల బాణాల‌కు ఆయ‌న చిక్కుకోకుండా జాగ్ర‌త్త తీసుకున్నారు.

నిజానికి ఈ బాణాల‌కు ఆయ‌న చిక్కుకుని ఉంటే.. ప‌రిస్థితి వేరేలా ఉండేది. ఇక‌, వైసీపీలో మిగిలిన నేత‌ల్లోనూ చాలా మంది ప్ర‌త్య‌ర్థులు ఏమ‌న్నా.. త‌మ ప‌నితాము చేసుకుని పోతున్నారు. మంత్రులు మేక‌పాటి గౌతం రెడ్డి - తానేటి వ‌నిత‌ - అంజాద్ బాషా - ఆళ్ల‌నాని వంటివారు.. ప్ర‌త్య‌ర్థులు విసిరే.. బాణాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా.. త‌మ ప‌ని తాము చేసుకుని పోతున్నారు. ఇక‌, ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌ - క‌న్న‌బాబు - పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి - సుచ‌రిత వంటివారు ప్ర‌త్య‌ర్థుల ట్రాప్‌లో ప‌డ‌కుండా.. కౌంట‌ర్లు ఇస్తూ.. ఇబ్బందిలేని విధంగా ముందుకు సాగుతున్నారు. రాజ‌కీయాల్లో ఉండాల్సిన విధానం ఇదే! దీనివ‌ల్ల వారికి - ప్ర‌భుత్వానికి, పార్టీకి కూడా ఎలాంటి ఇబ్బంది లేక‌పోగా.. ప్ర‌త్య‌ర్థుల‌కు కౌంట‌ర్లు కూడా త‌గులుతున్నాయి.

అయితే, ఒక‌రిద్ద‌రు మంత్రులు మాత్రం ప్ర‌త్య‌ర్థులు విసిరే ట్రాప్‌లో సునాయాసంగా చిక్కుకుపోతున్నారు. ఫ‌లితంగా వారు అభాసుపాల‌వ‌డంతోపాటు పార్టీని, ప్ర‌భుత్వాన్ని కూడా ఇర‌కాటంలోకి నెడుతున్నారు. వీరిలో మంత్రి కొడాలి నాని ముందువ‌రుస‌లో ఉండ‌గా.. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ - నారాయ‌ణ స్వామి వంటివారు త‌రువాత వ‌రుస‌లో ఉన్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యం నుంచి తాజాగా దేవాల‌యాల‌పై దాడుల విష‌యం వ‌ర‌కు - మ‌ద్యం ధ‌రల నుంచి న్యాయ విష‌యాల వ‌ర‌కు కూడా వీరు చేసిన వ్యాఖ్య‌లు ఇటీవ‌ల కాలంలో వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. అయితే, వారు స్వ‌యంగా ఈ వ్యాఖ్య‌లు చేయ‌క‌పోయినా.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు రెచ్చ‌గొడుతుండ‌డంతో ఒకింత సంయ‌మ‌నం కోల్పోయి.. నోరు జారుతున్నారు.

ఇది అంతిమంగా వారిపై విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌డంతోపాటు.. ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. పార్టీలోనూ చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. పైగా.. ఈ మంత్రులు అంతా ఇంతే! అనేలా ప్ర‌తిప‌క్షాలు దుయ్య‌బ‌ట్టే స్థాయిని తెస్తున్నాయి. ఇదే విష‌యాన్ని తాజాగా సీఎం స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ప్ర‌త్య‌ర్థులు విసురుతున్న ట్రాప్‌ కు మావోళ్లు చిక్కుకుంటున్నార‌ని - సంయ‌మ‌నం పాటించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న ప‌రోక్షంగా కొంద‌రు మంత్రుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇది నిజ‌మేన‌ని అనేవారు క‌నిపిస్తున్నారు.