Begin typing your search above and press return to search.

టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నాయకుల దాడి

By:  Tupaki Desk   |   5 Nov 2021 6:30 AM GMT
టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నాయకుల దాడి
X
ఏపీలో అధికార వైసీపీ నేతలు హల్ చల్ చేశారు. టోల్ ఫ్లాజా వద్ద టోల్ కట్టాలని అడిగినందుకు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఓ వైసీపీ నాయకుడు, ఆయన అనుచరులు ఈ దాడి చేశారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో టోల్ ప్లాజా సూపర్ వైజర్ తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట వైసీపీ నేత, స్థానిక జడ్పీటీసీ ఎల్. సూర్యనారాయణ తన అనుచరులతో కలిసి కారులో వెళుతుండగా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ గేట్ వద్ద సిబ్బంది ఆపారు. తమ విధుల్లో భాగంగా టోల్ ఫీజు చెల్లించాలని సిబ్బంది వైసీపీ జడ్పీటీసీని కోరారు. దీంతో తమనే టోల్ ఫీజు అడుగుతావా అంటూ కారులోని వైసీపీ నాయకులు టోల్ సిబ్బందితో ఘర్షణకు దిగారు.

అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ కారునే ఆపుతావా? అంటూ టోల్ సిబ్బందితో సూర్యనారాయణ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. మాటా మాటా పెరగడంతో కోపంతో ఊగిపోయిన వైసీపీ జడ్పీటీసీ, ఆయన అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి దిగారు. కారు దిగుతూనే వైసీపీ నాయకులు టోల్ గేట్ సూపర్ వైజర్ పి.సత్యనారాయణను విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. మరికొందరు సిబ్బందిపైనా దాడి చేశారు. ఈ ఘర్షణతో టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

వైసీపీ నాయకుల దాడిలో టోల్ గేట్ సూపర్ వైజర్ సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తోటి సిబ్బంది అతడిని నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నంలోని కల్యాణి ఆస్పత్రికి తరలించారు.

తమ సిబ్బందిపై దాడిని తీవ్రంగా పరిగణించిన టోల్ ప్లాజా యాజమాన్యం నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వైసీపీ జడ్పీటీసీ సూర్యనారాయణతోపాటు ఆయన అనుచరులు శ్రీను, నానాజిలపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

కాగా టోల్ ప్లాజా సిబ్బందిపై వైసీపీ నాయకుల దాడి చిత్రాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం వైరల్ గా మారాయి.