Begin typing your search above and press return to search.

ఆపరేషన్ వైసీపీ : బాబు వలలో చిక్కే నేతలు వీరేనా...?

By:  Tupaki Desk   |   27 July 2022 11:30 PM GMT
ఆపరేషన్ వైసీపీ : బాబు వలలో చిక్కే నేతలు వీరేనా...?
X
ఏపీలో వైసీపీని ఈసారి ఎలాగైనా నిలువరించి అధికారాన్ని కైవశం చేసుకోవాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీ ఆ దిశగా చురుకుగా పావులు కదుపుతోంది. ఏడు పదులు దాటినా నవ యువకుడు మాదిరిగా ఒక వైపు జనంలో ఉంటూనే మరో వైపు చంద్రబాబు తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వైసీపీని ఎలాగైనా దెబ్బ తీయాలని, జగన్ ఆత్మ స్థైర్యాన్ని కృంగదీయాలని బాబు వేస్తున్న మాస్టర్ ప్లాన్ లో భాగమే ఆపరేషన్ వైసీపీ అని అంటున్నారు.

ఏపీలో టీడీపీ వైపు జనం ఉన్నారు అని చెప్పాడానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలుపు ఖాయం అని అందరికీ తెలియచేయడానికి ఆపరేషన్ వైసెపీఎ బాగా ఉపయోగ‌పడుతుంది అని భావిస్తున్నారుట. ఇక నిన్నటికి నిన్న టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబుతో మంతనాలు జరిపిన చంద్రబాబు జగన్ కి తొలి షాట్ ఏంటో చూపించారు.

ఇపుడు కొన్ని బలమైన జిల్లాలను ఎంచుకుని అక్కడ గట్టి వైసీపీ అసంతృప్త నేతలకు గేలం వేయడం ద్వారా వైసీపీని దెబ్బ తీయడమే కాకుండా ఆ పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ప్లాన్ వేస్తున్నారు అని తెలుస్తోంది.

ఇక జిల్లాల వారీగా చూస్తే టీడీపీ వలలో చిక్కే నేతలుగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని టీడీపీలో చేర్చుకోవడానికి దాదాపుగా రంగం సిద్ధమైపోయింది అని తెలుస్తోంది. ఆమె కూడా వైసీపీ మీద పూర్తి అసంతృప్తితో ఉన్నారు. తనకు పట్టించుకోవడంలేదని, ఏ రకమైన పదవులు ఇవ్వడాంలేదని గుస్సా అవుతున్నారు. దానికి పరాకాష్ట అన్నట్లుగా రీసెంట్ గా సీఎం జగన్ టూర్ లో ఆమెకు అవమానం జరిగింది. దాంతో కిల్లి సైకిలెక్కడం ఖాయమని అంటున్నారు.

అలాగే చూస్తే కనుక విశాఖ జిల్లాలో వైసీపీలో ఉన్న టీడీపీ మాజీ నేతలకు ఆహ్వానాలు వెళ్లాయని అంటున్నారు. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు సీనియర్ నేతలను గుర్తించి వారికి కండువా కప్పే కార్యక్రమానికి టీడీపీ తెర తీస్తోంది. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డిని చేర్చుకుంటారని తెలుస్తోంది. ఇక కర్నూల్ లో చూస్తే మాజీ ఎంపీ బుట్టా రేణుక, అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలను టీడీపీలోకి లాగుతారని తెలుస్తోంది.

అలాగే ఒంగోలు జిల్లాలో మానుగుంట మహీధర్ రెడ్డి కూడా టీడీపీలోకి వస్తారని ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంతో చూడాలి. క్రిష్ణా,గుంటూరు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో కూడా వైసీపీలో ఉన్న అసంతృప్తి నేతలను తమ గూటిలోకి రప్పించడం ద్వారా వైసీపీకి అధినాయకత్వానికి గట్టి షాక్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. తొందరలోనే ఈ చేరికలు ఉంటాయట. మరి అదే జరిగితే ఏపీలో వచ్చేది టీడీపీ సర్కారే అన్న హైప్ క్రియేట్ కావడం ఖాయం.