Begin typing your search above and press return to search.

పసుపు మోజు : టీడీపీ వైపుగా వైసీపీ కీలక నేతలు...?

By:  Tupaki Desk   |   4 Jun 2022 7:30 AM GMT
పసుపు మోజు : టీడీపీ వైపుగా వైసీపీ కీలక నేతలు...?
X
రాష్ట్రంలో రెండే పార్టీల రాజకీయం ఇంకా సాగుతోంది. అయితే వైసీపీ లేకపోతే టీడీపీ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. 2019 ఎన్నికల ముందు అధికార టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీలోకి నేతలు చేరిపోయారు. అలా చేరిన వారిలో కొందరు మంత్రులు కూడా అయ్యారు. ఇక మూడేళ్ల వైసీపీ పాలన ముగిసింది. ప్రజా వ్యతిరేకత ఒక వైపు వెల్లువెత్తుతోంది. దాంతో వచ్చే రెండేళ్ళలో ఎన్నికలు అని చెబుతున్నా ఎపుడైనా ముందస్తు గంట మోగే అవకాశాలను కూడా ఎవరూ కొట్టిపారేయడంలేదు.

ఈ నేపధ్యంలో దీపముండగానే ఇల్లు సర్దుకుందామని తెలివిడి కలిగిన రాజకీయ నాయకులు ఆలోచన చేస్తారు. దాంతో వారంతా ఇపుడు సైకిల్ ఎక్కాలని తెగ ఉబలాటపడుతున్నారుట. ఈ మధ్యనే సూపర్ సక్సెస్ అయిన మహానాడు ఏపీలో రాజకీయ గాలి ఏ వైపు ఉందో చాటి చెప్పింది. దాంతో పాటు వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోతోంది.

ఇక వైసీపీలో ఫ్యాన్ నీడన ఉన్నా ఉక్కబోతతో చాలా మంది నేతలు సతమతమవుతున్నారు. పదవుల పంపిణీ కూడా పూర్తి అయింది. ఈ మధ్య నాలుగు రాజ్యసభ సీట్లు ఉంటే వాటిని కూడా భర్తీ చేశారు. ఇక మంత్రి వర్గ విస్తరణలో కూడా చాలా మంది ఆశలు నిరాశ అయ్యాయి. అదే విధంగా పాతవారిని పదకొండు మంది దాకా కొనసాగించి తమకు అవకాశాలు ఇవ్వకపోవడం పట్ల కొందరు మాజీ మంత్రులు ఈ రోజుకీ రగులుతున్నారు.

ఇక సీనియర్లుగా ఉన్న మాజీ మంత్రులకు జిల్లాల బాధ్యతలు అప్పగించినా ఎవరూ ముందుకు కదలడంలేదు. ఒక విధంగా వైసీపీలో కాడె వదిలేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో వీరిలో చాలా మంది టీడీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెడితే అనంతపురం దాకా చాలా పెద్ద లిస్టే ఇపుడు టీడీపీ పెద్దల వద్ద ఉందని అంటున్నారు.

వైసీపీలో అసంతృప్తి నేతల వివరాలు అన్నీ కూడా టీడీపీ జాగ్రత్తగా సేకరిస్తోంది. అందులో తమకు పనికివచ్చే వారిని దగ్గరకు తీసుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ ని మొదలెట్టబోతోంది. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపరాణి ఉన్నారు. ఆమె వైసీపీలో మూడేళ్ల క్రితం చేరినా కూడా పదవి అంటూ ఏదీ దక్కలేదు.

లేటెస్ట్ గా రాజ్యసభ సీటు ఆమెకే అని చివరిదాకా ప్రచారం జరిగినా ఇవ్వలేదు. దాంతో ఆమె రగిలిపోతున్నారు. ఆమె టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇక క్రిష్ణా జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పార్ధసారధి కూడా టీడీపీ వైపు వెళ్లేవారిలో ఉన్నారని టాక్. అలాగే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, జగన్ చెల్లెలు లాంటి మేకతోటి సుచరిత కూడా పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు అని తెలుస్తోంది. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రాం నారాయణరెడ్డి కచ్చితంగా టీడీపీ గూటికే అని చాన్నాళ్ళుగా వినిపిస్తున్న మాట. అది నిజం అని అంటున్నారు.

ఇక ఇదే వరసలో చూసుకుంటే రాయలసీమ జిల్లాల నుంచి బుట్టా రేణుకతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా టీడీపీ గూటికి చేర అవకాశం ఉంది అంటున్నారు. వీరితో పాటు మాజీ ఐఏఎస్, మాజీ ఐపీఎస్ అధికారులు కూడా టీడీపీ వైపు ఆసక్తిగా చూస్తున్నారు అని అంటున్నారు.

ఒక్కసారి కనుక ఈ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ అయితే మాత్రం ఎవరినీ ఆపలేరని అంటున్నారు. టీడీపీ లో ఈ చేరికలు మొదలైతే ఏపీలో రాజకీయం మారిందన్న సందేశం జనాలకు కూడా సులువుగా చేరిపోతుంది. అపుడు అసలైన కష్టాలు అధికార వైసీపీకి తప్పవని అంటున్నారు.