Begin typing your search above and press return to search.

ఏపీ పరిషత్ ఫలితాల్లో వైసీపీ హవా.. అన్ని జిల్లాల్లో మెజార్టీ

By:  Tupaki Desk   |   19 Sep 2021 6:17 AM GMT
ఏపీ పరిషత్ ఫలితాల్లో వైసీపీ హవా.. అన్ని జిల్లాల్లో మెజార్టీ
X
ఎంతోకాలంగా వాయిదా పడిన ఏపీ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభమైంది. పలు గ్రామాల ఎంపీటీసీ ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కూడా మరికాసపేట్లో వెల్లడికాబోతున్నాయి.

మొత్తం ఏపీ వ్యాప్తంగా 7219 ఎంపీటీసీలు, 515 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 8వ తేదీన జరిగిన పోలింగ్ లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

హైకోర్టు తీర్పు కారణంగా ఐదున్నర నెలలుగా ప్రజా తీర్పు స్ట్రాంగ్ రూంలకే పరిమితమైంది. మూడు రోజుల క్రితమే హైకోర్టు డివిజన్ బెంచ్ ఓట్ల లెక్కింపునకు అనుమతించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లోని 209 ప్రదేశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో మండలాల వారీగా వేర్వేరుగా ఓట్ల లెక్కింపు కోసం వేర్వేరు హాళ్లను సిద్ధం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మాట్లాడుతూ పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లో కౌంటింగ్ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం విధించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఏపీలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలున్నాయి. 8 చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి. 652 స్థానాల్లో 126 స్థానాలు ఏకగ్రీవం కాగా 515 స్థానాలకు పోలింగ్ జరగగా.. 2058 అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఏపీలో మొత్తం 10047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. నోటిఫికేషన్ జారీ సమయంలో 375 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మొత్తం 9672 స్థానాల్లో 2371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కౌంటింగ్ లేట్ తో 81 స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. 18782మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ మధ్యాహ్నం కల్లా ఎంపీటీసీ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. రాత్రి కల్లా మొత్తం ఫలితాలు వెల్లడి కానున్నాయి. 11:38 AM 9/19/2021

-ఏపీ వ్యాప్తంగా పరిషత్ ఫలితాల్లో అధికార వైసీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మెజార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలుచుకుంటున్నారు.

-చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు 25 ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు వెల్లడికాగా.. వైసీపీ ఏకంగా 25, టీడీపీ 1, వైసీపీ రెబల్స్ 2 స్థానాలు గెలుచుకున్నారు.

-అనంతపురంలో వైసీపీ జోరు కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు.

-కర్నూలు జిల్లాలో 21 ఎంపీటీసీ ఫలితాల్లో వైసీపీ 17, టీడీపీ 3, స్వతంత్రులు 1 స్థానంలో గెలుపొందారు

-కడప జిల్లాలో తొలి ఫలితం ఇండిపెండింట్ గెలవడం విశేషం. పెద్దచెప్పలి ఎంపీటీసీగా స్వతంత్ర్య అభ్యర్థి ఏకంగా వైసీపీ అభ్యర్థిపై గెలిచాడు.

-కృష్ణా జిల్లాలో కూడా వైసీపీ అభ్యర్థులు గెలుపు బాటలో ఉన్నారు.

-చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తురు జిల్లా కుప్పంలో వైసీపీ అభ్యర్థి మల్లనూరు ఎంపీటీసీ స్థానంలో గెలిచాడు.