Begin typing your search above and press return to search.

మంగ‌ళ‌గిరిలో ఆళ్ల‌కు ఈసారి టికెట్ హుళ‌క్కేనా?

By:  Tupaki Desk   |   16 July 2022 12:06 PM GMT
మంగ‌ళ‌గిరిలో ఆళ్ల‌కు ఈసారి టికెట్ హుళ‌క్కేనా?
X
గ‌త ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మొత్తం మీద చ‌ర్చ‌నీయాంశ‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో మంగ‌ళ‌గిరి ఒక‌టి. ఇక్క‌డి నుంచి నాటి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కుమారుడు, ఆయ‌న మంత్రివ‌ర్గంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నుంచి బ‌రిలోకి దిగ‌డ‌మే ఇందుకు కార‌ణం. దీంతో అంద‌రి దృష్టి మంగ‌ళ‌గిరిపైనే నిలిచింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డేట‌ప్పుడు కూడా మంగ‌ళ‌గిరిపైనే అంతా ఆరా తీశారు.

అయితే మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ప‌రాజ‌యం పాల‌య్యారు. 2014లో మంగ‌ళ‌గిరి నుంచి వైఎస్సార్సీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలిచారు.. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి (ఆర్కే). 2014 ఎన్నిక‌ల్లో కేవ‌లం 12 ఓట్ల మెజారిటీతోనే ఆళ్ల బ‌య‌ట‌ప‌డ్డారు. 2019లో ఆయ‌న‌కు సీటు ఇవ్వ‌ర‌నే చ‌ర్చ భారీగానే న‌డిచింది. అయితే రాజ‌ధాని భూముల అక్ర‌మాలు, అవినీతి అంటూ హైకోర్టులో ఆర్కే పిటిష‌న్లు వేయ‌డం, సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్ల‌డం వంటి కార‌ణాల‌తో రెండోసారి ఆయ‌నకు జ‌గ‌న్ అయిష్టంగానే సీటు ఇచ్చార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలో నారా లోకేష్ పైన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని గెలిపిస్తే ఆయ‌న‌ను గెలిచాక మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటానంటూ వైఎస్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ప్ర‌చార బ‌హిరంగ స‌భ‌ల్లోనూ ఇదే విష‌యాన్ని జ‌గ‌న్ చెప్పారు. ఆర్కే ఎన్నిక‌ల్లో 5 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. అయినా రెండుసార్లు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేసిన జ‌గ‌న్ రెండుసార్లూ ఆళ్ల‌కు జెల్ల‌కొట్టారు. దీంతో ఆళ్ల కూడా అంత చురుకుగా, క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని అంటున్నారు. ఉండీ లేన‌ట్టుగానే నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు.

2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆళ్ల‌కు ఈసారి టికెట్ హుళ‌క్కేన‌ని పేర్కొంటున్నారు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి మురుగుడు హ‌నుమంత‌రావును వైఎస్సార్సీపీలో చేర్చుకున్నారు. మురుగుడు మంగ‌ళ‌గిరి నుంచి గ‌తంలో రెండు ప‌ర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అంతేకాకుండా వైఎస్సార్ మంత్రివ‌ర్గంలో మంత్రిగానూ ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలో మురుగుడు హ‌నుమంత‌రావు చేనేత సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు కావ‌డంతో ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకున్నారు.. వైఎస్ జ‌గ‌న్. మంగ‌ళ‌గిరిలో చేనేత‌ల జ‌నాభా ఎక్కువ‌. ఈ నేప‌థ్యంలో మురుగుడుకు వైఎస్ జ‌గ‌న్ ఎమ్మెల్సీగా అవ‌కాశమిచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో మురుగుడును కానీ లేదంటే చేనేత సామాజిక‌వ‌ర్గానికి చెందిన మ‌రో వ్య‌క్తిని కానీ వైఎస్సార్సీపీ బ‌రిలో దించుతుంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు నారా లోకేష్ గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైనప్ప‌టికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచే పోటీ చేస్తాన‌ని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త‌ర‌చూ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. పార్టీ ప‌టిష్టంగా లేని చోట బ‌ల‌ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో బీసీ అభ్య‌ర్థిపై నారా లోకేష్ పోటీ చేస్తున్నార‌ని వైఎస్సార్సీపీ ప్ర‌చారం చేస్తుంద‌ని చెబుతున్నారు. తాము నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక సంఖ్య‌లో ఉన్న చేనేత సామాజిక‌వ‌ర్గానికి సీటు కేటాయిస్తే.. లోకేష్ బ‌డుగు వ‌ర్గాల అభ్య‌ర్థిపై పోటీకి దిగుతున్నార‌ని వైఎస్సార్సీపీ ప్ర‌చారం చేయ‌డానికి అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.