Begin typing your search above and press return to search.

విశాఖ కాపునాడుకు వైసీపీ మంత్రులు...?

By:  Tupaki Desk   |   25 Dec 2022 11:44 AM GMT
విశాఖ కాపునాడుకు వైసీపీ మంత్రులు...?
X
విశాఖలో రంగా వర్ధంతి రోజు అయిన డిసెంబర్ 26న భారీ ఎత్తున కాపులతో సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాపు సోదరులు తరలిరానున్నారు అని నిర్వాహకులు తెలియచేస్తున్నారు. కాపునాడు సభ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా సాగుతుంది అని అంటున్నారు. ఈ సభ ద్వారా ఏపీలో కాపులకు ఒక కచ్చితమైన రాజకీయ అజెండా సెట్ చేస్తారు అని అంటున్నారు. కాపునాడు సభను రాజకీయాలను అతీతంగా నిర్వహిస్తామని చెబుతున్నా కాపులు ప్రభావంతమైన స్థితిలో ఏపీలో ఉన్నారు కాబట్టి వారిని ఎలా డ్రైవ్ చేయాలి. రేపటి రాజకీయాల్లో కాపుల పాత్ర ఏంటి అన్న విషయాలు  చర్చించకుండా సభ సాగదు అని అంటున్నారు.

ఈ సభకు సంబంధించి వైసీపీ మంత్రులను ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. అంతే కాదు వారి ఫోటోలను కూడా ఆహ్వాన పత్రాలలో ముద్రించారు. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమరనాధ్, విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ,అనకాపల్లి వైసీపీ జిల్లాల ప్రెసిడెంట్లు అయిన పంచకర్ల రమేష్ బాబు, కరణం ధర్మశ్రీలతో పాటు కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సహా వైసీపీ ప్రజా ప్రతినిధులను మొత్తంగా ఆహ్వానించారు.

మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కాపునాడు మీటింగ్ కి వస్తారని కాపునాడు సభ నిర్వాహకులు చెబుతున్నారు.  మరి ఈ సభలో తెలుగుదేశం, జనసేన నేతలు కూడా పాలుపంచుకుంటారని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ. పైగా జనసేన టీడీపీ ఆ పార్టీని ప్రతీ రోజూ టార్గెట్ చేస్తూనే ఉన్నాయి.

మరో వైపు చూస్తే కాపునాడులో కాపులకు సంబంధించిన రిజర్వేషన్ల డిమాండ్ మళ్లీ చర్చకు వస్తుంది అని అంటున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కాపు ముఖ్యమంత్రి అన్న ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇక కాపులకు ప్రస్తుతం ప్రభుత్వం ఏమీ చేయడంలేదు అన్న చర్చ వచ్చినా విమర్శలు వచ్చినా కూడా వైసీపీ మంత్రులకు ఇబ్బందే. దాని కంటే ముందు ఈ సభ ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది.

గంటా సూత్రధారిగా ఈ సభ జరుగుతోంది అని అంటున్న నేపధ్యంలో సీనియర్ మోస్ట్ మంత్రిగా ఉన్న బొత్స వంటి వారు ఈ సభకు వస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇక తెలుగుదేశం నుంచి కిమిడి కళా వెంకటరావుతో పాటు పలువురు సీనియర్ నేతలను పిలిచారు. జనసేన నుంచి కూడా పలువురు నాయకులు హాజరవుతున్నారు. ఈ సభకు వైసీపీ నుంచి ఎవరు వస్తారు అన్నదే ఇపుడు అంతటా ఆసక్తిని గొలుపుతున్న విషయం. ఒకవేళ వైసీపీ మంత్రులు వస్తే కనుక కాపునాడు సభ సక్సెస్ అయినట్లే. అదే సమయంలో ఏపీ రాజకీయాల్లో కూడా సంచలనాలు నమోదు అయినట్లే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.