Begin typing your search above and press return to search.

జగన్ నిర్ణయం వైసీపీ ఎమ్మెల్యేకు నచ్చలేదా?

By:  Tupaki Desk   |   8 Sep 2021 5:30 AM GMT
జగన్ నిర్ణయం వైసీపీ ఎమ్మెల్యేకు నచ్చలేదా?
X
ఏపీలో ఇప్పుడు వినాయక చవితి బహిరంగ వేడుకలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం దుమారం రేపుతోంది.దీనిపై ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గణేష్ పందిళ్లు.. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులను నిరాకరించడంతో, ప్రతిపక్ష పార్టీలు అధికార జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు చేపడుతున్నారు. గణేష్ ఉత్సవాలపై నిషేధం ఇప్పుడు ఏపీలో వివాదానికి కారణమవుతోంది.

మంత్రులు.. వైసీపీ నాయకులు ప్రభుత్వ వైఖరిని సమర్థించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతిపక్ష నాయకులను ఎదుర్కోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంత మంది వైసీపీ ప్రజాప్రతినిధులకు మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయం నచ్చడం లేదని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే గణేష్ తాజాగా సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. గణేష్ పందిళ్లకు ఆయన అనుమతి కోరడం ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చినట్టు అయ్యింది.

వైసిపికి చెందిన విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర గణేష్ ఉత్సవానికి అనుమతి కోరుతూ స్థానిక సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌కు లేఖ సమర్పించడం సంచలనమైంది. ఈ లేఖ ఆగస్టు 31 తేదీకి అంటే వారం క్రితం ఆయన రాశారు.

పాలక వైసిపి ఎమ్మెల్యే రాజన్న దొర రాసిన ఈ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే లేఖ సూత్రప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంది. గణేష్ పండుగపై వివాదాస్పద నిర్ణయంపై జగన్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్న ప్రతిపక్ష నాయకులకు ఇది ఆయుధంగా మారే అవకాశం ఉంది.

ఇప్పటికే, గణేష్ మండపాలకు అనుమతి నిరాకరించడంపై టిడిపి, బిజెపి పార్టీలు వైయస్ఆర్సిపిని లక్ష్యంగా చేసుకున్నాయి. వారితో కలిసి పవన్ కళ్యాణ్ కోవిడ్ ఆంక్షలు వినాయక చవితికి మాత్రమే వర్తిస్తాయా? అని నిన్న తీవ్రవిమర్శలు చేశారు. వైఎస్ఆర్‌సిపి నాయకుల పుట్టినరోజు, వర్థంతి, జయంతి వేడుకలకు వర్తించదా అని కడిగేశాడు.

ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే లేఖ ప్రతిపక్షాలకు అస్త్రంగా మారనుంది. అధికార పార్టీ తన ఎమ్మెల్యేను .. ఈ లేఖను ఎలా సమర్థిస్తుందో చూడాలి.