Begin typing your search above and press return to search.

స‌న్యాసి వేషం క‌ట్టిన వైసీపీ ఎమ్మెల్యే.. రీజ‌నేంటో తెలుసా?

By:  Tupaki Desk   |   22 Dec 2021 9:30 AM GMT
స‌న్యాసి వేషం క‌ట్టిన వైసీపీ ఎమ్మెల్యే.. రీజ‌నేంటో తెలుసా?
X
నుదుటన విభూది, చలువ కళ్లద్దాలు, కాషాయ దుస్తులు, మెడలో రుద్రాక్షమాల... ఇవ‌న్నీ.. ఎవ‌రు ధ‌రిస్తా రు? అంటే.. త‌డుముకోకుండా చెప్పే స‌మాధానం.. స‌ర్వ‌సంఘ ప‌రిత్యాగులైన స‌న్యాసులు. అయితే.. ఈ వేషం ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఒక‌రు ధ‌రించారు. అచ్చు స్వామిజీలా మారిపోయారు. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలపై ఆరాతీశారు. అచ్యుతాపురం మండల కేంద్రంతోపాటు ఆవసోమవరం, అప్పన్నపాలెం గ్రామాల్లో పర్యటించి వైసీపీ పాలనలోని నవరత్నాలపై ప్రజలు ఏమి అనుకుంటున్నారని ఆరా తీశారు. ఈ స్వామీజీ మరెవరో కాదు.. సాక్షాత్తూ ఎమ్మెల్యే రమణమూర్తిరాజు (కన్నబాబు).

ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా తీరుతెన్నూ మార్చేసి... మారువేషం వేసి మరీ గ్రామాల్లో పర్యటిం చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లువురు స్థానికుల‌తో మాట క‌లిపారు. బిక్షాం దేహీ అంటూ.. మ‌హిళ‌ల‌ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లు ఆయ‌న‌కు ప‌లు స‌మస్య‌లు వివ‌రించారు. నిత్యావసర ధరలు, విద్యుత్తు ఛార్జీలు అధికంగా ఉన్నాయని పలువురు చెప్పారు. రోడ్లు బాగోలేవని ప్రస్తావించారు. ప్రభుత్వం 50 శాతం పథకాలు అందిస్తే ధరలు పెరుగుదలతో ఖర్చులు మరింత పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు తెలిపిన సమస్యలను శ్రద్ధగా విన్న తర్వాత నేరుగా తహసీల్దార్‌ రాంబాయి, ఎంపీడీఓ కృష్ణల వద్దకు ఇదేవేషంలో వెళ్లిన కన్నబాబు ప్రజలు లేవనెత్తిన సమస్యలపై మాట్లాడారు. అయితే.. ఎమ్మెల్యే స‌న్యాసి వేషంలో రావ‌డంతో తొలుత అధికారులు ప‌ట్టించుకోలేదు. అంతేకాదు. ఇన్ని విషయాలు అడుగుతున్నారు... మీరెవరంటూ తహసీల్దార్‌ రాంబాయి నిల‌దీశాడు. మీకు ఎందుకు.. వెళ్లి.. ప్ర‌వ‌చ‌నాలు చెప్పుకోవ‌చ్చు క‌దా! అనేశారు. దీంతో క‌న్న‌బాబు.. త‌న వేషం తొలగించి ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రభుత్వ పథకాలపై 100 శాతం ప్రజలు ఆనందంగా ఉన్నారని ఆయన తెలిపారు.

అయితే.. స‌మ‌స్య‌ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి. అయితే.. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఇలా మారు వేషంలో ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌డం.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం మాత్రం ఆశ్చ‌ర్యంగానే ఉంది. మ‌రి ఇదిజ‌గ‌న్ సూచ‌న‌ల మేర‌కు చేశారో.. లేదా.. త‌నే ఇలా వేషం క‌ట్టారా? అనేది చూడాలి. ఇక్క‌డ మ‌రో విష‌యం కూడా ప్ర‌స్తావించాలి. ఇదే విశాఖ‌ప‌ట్నానికి చెందిన ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ.. మొన్నామ‌ధ్య హ‌రిశ్చంద్రుడి వేషం క‌ట్టారు. ఫ‌క్తు కాటికాప‌రి వేష‌యం ధ‌రించి చేతిలో క‌ర్ర‌, భుజాన పెద్ద‌న‌ల్ల‌టి దుప్ప‌టీ, మ‌ట్టి కుండ‌ను తీసుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఆయ‌న‌ను అంద‌రూ గుర్తు ప‌ట్టేశారు. దీంతో ఆయ‌న తన ప్ర‌య‌త్నం విర‌మించుకున్నారు.