Begin typing your search above and press return to search.

ఎపీ అసెంబ్లీకి వ‌చ్చిన జ‌గ‌న్ ఎమ్మెల్యే?

By:  Tupaki Desk   |   23 Nov 2017 5:08 AM GMT
ఎపీ అసెంబ్లీకి వ‌చ్చిన జ‌గ‌న్ ఎమ్మెల్యే?
X
ప్ర‌ధాన‌ప్ర‌తిపక్షం లేకుండా అసెంబ్లీ స‌మావేశాలు ఎంత నీర‌సంగా సాగుతాయ‌న‌టానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా మారాయి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు. రుచిప‌ని లేని రీతిలో మారిన స‌మావేశాల్లో తాజాగా చోటు చేసుకున్న ఉదంతం ఏపీ అధికార‌ప‌క్షాల వారికి హాట్ టాపిక్ గా మారింది.

జంపింగ్ ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌టంలో జ‌రుగుతున్న జాగు కార‌ణాన్ని చూపించిన జ‌గ‌న్ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు అసెంబ్లీని బ‌హిష్క‌రించ‌టం తెలిసిందే. దీంతో.. అసెంబ్లీ స‌మావేశాలు బోసిపోయాయి. ఇదిలా ఉంటే.. బుధ‌వారం ఏపీ అసెంబ్లీ లాబీల్లోకి బాప‌ట్ల ఎమ్మెల్యే.. జ‌గ‌న్ పార్టీకి చెందిన కోన ర‌ఘుప‌తి రావ‌టం క‌ల‌క‌లం రేపింది.

జ‌గ‌న్ మాట‌తో ఏపీ అసెంబ్లీ ముఖ‌మే చూడ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు భిన్నంగా ఒక ఎమ్మెల్యే రావ‌టంతో తెలుగుదేశం పార్టీ నేత‌లంతా ఒక్క‌సారి అవాక్కు అయ్యారు.

ఎందుకిలా అంటూ చ‌ర్చించుకునే వారు చ‌ర్చించుకుంటే.. కొంద‌రు ఈ విష‌యాన్ని నేరుగా ఆయ‌న్నే అడిగేశారు. తాను అసెంబ్లీ స‌మావేశాలకు రాలేద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చిన కోనా ర‌ఘుప‌తి.. గొల్ల‌ప‌ల్లి సూర్యారావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగే హామీల అమ‌లు క‌మిటీ తొలి స‌మావేశం జ‌రుగుతోంద‌ని.. ఆ కార‌ణంతోనే తాను స‌భ‌కు వ‌చ్చిన‌ట్లుగా కోనా చెప్పారు. అంతేకాదు.. తాను అసెంబ్లీ స‌మావేశాల‌కు రాలేద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. మాట మాట్లాడ‌కుండా.. మౌనంగా ఉంటూ త‌న ఎంట్రీతో ఏపీ అధికార‌ప‌క్ష నేత‌ల్లో కొత్త చ‌ర్చ‌కు కాసేపు తెర తీశార‌ని చెప్పాలి.