Begin typing your search above and press return to search.

వైసీపీ ‘లోపలి’ రచ్చ గురించి బయటపెట్టిన ఎమ్మెల్యే ద్వారంపూడి

By:  Tupaki Desk   |   30 Sep 2021 2:30 PM GMT
వైసీపీ ‘లోపలి’ రచ్చ గురించి బయటపెట్టిన ఎమ్మెల్యే ద్వారంపూడి
X
పార్టీలో అధిపత్య పోరు.. సొంత పార్టీ నేతల మధ్య విభేదాలుఎందుకు మొదలవుతాయి? ఎలా మొదలవుతాయి? లాంటి ప్రశ్నలకు చాలా సందర్భాల్లో సమాధానాలు దొరకవు. కానీ.. తరచి చూస్తే విషయాలు ఇట్టే అర్థమవుతాయి. కానీ.. అలాంటి తలనొప్పులకు అవకాశం ఇవ్వకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పేసి సంచలనంగా మారారు వైసీపీకి చెందిన కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తాజాగా విలేకరులతో మాట్లాడిన సందర్భంలో ఆయన చెప్పిన మాటల్ని విన్నప్పుడు.. అసలు ఒక నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు ఎలా పొడచూపుతాయో చెప్పేసి.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చోట.. అలాంటిదేమీ లేకుండా ఉండటానికి కారణాన్ని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో తమ పొరుగున ఉన్న నియోజకవర్గాల ఎంపీ.. ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్న అధిపత్య పోరు.. అదెలా షురూ అవుతుందన్న విషయాన్ని తనదైన శైలిలో.. పెద్ద మనిషి తరహాలో చెప్పుకొచ్చారు. ఒక విధంగాచూస్తే.. ఈ ఫీడ్ బ్యాడ్ పార్టీ అధినేత..ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డికి చాలా అవసరమన్న మాట వినిపిస్తోంది. సాధారణంగా తమ పొరుగున ఉన్న నియోజకవర్గంలో జరుగుతున్న అధిపత్య పోరు గురించి ఓపెన్ గా మాట్లాడటం చాలా అరుదు.

నలుగురు మధ్యన కూర్చున్నప్పుడు పిచ్చాపాటిగా మాట్లాడుతుంటారు.కానీ.. ఒక ఉదాహరణ చెప్పే క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చిన ఈ మాటల్ని.. అధినేత జగన్మోహన్ రెడ్డి వినాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం పార్టీలో ఏం జరుగుతుంది? కొన్ని అవసరం లేని గొడవల్ని ఎలా రాకుండా చూసుకోవాలన్న విషయంపై క్లారిటీగా చెప్పటం కనిపిస్తుంది.

ఇంతకీ ద్వారంపూడి చెప్పిన విషయాల్ని చూస్తే.. ఎంపీ పరిధిలోని నియోజకవర్గాల్లో ఎవరినైనా నేతల్ని పార్టీలోకి తీసుకునే ముందు.. సంబంధిత ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చి.. వారిద్దరూ మాట్లాడుకొని ఒక మాట అనుకున్న తర్వాత చేస్తే ఎలాంటి సమస్యా ఉండదని పేర్కొన్నారు. తమ ఎంపీతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. అన్ని విషయాలు మాట్లాడుకొని చేస్తామన్నారు. కానీ.. తమకు ఇరుగున ఉన్న రాజానగర్ నియోజకవర్గంలో ఎంపీ గారి భర్త ఇన్వాల్వ్ అవుతున్నారని తనకు సమాచారం ఉందన్నారు. ఒకవేళ అలాంటిదే జరిగితే అది తప్పని తామంతా చెబుతామన్నారు.

ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన తెలుగుదేశం.. జనసేన పార్టీ నేతలు స్థానిక నేతలకు.. ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా ఎంపీని కలుస్తున్నారని.. వాళ్లకుస్థానిక అంశాల మీద పెద్దగా అవగాహన లేక పార్టీలో చేర్చుకుంటున్నారని.. ఇలాంటప్పుడు అనవసరమైన భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఎంపీలు వీలైనంతవరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేలు పెట్టకుంటేనే మంచిదన్నారు. ఒకవేళ.. ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే ముందు సదరు ఎమ్మెల్యేతో మాట్లాడితే ఇబ్బందులు తొలిగిపోతాయన్నారు.

అందుకు భిన్నంగా ఎమ్మెల్యేకు తెలీకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. వీలైనంతవరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు జోక్యం చేసుకోకుండా ఉండాలన్న మాటలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. పార్టీలోని అధిపత్య పోరు.. ఎంపీ.. ఎమ్మెల్యేల మధ్య విభేదాలకు అసలు కారణాల్ని వివరించిన ద్వారంపూడి తీరును పలువురు అభినందిస్తున్నారు. ఈ అంశాలపై పార్టీ అధినేత ఫోకస్ పెడితే.. పలు తలనొప్పులు తగ్గే అవకాశం ఉందంటున్నారు.