Begin typing your search above and press return to search.

వైసీపీ నేత సంచలనం: మా ఎమ్మెల్యే రూ.250 కోట్ల అవినీతి!

By:  Tupaki Desk   |   7 Jan 2022 2:30 PM GMT
వైసీపీ నేత సంచలనం: మా ఎమ్మెల్యే రూ.250 కోట్ల అవినీతి!
X
అధికార పక్షనేతలు చేసే అవినీతి.. అక్రమాల మీద విపక్ష నేతలు విరుచుకుపడటం తెలిసిందే. అందుకు భిన్నంగా సొంత పార్టీ నేతల అవినీతిని బయటపెట్టిన అరుదైన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవినీతి భాగోతాన్ని బయపెట్టిన వైనం కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అవినీతి భాగోతం ఎంత భారీగా ఉందన్న విషయాన్ని వివరాలతో సహా బయటపెట్టిన వైనం విస్మయానికి గురి చేస్తోంది. ఒక ఎమ్మెల్యే అవినీతే రూ.250 కోట్ల వరకు ఉందంటే.. మరి.. మిగిలిన వారి సంగతేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

రూ.250 కోట్ల అవినీతి వివరాల్ని వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి బయటపెట్టారు. మాల మహానాడు అధ్యక్షుడు జగన్ బాబూరావు.. బీసీ సెల్ సెక్రటరీ పాపారావు గౌడ్ లు ఆరోపించారు. మాట వరసకు అవినీతి బురద వేసి.. వదలకుండా దానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించిన వైనం సంచలనంగా మారింది. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేల మీద సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు.. ఆరోపణలు తలనొప్పిగా మారిన వేళ..తాజాగా తెర మీదకు వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి షాకింగ్ గా మారింది.

తన ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని రూ.250 కోట్లు అవినీతికి పాల్పడ్డరని.. కొల్లూరులో 1600 ఎకరాల బినామీ వ్యక్తులకు లీజుకు ఇచ్చి రూ.50కోట్ల మేర లబ్థి పొందారన్నారు. కైకలూరులో 80 ఎకరాలు.. పామర్రులో 40 ఎకరాలు.. రామోజీ ఫిలిం సిటీ వద్ద 50 ఎకరాలు.. విశాఖపట్నంలో 50 ఎకరాలు.. నడిపురులో 13 ఎకరాల భూమి ఉందన్నారు. పార్టీ కోసంపని చేస్తున్న వారిని దూరం పెడుతున్నారని ఆరోపించిన వారు.. వచ్చే ఎన్నికల్లో కైకలూరు సీటును ఎస్సీ అభ్యర్థికి లేదంటే బీసీ అభ్యర్థికి కేటాయించాలని కోరారు.

ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే మాత్రం ఓటమి ఖాయమని వారుస్పష్టం చేస్తున్నారు. గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో తమ పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు చేసిన భూముల సంఖ్య ఇంత ఎక్కువగా ఉండటమా?అని విస్తుపోతున్నారు.ఇదే అదునుగా రంగంలోకి దిగిన విపక్షనేతలు.. ఎమ్మెల్యేనే ఇంతలా వెనకేస్తే.. మంత్రులు.. ఇతర ముఖ్యనేతలు మరెంత వెనకేసి ఉంటారు? అని ప్రశ్నిస్తున్నారు. మామూలుగా అయితే.. ఇలాంటి ఆరోపణల్ని విపక్ష నేతలు చేస్తే.. రాజకీయ వైరంతో చేస్తున్నారని కొట్టి పారేయొచ్చు. అందుకు భిన్నంగా సొంత పార్టీ వారే చేయటంతో.. ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాక కిందా మీదా పడుతున్నారు వైసీపీనేతలు.