Begin typing your search above and press return to search.

వైసీపీలో వసంత రాజకీయం...కొడుకు సీటుకే ఎసరు...?

By:  Tupaki Desk   |   23 Nov 2022 2:30 AM GMT
వైసీపీలో వసంత రాజకీయం...కొడుకు సీటుకే ఎసరు...?
X
ఆయన పెద్దాయన. రాజకీయాల్లో తలపండిన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చి తెలుగుదేశం రాజకీయాల్లో రాణించి సుదీర్ఘకాలం ఉమ్మడి ఏపీ పాలిటిక్స్ లో కొనసాగి తనకంటూ సొంత ముద్రను సంపాదించుకున్నారు. ఆయనే క్రిష్ణా జిల్లాకు చెందిన వసంత నాగేశ్వరరావు. ఆయన హోం మంత్రిగా టీడీపీ ఏలుబడిలో పనిచేశారు.

ఆయన 2019 ఎన్నికల ముందు వైసీపీలో కొడుకుతో పాటు చేరారు. ఆయన కుమారుడు కృష్ణ ప్రసాద్ కి మైలవరం టికెట్ ని జగన్ కేటాయిస్తే నాటి టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీద మంచి మెజారిటీతో గెలిచారు. ఇదిలా ఉంటే క్రిష్ణా జిల్లా నుంచి తొలి విడత మంత్రివర్గంలో కొడాలి నానికి మినిస్టర్ పోస్ట్ దక్కింది.

ఇక రెండవ విడతలో తనకు చాన్స్ వస్తుందని వసంత క్రిష్ణ ప్రసాద్ ఆశించారు. కానీ హై కమాండ్ ఆయన వైపే చూడలేదు సరికదా ఏకంగా కమ్మ వారికే మంత్రి పదవి లేకుండా చేసింది. దాంతో నాడే వైసీపీలో ఉన్న కమ్మలు రగులుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆరు నెలల తరువాత తాజాగా సీనియర్ నేతగా ఉన్న వసంత నాగేశ్వరరావు తన ఆవేశాన్ని ఆవేదనను తమ సామాజికవర్గం కార్తీక సమారాధన చేస్తే అందులో వెళ్ళగక్కారు. కమ్మలకు ఏపీ లో విలువ లేదంటూ ఆయన నిష్టూరమాడారు.

ఇక అంతటితో ఆగని ఆయన ఆ మరుసటి రోజు మీడియాతో మాట్లాడి అమరావతి రాజధాని బెస్ట్ అన్నారు. ఏపీకి అదే అసలైన రాజధాని అన్నారు. ఇలా జగన్ కి బాగా కెలికి వదిలిపెట్టారు. దాంతో ఆయన ప్రభావం కొడుకు ఎమ్మెల్యే అయిన వసంత క్రిష్ణ ప్రసాద్ మీద పడింది అంటున్నారు. ఈ పరిణామాల పట్ల వైసీపె అధినాయకత్వం గుర్రుగా ఉంది అంటున్నారు.

తండ్రి వసంత మాటలతో తనకు సంబంధం లేదని, తాను వైసీపీకి వీర విధేయుడిని అని క్రిష్ణ ప్రసాద్ ప్రకటించుకున్నా కూడా వైసీపీ నమ్మడంలేదు అంటున్నారు. అదే విధంగా చూస్తే వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా డౌట్ లో పడింది అని కూడా అంటున్నారు. అయితే తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తాను వైసీపీలోనే ఉంటాను అని వసంత క్రిష్ణ ప్రసాద్ అంటున్నారు కానీ అది సాధ్యం కాకపోవచ్చు అనే అంటున్నారు.

ఇక మైలవరం సీటుని ఈసారి బీసీలకు కేటాయించడం ద్వారా అక్కడ మరోసారి దేవినేని ఉమను ఓడించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోందిట. వసంత క్రిష్ణ ప్రసాద్ పనితీరు మీద కూడా అసంతృప్తిగా పార్టీ పెద్దలు ఉన్నారని అంటున్నారు. అదే టైం లో ఆయన మీద దేవినేని ఉమా అవినీతి ఆరోపణలు కూడా చేశారు. వాటి మీద కూడా వైసీపీ హై కమాండ్ వద్ద వివరాలు పక్కాగా ఉన్నాయని అంటున్నారు.

మొత్తానికి చూస్తే నోరా వీపుకు చేటు అన్నట్లుగా సీనియర్ వసంత మాట్లాడిన మాటలు కాస్తా జూనియర్ వసంత సీటుకు ఎసరు పెడుతున్నాయని అంటున్నారు. ఏపీలో కమ్మలను జగన్ అణగదొక్కుతున్నారు అన్న సందేశాన్ని తండ్రి ఇస్తూంటే తనకేమీ సంబంధం లేదని కొడుకు చెబితే వైసీపీ హై కమాండ్ నమ్ముతుందా అని అంటున్నారు. మొత్తానికి క్రిష్ణా జిల్లా రాజకీయాలు గరం గరం గా మారుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.