Begin typing your search above and press return to search.

రాజధాని పై రాష్ట్రపతి కి లేఖ రాసిన వైసీపీ ఎమ్మెల్యే ..!

By:  Tupaki Desk   |   7 Jan 2020 11:26 AM GMT
రాజధాని పై రాష్ట్రపతి కి లేఖ రాసిన వైసీపీ ఎమ్మెల్యే ..!
X
ఏపీ ని ప్రస్తుత మూడు రాజధానుల వ్యవహారం నిద్రలేకుండా చేస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమని మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసు కోగా ..అమరావతి ప్రాంత రైతులు , టీడీపీ నేతలు మాత్రం దానిపై నానా రాద్దాంతం చేస్తూ ...రాజధాని అనేది అమరావతి హక్కు అంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాజధానిగా అమరావతినే ఉంటుంది అని ప్రకటించే వరకు వెనక్కి తగ్గేదే లేదు అంటూ అమరావతి ప్రాంత రైతులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. అలాగే ప్రభుత్వం మాత్రం పరిపాలన రాజధాని గా విశాఖని ఫిక్స్ చేసి ..కొన్ని శాఖలని అక్కడికి ముందస్తుగా తరలించడానికి ప్రయత్నాలు చేస్తుంది.

ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. అమరావతి రాజ్యాంగబద్ధం కాదని ప్రకటించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు రాష్ట్రపతి ని కోరారు. అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ లేదా ప్రభుత ఆర్డర్ ఇవ్వలేదని ఆయన రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. శివ రామకృష్ణన్ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా, నాటి చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని ధర్మాన ఆరోపించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు శివరామకృష్ణన్ కమిటీ విముఖత వ్యక్తం చేసిందని ధర్మాన గుర్తు చేశారు.

అమరావతిని రాజధానిగా చేయాలన్ని నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరిందన్నారు. అత్యంత సారవంతమైన భూములపై రాజధాని నిర్ణయం ప్రభావం ఉంటుందని అయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం నాటి నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తోందని.. రాజధానిపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ, హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిందని ధర్మాన తెలిపారు. ఈ నేపథ్యంలో అమరావతి రాజ్యాంగ విరుద్ధం, అక్రమమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని కోరారు. అమరావతి పై గెజిట్ ఇవ్వలేదు కాబట్టి, సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన భారత మ్యాప్‌లో తగిన మార్పులు చేసేలా ఆదేశించాలని ఆయన రాష్ట్రపతిని కోరారు.