Begin typing your search above and press return to search.

సంచలనం: వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడి ఆడియో కాల్ లీక్

By:  Tupaki Desk   |   15 July 2021 10:30 AM GMT
సంచలనం: వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడి ఆడియో కాల్ లీక్
X
ఒక్క సారి అధికారంలోకి వస్తే చాలు ఆ నాయకుడు సైడ్ అయిపోతున్నారు.. వారి బంధుగణం తెరపైకి వస్తోంది. సామాంత రాజ్యంలా నియోజకవర్గంలో అంతా తామై వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ మధ్య నాయకుల బంధువుల హుకూంలు నియోజకవర్గంలో ఎక్కువైపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా కొన్ని నియోజకవర్గాల్లో అధికారులపై పెత్తనం చెలాయించేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడి వ్యవహారం చర్చనీయాంశమైంది. అధికారులు, నేతల మధ్య కాకరేపుతోంది. ఎమ్మెల్యే సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్.. ఇటీవల కనిగిరి విద్యుత్ ఈఈ భాస్కర్ రావుతో మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో కలకలం రేపింది.

దర్శి నియోజకవర్గంలోని కొన్ని మండలాలు కనిగిరి విద్యుత్ సర్కిల్ పరిధిలోకి వస్తాయి. ఎమ్మెల్యే స్వగ్రామం కూడా కనిగిరి నియోజకవర్గంలోని పామూరు మండలంలో ఉంది. దర్శి నియోజకవర్గంలోని కురిచేడు మండలం బోదనంపాడులో ఎమ్మెల్యే మద్దిశెట్టికి భూములున్నాయి.

తమ భూములకు విద్యుత్ కనెక్షన్ విషయమై ఎమ్మెల్యే సోదరుడు శ్రీధర్ కనిగిరి ఈఈ భాస్కర్ రావుకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. 'మా సొంత పని కూడా చేయవా?' అంటూ శ్రీధర్ ఆవేశంగా ఈఈతో మాట్లాడినట్లు ఆడియోలో రికార్డు అయ్యింది. దానికి సమాధానంగా 'మీరు అడిగిన పని నా పరిధిలో లేదు.. ఎస్ఈతో చేయించుకోండి' అటూ ఈఈ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే తమ్ముడు శ్రీధర్ ఏకంగా ఈఈని నువ్వు నువ్వు అంటూ సంభాషించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మీరు ఎమ్మెల్యే తమ్ముడు అయితే కావచ్చు.. నేను ప్రభుత్వ అధికారిని ... ఇలా మాట్లాడితే సహించనని ఈఈ చెప్పినట్లు ఆడియోలో ఉంది. మరుసటి రోజే ఆ ఆడియో కాల్ రికార్డులను జిల్లా అధికారులకు పంపి ఈఈ భాస్కర్ రావు పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అనంతరం ఈ ఆడియో బయటకు పొక్కింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వ్యవహారం సీరియస్ అయ్యింది. ఆడియో లీక్ కావడం.. సోషల్ మీడియా, టీవీ చానల్ లో రావడంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సదురు ఈఈపై చర్యలకు ఉపక్రమించారు. ఈఈ భాస్కర్ రావును సస్పెండ్ చేస్తూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు వచ్చినట్లు సమాచారం. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఒత్తిడితోనే ఆయనపై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది.

విద్యుత్ శాఖ మంత్రి కూడా సొంత జిల్లా మంత్రే కావడంతో సస్పెన్షన్ వ్యవహారం చకచకా జరిగిపోయినట్లు చెప్పుకుంటున్నారు.