Begin typing your search above and press return to search.

నీరసంతో వైసీపీ ఎమ్మెల్యేలు!?

By:  Tupaki Desk   |   9 Nov 2022 11:30 AM GMT
నీరసంతో వైసీపీ ఎమ్మెల్యేలు!?
X
ఎమ్మెల్యే అంటే ఎంత గౌరవం, మరెంత దర్జా. ఎలా ఉండాలి. హుందాకు మారుపేరుగా మహారాజుగా ఉండొద్దా.. నిజానికి అసలు వాటి కోసమే కదా పోటీ చేసి సత్తా చాటి సీటు గెలుచుకుని వచ్చేది. ఎంతో ఖర్చు పెట్టి ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్నాక మరీ ఇంత దిగాలుగా గుండె గుబులుగా ఉంటుందా అన్నది ఫస్ట్ టైం వైసీపీ ఏలుబడిలో ఎమ్మెల్యేలు చూస్తున్నారని అంటున్నారు.

ఎమ్మెల్యే అంటే ఎంత ధాటీగా ఉండాలి. నియోజకవర్గానికి కింగ్ అంటే తామే అన్నట్లుగా ఉండాలి. తమ వద్దకు డైలీ వచ్చే జనాలతో వందిమాగధులతో క్షణం తీరిక లేక ఫుల్ బిజీగా అయిదేళ్లూ ఇట్టే గడచిపోవాలి. కానీ జరుగుతున్నదేంటి. తలచుకుంటేనే వైసీపీ ఎమ్మెల్యేల గుండె తరుక్కుపోతోందిట. అధికారంలో ఉన్నామన్న ఊసు కానీ ధ్యాస కానీ వారికి ఏ మాత్రం లేవుట.

చూస్తూండగానే తమ ప్రమేయం ఎక్కడా లేకుండగానే మూడున్నరేళ్ల పుణ్య కాలం గడచిపోయింది. కిందన వాలంటీర్లు, పైన జగన్ బటన్ నొక్కుడు తప్ప మధ్యలో ఉన్న తమకేమీ సంబంధం లేకుండానే పాలన సాగిపోయిందన్న వేడి నిట్టూర్పులే వారు ప్రస్తుతం భారంగా విడిస్తున్నారు అని అంటున్నారు. ఇందుకోసమేనా ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినది అని వాపోని రోజు వారికి లేదనే అంటున్నారు.

ఇది మెజారిటీ ఎమ్మెల్యేల వ్యధగా రాజకీయ కధగా మారిపోయింది. ఇక ఎమ్మెల్యేలుగా తాము ఉన్న టెన్యూర్ లో ఒక డెవలప్మెంట్ లేదు, రోడ్లు వేయడం లేదు, చెరువుల రిపేర్ల వ్యవహారాలు అసలు లేవు, చేసిన కొద్దో గొప్పో పనులకు కాంట్రాక్టు బిల్లులు కూడా రావడంలేదు, పోనీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కింద ఏమైనా చేద్దామా అంటే అది కూడా రావడంలేదు, తమ వద్దకు వచ్చి దీనంగా ముఖం పెట్టే క్యాడర్ ని ఆదుకుందామంటే అది కూడా వీలు కాని దుస్థితి.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు, ఎన్నో చిరాకులు, చికాకులు. అందుకే ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్లుగానే చాలా మంది ఎమ్మెల్యేల పరిస్థితి మారింది అంటున్నారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు వీటికి తోడు గడపగడపకు వెళ్ళి ప్రభుత్వం చేసే పనులు చెప్పాలట. నవరత్నాలు బాగా అమలు చేశామని చెబుతూ కరపత్రాలు ఇంటింటికీ పంచాలట. సరే జనాల వద్దకు వెళ్ళి వారికి ఈ కరపత్రాలు అందించడం వరకూ బాగానే ఉన్నా వారు అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకపోతున్నామన్న బాధ కూడా ఉందిట.

ఎమ్మెల్యేగా మీరేమి చేశారు అంటే జవాబు అసలు దొరకదు కదా అంటున్నారు. అవును నిజంగానే చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పని కూడా చేయకుండానే మూడొంతులు పదవీకాలం పూర్తి అవుతోందే. మరి ఎలా రేపటి రోజున టికెట్ దక్కి జనం వద్దకు వెళ్ళి మరోసారి గెలిపించండి అంటే మీరు చేసిన ఒక్క పని చెప్పుకోండి చూద్దామంటే ఉంటేగా.

అందుకే అధికార పార్టీ ఎమ్మెల్యేలు పుట్టెడు బాధతో ఉన్నారని అంటున్నారు. ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యామన్న ఆనందం అంతా అవిరి అయిపోయి ఈ టెర్మ్ లో ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉన్నామన్న ఫీలింగ్ తోనే వైసీపీ ఎమ్మెల్యేలు నిండా మునిగిపోతున్నారు. అంటే తప్పు ఎక్కడ జరిగిందో అందరికీ తెలుసు కదా. అయినా ఈ బాధలు అన్నీ ఎవరితో చెప్పుకున్నా ఆకు మీద ముల్లు పడినట్లుగా ఎమ్మెల్యే గ్రాఫ్ కే నష్టం. అందుకే గమ్మున ఉండలేక చెప్పుకోలేక మధ్యన పడి నలిగిపోతున్నారు కదా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.