Begin typing your search above and press return to search.

గోరంట్లకు జగన్ ఊరట దక్కేనా... వాట్ నెక్స్ట్ ...?

By:  Tupaki Desk   |   11 Aug 2022 8:03 AM GMT
గోరంట్లకు జగన్ ఊరట దక్కేనా...  వాట్ నెక్స్ట్ ...?
X
గత పది రోజులుగా ఏపీని అట్టుడికిస్తున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ లో ప్రస్తుతానికి కొంత తెర పడినట్లే. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశం అనంతరం మాధవ్ కి భారీ ఊరట లభించింది. ఆయన అన్నది కూడా పాక్షికమైన విషయం. అటు పాము చావకుండా ఇటు కర్ర విరగకుండా ఎస్పీ చెప్పుకొచ్చారు. ఆయన అన్నది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది ఒరిజినల్ వీడియో కాదు అని.

మరి ఒరిజినల్ వీడియో ఉందా. ఉంటే అది ఎక్కడ ఉంది. దాన్ని ఎలా బయటకు తీస్తారు అన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. అయితే ఇక్కడ అంతా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే గోరంట్ల అధికార పార్టీ ఎంపీ. దీని మీద విపక్షాలు రచ్చ రచ్చ చేశాయి. దాంతో ఇపుడు ఎస్పీ ప్రాధమిక దర్యాప్తు ఎంతో కొంత ఊరటను మాధవ్ కి ఇచ్చింది. అలాగే ఏపీలో బాగా ఇబ్బంది పడుతున్న వైసీపీకి రిలీఫ్ కలిగింది.

దాంతో మాధవ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తన అనుచితమైన భాషను బాగా వాడేశారు. టీడీపీని, దాని అనుకూల మీడియాను కూడా లెక్కలేని తీరున చాలా ఘాటుగా విమర్సించారు. తాను కడిగిన ముత్యాన్ని అని చెప్పుకున్నారు. కానీ ఈ మాట జనాలు ఎంతవరకూ నమ్ముతారు అన్నది పక్కన పెడితే వైసీపీ అధినాయకత్వం నమ్మిందా అన్నది ఇక్కడ కీలకమైన పాయింట్.

వైసీపీ మాధవ్ ఎపిసోడ్ తో చాలా ఇరుకున పడింది. అయితే మాధవ్ కురుబ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, ఆయన మీద చర్యలు తీసుకుంటే అనంతపురం జిల్లాతో పాటు కర్నూల్ లో కూడా పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది అని ఆలోచించి గమ్మున ఉంది. అయితే పోలీసులు కాగల కార్యం తీర్చారు. ఈ రోజుకు ఆ తలనొప్పి అయితే తీరింది.

కానీ మాధవ్ ని వైసీపీ అధినాయకత్వం క్షమించేసినట్లేనా అంతే అది కుదిరేది కాదని అంటున్నారు. మాధవ్ దుడుకు ప్రవర్తన మీద ఇప్పటికే వైసీపీకి నివేదికలు ఉన్నాయి. ఇక ఆయన భాష కూడా బాగులేదు. ఆయన వైఖరి ఎపుడూ ముప్పే అన్న ఆలోచన ఉంది. అందుకే ఈ మచ్చతో కొనసాగుతున్న మాధవ్ కి మరో మారు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మాధవ్ కి ఎంపీ పదవే ఫస్ట్ అండ్ లాస్ట్ అవుతుందిట.

ఈ విషయంలో బయటకు చెప్పకపోయినా వైసీపీ హై కమాండ్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అదే విధంగా మాధవ్ ఎపిసోడ్ లో ఎంపీకి వెనక ఉన్నది కురుబ సామాజికవర్గమే తప్ప పార్టీ అండ లేదేని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే పోలీస్ అధికారిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి ఫస్ట్ ప్రయత్నంలోనే ఏకంగా పార్లమెంట్ కి వెళ్లిన మాధవ్ కి ఈ న్యూడ్ వీడియో ఫ్యూచర్ లేకుండా చేసింది అని అంటున్నారు.