Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ కనబడటంలేదు

By:  Tupaki Desk   |   2 May 2022 9:41 AM GMT
వైసీపీ ఎంపీ కనబడటంలేదు
X
ఇపుడిదే చర్చ పార్టీలోనే కాకుండా బయటకూడా మొదలైంది. మామూలుగా అధికారపార్టీ తరపున ఎంపీల నుండి జనాలు చాలా ఆశిస్తారు. కేంద్రం నుండి నిధులు తెస్తారని, కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకుని వస్తారని, ఏదైనా కారణాల వల్ల పెండింగ్ లో ఉన్న రాష్ట్రప్రాజెక్టులకు తొందరగా క్లియరెన్సులు తెప్పిస్తారని ఇలా చాలానే ఆశిస్తారు జనాలు. కానీ అవేవీ సాధించుకురాకపోతే అసలు ఎంపీనే అడ్రస్ లేకుండా పోతే జనాలు ఏమనుకుంటారు ?

ఇప్పుడిదంతా ఎవరిగురంచంటే వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్న పరిమళ్ ధీరజ్ లాల్ నత్వానీ గురించే. నత్వానీకి రాజ్యసభ ఎంపి ఇచ్చేముందు జనాల్లో ఆహో ఓహో అంటు చర్చలు జరిగినాయి. ముఖేష్ అంబానీకి నత్వానీ అత్యంత సన్నిహితుడని, రిలయన్స్ సంస్ధ తరపున ప్రాజెక్టులు ఏపీకీ సాధించుకుని వస్తారని అన్నారు.

అలాగే నరేంద్రమోడి, అమిత్ షా కు కూడా నత్వానీ చాలా దగ్గరవాడు కాబట్టి కేంద్రం తరపున ఏపీకి బాగా నిధులు, ప్రాజెక్టులు సాధించుకురావటంలో నత్వాని సేవలు ఉపయోగపడతాయని ప్రచారం జరిగింది.

అయితే జరిగిన ప్రచారమంతా ఉత్త ప్రచారంగానే మిగిలిపోయింది. ఎందుకంటే ప్రత్యేకించి నత్వానీ వల్లమాత్రమే ఏపీకి వచ్చింది ఇది అని ఇప్పటివరకు చెప్పుకునేందుకు ఏమీ కనబడలేదు.

అలాగే రిలయన్స్ సంస్ధ నుండి ఏపీకి వచ్చిన పెట్టుబడులూ ఏమీలేవు. మరి ఏ విధంగాను నత్వానీ సేవలు ఉపయోగపడనపుడు కార్పొరేట్ ప్రముఖులకు ఎందుకు రాజ్యసభ ఇవ్వాలనే చర్చ నడుస్తోంది.

ఇపుడీ చర్చంతా ఎందుకు నడుస్తోందంటే తొందరలోనే అదానీ భార్యకు ఏపీ నుండి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ప్రచారం జరుగుతోంది కాబట్టే. కార్పొరేట్ దిగ్గజాల వల్ల ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు అందకపోగా రాష్ట్రంలోని వనరులను దోచుకుని పోతున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కనీసం రాజ్యసభలో జరిగిన చర్చల్లో కూడా ఏపీ సమస్యలను నత్వానీ వినిపించినట్లు ఎక్కడా కనబడలేదు. మరీ పరిస్ధితుల్లో నత్వానీ కనబడటంలేదని తొందరలోనే బోర్డులు వెలిసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.