Begin typing your search above and press return to search.

ఎంపీ రఘురామరాజులో భయం పెరిగిపోయిందా?

By:  Tupaki Desk   |   8 July 2022 4:48 AM GMT
ఎంపీ రఘురామరాజులో భయం పెరిగిపోయిందా?
X
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు అనవసరంగా కెలుక్కుంటున్నారా ? ఆయన తాజా వైఖరి చూసిన తర్వాత అలాగే అనిపిస్తోంది. తనను కస్టడీలోనే చంపేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రపన్నినట్లు ఎంపీ ఆరోపించారు. ఆరోపించటమే కాకుండా సహచర ఎంపీలందరికీ లేఖలు కూడా రాశారు.

ఎంపీలందరు తనకు రక్షణగా నిలవాలని కూడా లేఖలో విజ్ఞప్తిచేశారు. జగన్ తో పాటు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధరెడ్డి, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర కారణంగా తన ప్రాణాలకు హాని ఉందని ఎంపీ చెప్పటం సంచలనంగా మారింది.

రాజకీయంగా జగన్ తో విభేదించిన ఎంపీ ప్రతిరోజు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపైన బురదచల్లటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎంపీ వైఖరి చూస్తున్న జనాలందరికీ ఈ విషయం అలవాటైపోయింది కాబట్టి పెద్దగా స్పందించటంలేదు. కానీ ఉన్నతాధికారులపై ఆరోపణలు చేసేటపుడు తన దగ్గర ఆధారాలుండాలి.

ఏపీ డీజీపీ రాజేంద్రనాధరెడ్డి, సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టీఫెన్ వల్ల కూడా తన ప్రాణాలకు హానుందని ఎంపీ చెప్పటమే విచిత్రంగా ఉంది. తన ఆరోపణలకు తగ్గట్లుగా ఎంపీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో తెలీదు.

ఆధారాల్లేకుండా కేవలం ఆరోపణలతో కాలంగడిపేద్దామని, బురదచల్లేద్దామని ఎంపీ అనుకుంటే చాలా తప్పుచేసినట్లే. ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారులిద్దరు ఊరికే ఉండేవారు కాదు. వాళ్ళిద్దరు ఎదురు ఎంపీ మీద కేసులుపెట్టినా, కోర్టులో కేసులు వేసినా ఏమి ఆధారాలు చూపించగలరు ? జగన్ తో ముడేసి వీళ్ళద్దరిపై ఎంపీ పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

రెండు రోజుల క్రితం ఇదే ఎంపీ చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారాయణ, రాఘవులు తనకు మద్దతుగా నిలవాలని వీడియోలో కోరారు. జగన్ కు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలో అందరినీ భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. ఇపుడేమో ఎంపీలందరికీ లేఖలు రాసి అందరి మద్దతు కోరారు. ఇదంతా చూసిన తర్వాత ఎంపీ మానసిక పరిస్ధితిపైనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.