Begin typing your search above and press return to search.

ఏపీ భవిష్యత్తు మీద వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్... ?

By:  Tupaki Desk   |   15 Dec 2021 6:27 AM GMT
ఏపీ భవిష్యత్తు మీద వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్... ?
X
ఏపీ భవిష్యత్తుకు ఏమైంది. ఏపీలో మరీ అంత దారుణమైన వాతావరణం ఉందా, ఏపీ దివాళా తీసింది, అప్పుల పాలు అయింది అని ప్రతిపక్షాలు అంతా అంటే కాదు అని అధికార పార్టీ ఎప్పటికపుడు ఖండిస్తూ వచ్చింది ఇన్నాళ్ళూ. మరి ఇపుడు సడెన్ గా ఏపీ భవిష్యత్తు మీద వైసీపీ ఎంపీ ఆందోళన వ్యక్తం చేయడం అంటే జనాల గుండెల్లో ప్రమాద ఘంటికలు మోగినట్లే. అది కూడా సాక్షాత్తూ నిండు పార్లమెంట్ లో. మాట్లాడింది ఎవరో కాదు, వైసీపీకి లోక్ సభలో పార్టీ నేత. ఆయనే మిధున్ రెడ్డి.

ఇంతకీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా ఏమి మాట్లాడారు, ఏపీ భవిష్యత్తు గురించి ఆయన చెప్పిన మాటలు, పడిన ఆవేదన ఏంటి అన్నది ఇంటరెస్టింగ్ గానే ఉంది. ఏపీ ఆర్ధిక భారాన్ని మోయలేని స్థితి ఉంది అంటూ మిధున్ రెడ్డి అతి పెద్ద బాంబే పేల్చారు. ఏపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని కూడా ఆయన పేర్కొనడం విశేషం. అంతే కాదు, ఏపీ భవిష్యత్తుని తలచుకుంటే ఆందోళన కలుగుతోంది అని కూడా వేడి నిట్టూర్పులు విడిచారు.

అందువల్ల ఏపీని ఈ పరిస్థితుల్లో ఆదుకోవాలంటూ ఆయన మొర పెట్టుకున్నారు. ఏపీకి విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన అన్ని హామీలను పరిపూర్తి చేయాలని మిధున్ రెడ్డి కోరారు. అంతే కాదు ప్రత్యేక హోదా సహా పోలవరానికి రూపాయి కూడా కోత వేయకుండా నిధులు ఇవ్వాలని ఆయన విన్నపాలు చేయడం విశేషం. ఇక ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు పన్నుల వాటా ఏపీకి రావడం లేదు అని కూడా ఆయన వివరాలతో సహా కేంద్రానికి తెలిపారు

అన్ని రాష్ట్రాల మాదిరిగా కాకుండా ఏపీని ప్రత్యేకంగా చూడాలని ఆదుకోవాలని మిధున్ రెడ్డి కోరారు. ఇదిలా ఉండగా మిధున్ రెడ్డి ఉన్నఫలంగా కేంద్రానికి ఇలా ఆవేదనను వ్యక్తం చేయడం అంటే రాజకీయంగా విశేషంగానే చూడాలి అంటున్నారు. దీనికి ఒక రోజు ముందు వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామ క్రిష్ణం రాజు ఏపీ ఆర్ధికంగా దివాళా తీసిందని అక్కడ ఆర్ధిక అత్యవసర పరిస్థితిని విధించాలని డిమాండ్ చేశారు. మరో వైపు హుటాహుటిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అయితే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలసి ఆమె చాంబర్ లో ఏపీని ఆదుకోవాలని విన్నవించుకున్నారు.

ఇలా చూసుకుంటే ఒకటి రెండు రోజుల తేడాలోనే ఇలా ఢిల్లీలో పరిణామాలు చకచకా మారడం, ఆర్ధికంగా ఇబ్బందులు ఏపీ ఎదుర్కోబోతోంది అంటూ వైసీపీ ఎంపీలే గోడు వెళ్ళబోసుకోవడం బట్టి చూస్తూంటే విపక్షాలు ఇంతకాలం చెప్పినదే నిజం అన్న భావన కలుగుతోంది. మరో వైపు జగన్ కి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి కూడా ఉద్యోగుల పీయార్సీ మీద మాట్లాడుతూ ఏపీ అన్ని విధాలుగా ఆర్ధికంగా ఇబ్బందులో ఉందని చెప్పకనే అసలు విషయం చెప్పేశారు. మొత్తానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ మధ్య ఏపీలో ఫైనాన్సియల్ పొజిషన్ డేజనర్ జోన్ లో ఉందని చెప్పిన విషయాన్నే ఇపుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. కేంద్రాన్ని ఆదుకోమని వైసీపీ కోరుతున్నా అక్కడ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అందరికీ తెలిసిందే. మరి ఏపీ ఇలాగే ఆర్ధిక భారాన్ని మోయలేమని చెబుతూంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది అతి పెద్ద చర్చగా ఉంది.