Begin typing your search above and press return to search.

బీజేపీలో చేరనున్న వైసీపీ ఎంపీ!

By:  Tupaki Desk   |   16 Nov 2021 5:04 AM GMT
బీజేపీలో చేరనున్న వైసీపీ ఎంపీ!
X
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు తొందరలోనే బీజేపీలో చేరబోతున్నారా ? అమిత్ షా ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన సమావేశంలో జరిగిన చర్చతో అందరిలోను ఇదే అనుమానాలు మొదలైంది. ముఖ్యనేతలతో షా మాట్లాడుతు రఘురామరాజును బీజేపీలోకి చేర్చుకుందామని చెప్పారట. రఘురామను పార్టీలోకి చేర్చుకోవాలని స్వయంగా షా నే చెబితే ఇక అడ్డేముంది ? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి హామీల అమలు విషయంలో, ప్రభుత్వ వైఫల్యాలపై రఘురామ జనాల్లో రెగ్యులర్ గా పోరాటాలు చేస్తున్నారని షా చెప్పటం.

రఘురామ విషయంలో షా చేసిన కామెంట్లు చూసిన తర్వాత కేంద్రమంత్రికి అసలు రాష్ట్రంలో ఏమి జరుగుతోందో తెలుస్తోందా అనే అనుమానాలు మొదలయ్యాయి. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రఘురామ జనాల్లో పోరాటాలు చేస్తున్నారట. అలాంటి రఘురామను తీసుకుంటే పార్టీ మరింత బలపడుతుందని షా అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు ఎంపీ పోరాటం చేస్తున్నది వాస్తవమే. అయితే ఆ పోరాటమంతా ఎక్కడ నుండి చేస్తున్నారు ? ఏ రూపంలో చేస్తున్నారు ? అన్నది బహుశా షాకి తెలీదేమో.

జగన్ కు వ్యతిరేకంగా ఎంపీ ఢిల్లీలో కూర్చుని చేస్తున్నారు. అదికూడా మీడియా సమావేశాల్లో మాత్రమే చేస్తున్నారు. తన నియోజకవర్గం నరసాపురంకు ఎంపి వచ్చి దాదాపు ఏడాది దాటిపోయింది. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని మీడియా సమావేశాలు పెట్టి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటాన్ని కూడా పోరాటమనే షా అనుకుంటే ఎవరు చేయగలిగేదేమీలేదు. నిజంగానే రఘురామ పోరాటాలు చేయాలంటే నియోజకవర్గానికి వచ్చి కూర్చోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను కూడేసి ఆందోళనలు చేయటాన్ని పోరాటమంటారు.

నిజంగానే తిరుగుబాటు ఎంపీకి అంత బలముందని షా అనుకుంటే వెంటనే ఆయనతో ఎంపీకి రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవచ్చు. అప్పుడు ఎంపీకి బలముందని అధికార పార్టీ వైసీపీ నేతలకు జ్ఞానోదయం అవుతుంది. ఎంపీ బలమేంటో జనాలందరికీ అర్థమవుతుంది. ఇంతకాలం ఢిల్లీలో కూర్చుని మీడియా సమావేశాలు పెడుతున్న ఎంపీ కష్టానికి కూడా ఫలితం దక్కినట్లవుతుంది. రాష్ట్రంలో ఏమి జరుగుతోందో రెగ్యులర్ గా తెలుసుకుంటున్న షా కి ఎంపీతో రాజీనామా చేయించాలని తెలియకపోవటమే ఆశ్చర్యం.

నిజానికి అధికార పార్టీ నేతలకు కూడా షా చెప్పిందే కావాలి. వెంటనే బీజేపీలో తిరుగుబాటు ఎంపీని చేర్చేసుకుంటే ఒక పనైపోతుంది. ఎంపీకి వైసీపీలో కంటిన్యూ అవ్వాలని లేదు. అలాగే ఎంపీని కూడా అధికార పార్టీ తమ ఎంపీల జాబితాలో నుంచి ఎప్పుడో తీసేసింది. ‘రోగి కోరింది డాక్టర్ ఇచ్చింది ఒకటే మందు’ అన్న సామెత లాగ రఘురామను ఎంపీగా రాజీనామా చేయించి బీజేపీలో చేర్చుకుంటే అంతా హ్యాపీయే. ఇంకెదుకు ఆలస్యం వెంటనే షా ఆపనేదో చేసేస్తే సరిపోతుంది కదా.