Begin typing your search above and press return to search.

మూడు రాజధానుల అసలు గుట్టు విప్పిన వైసీపీ ఎంపీ...?

By:  Tupaki Desk   |   27 Dec 2021 10:57 AM GMT
మూడు రాజధానుల అసలు  గుట్టు విప్పిన వైసీపీ ఎంపీ...?
X
ఏపీలో మూడు రాజధానుల కధకు ఇంటర్వల్ నే ఇచ్చారు. శుభం కార్డు అయితే పడలేదు. ఈ విషయాన్ని వైసీపీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా మీడియాకు చెప్పారు. ఇక ముఖ్యమంత్రి జగన్ అయితే అసెంబ్లీలో మళ్లీ కొత్త రూపంలో సమగ్రమైన బిల్లుని తీసుకువస్తామని స్పష్టంగా చెప్పారు. దాని మీద తరచూ వైసీపీ నేతలు కూడా చెబుతూ వస్తున్నారు. మూడు రాజధానులు ఖాయం. ఈ విషయంలో రెండవ మాట అన్న ప్రసక్తే లేదు అన్నది వారి మాట. అయితే మూడు రాజధానుల బిల్లు ఎపుడు సభలో ప్రవేశపెడతారు. మరో రెండున్నరేళ్లు మాత్రమే జగన్ కి అధికారం ఉంది. ఈ సమయంలో బిల్లు చట్టంగా మారి అధికార వికేంద్రీకరణ జరగడం అయ్యేపనేనా అన్న చర్చ కూడా మరో వైపు ఉంది.

ఇక మూడు రాజధానుల చట్టాన్ని మళ్లీ తీసుకువచ్చినా కోర్టు నుంచి న్యాయపరమైన అవాంతరాలు ఎదురైతే అపుడు సంగతి ఏమిటి అన్న ప్రశ్న కూడా ఉంది. మరి ఇవన్నీ ఒకసారి అనుభవంలోకి వచ్చిన తరువాత కూడా మళ్లీ వైసీపీ సర్కార్ ఈ ప్రయోగం చేస్తుందా అన్నది మేధావులకు కూడా అంతుపట్టని విషయంగా ఉంది. అయితే వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు అయితే దీని మీద చాలా క్లారిటీగా మాట్లాడారు.

ఒక ప్రముఖ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మూడు రాజధానుల వెనక ఉన్న అసలైన గుట్టు ఏంటో చెప్పారు. మూడు రాజధానులు అన్నవి జగన్ సీఎం గా ఉండగా ఈ టెర్మ్ లో జరగవని రాజు గారు తేల్చేశారు. మూడు రాజధనుల పేరిట మూడు ప్రాంతాలలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలన్నదే జగన్ మార్క్ ఎత్తుగడ అని ఆయన అంటున్నారు. ఆ విధంగా రాయలసీమ మేధావుల ఫోరం పేరిట కొంతమంది చేత ఇప్పటికే ఆందోళనలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇక విశాఖపట్నంలో రాజధాని అంటే అక్కడ ప్రజలకు అసలు ఇష్టం లేదని కూడా రాజు అంటున్నారు. ప్రశాంతంగా ఉన్న విశాఖ సిటీని ఇబ్బంది పెట్టే చర్యలను అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారని ఆయన అంటున్నారు. మూడు రాజధానులు అంటూ మూడు చోట్లా ఓట్లను పొందాలన్నది వైసీపీ పెద్దల ఆలోచన అని, వచ్చే ఎన్నికల దాకా ఇదే అంశాన్ని అలా సాగదీసుకుంటూ పోతారని కూడా ఆయన అంటున్నారు.

అయితే ప్రజలు మాత్రం ప్రాంతీయంగా రెచ్చగొట్టే రాజకీయాలకు, పార్టీలకు మద్దతు ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో అందరి మాటా అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలన్నదాని ఆయన అంటున్నారు. ఇక అమరావతి రాజధానిని మార్చాలి అంటే లక్ష కోట్ల పరిహారం రైతులకు ఇవ్వాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వేళ దాన్ని భరించే శక్తి లేదని కూడా రాజు అంటున్నారు.

మొత్తానికి జగన్ ఏలుబడిలో ఏపీకి అమరావతి రాజధాని ఉండదని, అలాగే మూడు రాజధానుల విషయం అంతకంటే ఉండదని రాజు కుండబద్ధలు కొట్టారు. ఈ ప్రభుత్వం దిగిపోయి కొత్తగా వచ్చే ప్రభుత్వం ద్వారానే అమరావతికి పూర్వ వైభవం వస్తుందని ఆయన అన్నారు. జగన్ ఎంతలా వివాదం చేయాలనుకున్నా కూడా విశాఖపట్నం రాజధాని కాదని, అమరావతి రాజధానిని కూడా అసలు కదల్చలేరని కూడా ఆయన చెప్పేశారు. మూడు రాజధానులను రాజకీయ అవసరాలకు వాడుకోవాలని చూస్తున్న వైసీపీకి చేదు ఫలితాలే వస్తాయని కూడా ఆయన పేర్కొనడం విశేషం. మొత్తానికి ఏపీకి మరో రెండున్నరేళ్ల పాటు రాజధాని ఉండదు అని రాజు తేల్చేశారు. అదే సమయంలో ఏదీ మీ రాజధాని అని ఎవరైనా అడిగినా సమాధానం చెప్పుకోలేని దుస్థితి కూడా కొనసాగడమే మిగులుతుంది అంటున్నారు.