Begin typing your search above and press return to search.

అక్కడ నాకు సెంటు భూమి కూడా లేదు..వారికి శిక్ష తప్పదు:సాయిరెడ్డి !

By:  Tupaki Desk   |   2 Sep 2021 10:34 AM GMT
అక్కడ నాకు సెంటు భూమి కూడా లేదు..వారికి శిక్ష తప్పదు:సాయిరెడ్డి !
X
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , మహానేత వైఎస్ ఆర్ వర్థంతి. ఈ సందర్భంగా విశాఖలో వైఎస్సార్‌ సంస్మరణ సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, దివంగత మహానేత వైఎస్సార్‌ సుపరిపాలన అందించారని ప్రశంసలు కురిపించారు. వైఎస్సార్‌ స్ఫూర్తి తో ముందడుగు వేస్తున్నామన్నారు. తండ్రి బాటలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నడుస్తున్నారని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్‌ నెరవేరుస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నాం. పార్టీలో కష్టపడిన వారందరికీ న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ భూములు ప్రజలకే చెందాలన్నది మా లక్ష్యం. ఎక్కడైనా భూ ఆక్రమణలు జరిగితే ఫిర్యాదు చేయొచ్చు. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఆ తర్వాత డెవలప్‌ మెంట్‌ పై ఫోకస్ పెట్టాలన్నారు. పదవుల విషయంలో అందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. తనకు డబ్బుపై ఆసక్తి లేదని, హైదరాబాద్‌లో ఉన్నది కూడా అద్దె ఇల్లే అన్నారు. తన పేరుతో అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్షిస్తామని.. ఉత్తరాంధ్ర డెవలప్‌మెంట్ మాత్రమే తన లక్ష్యమన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి సముచితస్థానం కల్పిస్తున్నామన్నారు. ఇప్పుడు అవకాశం కల్పించని వారికి భవిష్యత్‌ లో సముచిత స్థానం ఉంటుందన్నారు.
ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రజలకు పాలన అందిస్తున్నామని, విశాఖ ప్రజలకు సేవ చేయడమే తన కర్తవ్యమన్నారు.

ప్రతిపక్ష నేతలు తనపై ఆరోపణలు చేస్తున్నారని.. విశాఖలో భూముల పంచాయితీలు చేస్తున్నాను అని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ విశాఖలో సెంటు భూమి కూడా లేదన్నారు. తనకు విశాఖలో స్థిర పడాలనే కోరిక ఉందన్నారు. నగరానికి దూరంగా భీమిలి వద్ద నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి తీసుకోవాలి అని అనుకుంటున్నాని చెప్పుకొచ్చారు. తనకు భూములు సంపాదించాలి అని ఆశ లేదని, తన పేరు చెప్పి విశాఖలో అక్రమాలకు పాల్పడితే సహించనని త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తా, ఆ నెంబర్ ద్వారా నా పేరు వాడి ఎవరైనా అక్రమాలకు పాల్పడుతుంటే ఫిర్యాదులు చేయవచ్చు అని తెలిపారు.

అయితే, ఇప్పటి వరకు విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించడం , అలాగే తన పేరుతో ఎవరైనా అక్రమాలు చేస్తే ఫిర్యాదు చేయాలంటూ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తో ఇప్పుడు అయన మాటల హాట్ టాపిక్ గా మారింది. దీని ద్వారా పరోక్షంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా విశాఖలో అక్రమాలు జరుగుతున్నాయా అనే చర్చలు మొదలైయ్యాయి. ఏకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తానని చెప్పారు కాబట్టి , విశాఖ లో జరిగే అక్రమాల గురించి అయన వద్దకి వచ్చిందేమో అని చర్చించుకుంటున్నారు.