Begin typing your search above and press return to search.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తమ స్టాండ్ చెప్పిన వైసీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   24 March 2021 4:59 AM GMT
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తమ స్టాండ్ చెప్పిన వైసీపీ ఎంపీ
X
విభజన వేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ చెప్పటం.. దానికి తగ్గట్లే మోడీ సైతం తమ ఎన్నికల హామీగా ప్రచార సభల్లో చెప్పటం తెలిసినవే. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తామిచ్చిన హామీని నెరవేర్చే విషయంలో తూచ్ అని చెప్పేసిన మోడీ సర్కారు.. అప్పటి నుంచి అడ్డగోలు వాదనను వినిపించటం తెలిసిందే. తామేం మాట్లాడినా తిరుగులేదన్న భావనలో ఉన్న ఆ పార్టీకి ఏపీ ప్రజలు కూడా షాకివ్వకుండా ఉండటం కమలనాథులు అంతకంతకూ చెలరేగిపోతున్న వైనం ఎక్కువ అవుతోంది.

ఎప్పుడైతే ఏపీ ప్రజలు.. బీజేపీ నేతల్ని సూటిగా ప్రశ్నించటం షురూ చేస్తారో.. అప్పుడు మాత్రమే కేంద్రంలోని మోడీ సర్కారుకు చురుకు పుడుతుందని చెప్పాలి. ఓపక్క హామీ ఇచ్చి.. ఫలానా సంఘం ఒప్పుకోలేదు కాబట్టి తామేమీ చేయలేమని చేతులు ఎత్తేసే తీరు ఏ మాత్రం సరికాదు. అయితే.. కేంద్రం తీరును సూటిగా ప్రశ్నించటం.. వారు ఇరుకున పడేలా మట్లాడాల్సిన అవసరం ఉంది.

ఈ విషయాన్ని తన వాదనలతో అందరికి అర్థమయ్యేలా చేశారు ఏపీ అధికారపక్ష ఎంపీ మిథున్ రెడ్డి. తాజాగా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి ప్రశ్నించే క్రమంలో.. హోదా అంశాన్ని ప్రస్తావించారు. హోదాకు బదులుగా ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం మాటకు కౌంటర్ ఇచ్చారు. తాము ప్యాకేజీలను అంగీకరించటం లేదని తేల్చేశారు. చట్టం అమలుకు పదేళ్ల గడువు ఉంటే.. ఇప్పటికే ఏడేళ్లు పూర్తి అయ్యాయని.. చాలా అంశాలు పూర్తి చేయలేదని చెప్పారు.

హామీల అమలు కాకుండా ఉండటానికి కారణాలు తెలీటం లేదన్న ఆయన.. తాముఇప్పటికి ప్రత్యేక హోదానే డిమాండ్ చేస్తున్న వైనాన్ని స్పష్టంగా చెప్పేశారు. ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రమంత్రి.. ప్రత్యేక హోదా విధానాన్ని 14వ ఆర్థిక సంఘం రద్దు చేసిందని.. ప్యాకేజీ రూపంలో పెద్ద మొత్తం ఇచ్చిందని సర్దుబాటు వ్యాఖ్యల్ని చేశారు కేంద్రమంత్రి. .తాజా వ్యాఖ్యలతో ఏపీ అధికారపక్షం హోదా సాధన విషయంలో తన స్టాండ్ ఏమిటన్న విషయాన్ని మరోసారి క్లియర్ గా చెప్పేసిందని చెప్పక తప్పదు.