Begin typing your search above and press return to search.

ఆయన భౌతికంగా వైసీపీలో ఉన్నా..హార్ట్ అండ్ సోల్ మరెక్కడో ..?

By:  Tupaki Desk   |   3 July 2020 2:30 PM GMT
ఆయన భౌతికంగా వైసీపీలో ఉన్నా..హార్ట్ అండ్ సోల్ మరెక్కడో ..?
X
వైసీపీ ఎంపీలు రఘురామకృష్ణరాజు అంశంపై ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ తో భేటీ అనంతరం వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి, ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయడానికి వీలైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని స్పీకర్ ను కోరామని, అనర్హత పిటిషన్ ను సమర్పించామని వివరించారు. స్పీకర్ అన్ని విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ... రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీలో ఉంటూనే ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతూ రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. పార్టీ అధ్యక్షుడ్ని గౌరవించకపోవడం, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటి అనేక చర్యలకు పాల్పడ్డారు. సరిగ్గా చెప్పాలంటే రఘురామకృష్ణరాజు సొంతపార్టీలో విపక్షం లాంటి వారు. వైసీపీలో ఉంటూనే ఇతర పార్టీలతో మంతనాలు జరిపారు. విపక్షాలతో లాలూచీ పడి దిగజారిపోయారు. ఊహాజనిత కారణాలను ప్రచారం చేయాలనుకున్నారు. ఏదైనా ఉంటే పార్టీ అధ్యక్షుడికి చెప్పుకోవాలి కానీ, బహిరంగంగా మాట్లాడాలనుకోవడం పార్టీ విధివిధానాలకు అనుగుణం కాదు, భౌతికంగా వైసీపీలో ఉన్నా, ఆయన హార్ట్ అండ్ సోల్ ఇక్కడ లేదు. మనసా వాచా కర్మణా పార్టీ కోసం పనిచేసేవాళ్లే వైసీపీకి కావాలి. అందుకే ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నాం అంటూ చెప్పుకొచ్చారు.

ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ..ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారని, టీటీడీ వివాదంపై చైర్మన్‌తో గానీ, ఈఓతోగానీ రఘురామకృష్ణంరాజు చర్చించనిదే... టీటీడీ భూముల అమ్మకాలు జరిగిపోయినట్లుగా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఆయన ఇచ్చిన వివరణలో నిజాయితీ లేదని ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు.

మరో ఎంపీ ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ ... కుంటిసాకులు మానుకోవాలని తెలిపారు. అలాగే ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ చేశారు. రాబోయే ఉపఎన్నికల్లో ఎవరి ఫొటోకు వ్యాల్యూ ఉందో తెలుస్తుందని ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు.