Begin typing your search above and press return to search.

పవన్ టార్గెట్ గా వైసీపీ : సిక్కోలులో మంటలేనా...?

By:  Tupaki Desk   |   8 Jan 2023 2:30 AM GMT
పవన్ టార్గెట్ గా వైసీపీ : సిక్కోలులో మంటలేనా...?
X
ఇప్పటిదాకా ఒక ఎపిసోడ్ సాగింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుని జీవో నంబర్ 1 తో కట్టడి చేయడానికి వైసీపీ సర్కార్ చూసింది. బాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల టూర్ బాబు చేపడితే ఆయన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. దాంతో బాబు ప్రచారం సాగించలేక ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు వరకూ వైసీపీ ఇబ్బంది పెట్టినా ఇపుడే అసలు కధ మొదలుకాబోతోంది.

ఏపీలో సినీ గ్లామర్ తో పాటు రాజకీయ నేతగా మారిన తరువాత యువత చేరువ కావడం, ప్రత్యేకించి కొన్ని వర్గాలు ఆయన వెనక నడుస్తూండడంతో పవన్ ఇమేజ్ సైతం తారస్థాయిలో ఉంది. దాంతో జీవో నంబర్ 1 తో పవన్ని గట్టిగా తగులుకోవాలని వైసీపీ చూస్తోంది. అయితే ఇది బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు.

పవన్ని విశాఖలో ఒక హోటల్ లో పెట్టి కట్టడి చేయాలని చూస్తే ఆ హోటల్ వద్దకే జనాలు పోటెత్తి పోలీసులు నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం టూర్ ని కనుక జీవో నంబర్ 1 తో అడ్డుకోవాలని చూస్తే రాష్ట్రంలోనే సంచలన రాజకీయ పరిణామాలు నమోదు అవుతాయని అంటున్నారు.

ఈ నెల 12న యువశక్తి పేరిట భారీ సదస్సుని నిర్వహించడానికి పవన్ నిర్ణయించారు. ఇది ఈ రోజు కాదు నెల రోజుల క్రితమే ఆయన ఒక అజెండగా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలతో పాటు గోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో యువత ఈ సదస్సులో పాలు పంచుకోవడానికి తరలి వస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుకుగా సాగుతున్నాయి.

అయితే జీవో నంబర్ 1 ని చూపించి శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఈ రోజు కీలకమైన ప్రకటన చేశారు. శ్రీకాకుళం జిల్లాలో సెక్షన్ 30 అమలులో ఉందని అందువల్ల తమ అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, సమావేశాలూ నిర్వహించకూడదని ఆ జీవోలో స్పష్టం చేశారు. దాంతో పాటు ఈ రోజుకు కూడా యువశక్తి సదస్సుకు అనుమతులు ఇవ్వలేదని అంటున్నారు.

అయితే ఈ విషయంలో జనసేన మాత్రం గుర్రుగా ఉంది. తమ సదస్సుకు అడ్డుపెడుతున్నారని మండిపడుతోంది. గత వారం రోజులుగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ శ్రీకాకుళంలోనే ఉంటూ అక్కడ యువశక్తి సభ ఏర్పాట్లను చూస్తున్నారు. తాము నెల రోజుల క్రితమే సభ గురించి తెలియచేశామని ఇపుడు అనుమతి ఇవ్వకపోవడం దారుణం అంటున్నారు.

ఇంకో వైపు పవన్ కళ్యాణ్ ఆరు నూరు అయినా యువశక్తి సదస్సుని రణస్థలంలో నిర్వహించడానికి చూస్తున్నారు. దీని కోసం ఆయన రణస్థలానికి 12న వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు వేలాదిగా జనసేన కార్యకర్తలు కూడా వస్తారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ తగ్గేది లేదు అంటూంటే వైసీపీ ప్రభుత్వం జీవో ప్రకారం కఠినంగా వ్యవహరించాలని చూస్తోంది. ఇవన్నీ చూస్తూంటే సిక్కోలు సభ కాదు కానీ రాజకీయ మంటలే రేగడం ఖాయంగా కనిపిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ నెల 12న ఏమి జరగనుంది అన్నది ఆసక్తిని రేపుతోంది. అందరి చూపూ శ్రీకాకుళం మీదనే ఉంటాయనడంతో సందేహం లేదు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.