Begin typing your search above and press return to search.

టీడీపీకి బిగ్ షాక్..వైసీపీదే కాకినాడ మేయర్ పీఠం

By:  Tupaki Desk   |   5 Oct 2021 10:30 AM GMT
టీడీపీకి బిగ్ షాక్..వైసీపీదే కాకినాడ మేయర్ పీఠం
X
కాకినాడ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ మేయ‌ర్‌ పదవిపై కొంతకాలంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్థిగా ఉన్న మేయర్ పావని వ్యవహారశైలి నచ్చని కొందరు టీడీపీ కార్పొరేటర్లు చాలాకాలం ఆమెపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తమను స్వతంత్ర కార్పొరేటర్లుగా ప్రకటించాలంటూ 21 మంది టీడీపీ కార్పొరేటర్లు గతంలో కలెక్టర్‌కు వినతిపత్రం కూడా అందించారు.

ఈ ఘటనతో టీడీపీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ఈ క్రమంలోనే టీడీపీ అస‌మ్మతి కార్పొరేట‌ర్ల‌కు కాకినాడ న‌గ‌ర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి చేయందించారు. దీంతో, కాకినాడ మేయ‌ర్‌ కు టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా కాకినాడ మేయర్ సుంకర పావనిపై ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో టీడీపీకి గట్టి షాక్ తగిలింది.

ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 36 ఓట్లు రాగా...పావ‌నికి అనుకూలంగా ఒక్క‌ ఓటు కూడా పడకపోవడంతో టీడీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. స్వతంత్ర కార్పొరేటర్లు కూడా తటస్థంగా ఉండడం విశేషం. ఈ ఓటింగ్‌లో మంత్రి క‌న్న‌బాబు, ఎంపీ వంగ గీత‌, ఎమ్మెల్యే ద్వారంపూడిలు కూడా పాల్గొన్నారు. 50 డివిజ‌న్లున్న కాకినాడ కార్పోరేష‌న్‌ లో 44 డివిజన్లకు 2017లో ఎన్నిక‌లు జరిగాయి.

ఆ ఎన్నికల్లో టీడీపీ 30, వైసీపీ 8, బీజేపీ 3, స్వ‌తంత్రులు 3 చోట్ల విజ‌యం సాధించారు. అయితే, మేయర్ వైఖరిపై టీడీపీ కార్పొరేటర్లు సైతం అసంతృప్తితో ఉండడం, వైసీపీ హవా నడుస్తుండడంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి బీజం పడింది. దీంతో, ఇవాళ జ‌రిగిన అవిశ్వాస తీర్మానంలో మేయ‌ర్‌కు వ్య‌తిరేకంగా వచ్చిన 36 ఓట్లలో 21 మంది టీడీపీ కార్పొరేటర్లు విప్‌ను ధిక్క‌రించి మరీ మేయర్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీంతో మేయర్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకున్నట్లయింది.