Begin typing your search above and press return to search.

పేర్ని నాని నవ్వుతూనే హై కమాండ్ ని టార్గెట్ చేశారా...?

By:  Tupaki Desk   |   11 July 2022 1:52 PM GMT
పేర్ని నాని నవ్వుతూనే హై కమాండ్ ని టార్గెట్ చేశారా...?
X
పేర్ని నాని. మాజీ మంత్రి. బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. దానికి మించి దివంగత మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి కుమారుడు. అలా పేర్ని నానికి రాజకీయంగా కృషా జిల్లాలో పలుకుబడి ఉంది. ఇక వెటకారంతో విమర్శలు చేయడంలో ఆయనకు తిరుగే లేదు. ఆయన నవ్వుతూనే అంటించేస్తారు.

ఆ మాటలు ముందు నవ్వు పుట్టిస్తాయి. దాంతో మనది కాదేమో అనుకుని నవ్వేస్తారు కానీ తీరా చూసుకుంటే మాత్రం బాగానే ఏసేసారే అనిపించకమానదు. ఇదిలా ఉండగా పేర్ని నానీ వైసీపీ ప్లీనరీలో దుష్టచతుష్టయం అన్న అంశం మీద మాట్లాడుతూ చాలా రకాలైన సెటైర్లు వేశారు. వాటిని వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి జగన్ నవ్వుతూ ఆస్వాదించారు.

పేర్ని నాని చంద్రబాబు మీద కామెంట్స్ చేసిన ప్రతీ సందర్భంలోనూ జగన్ నవ్వు ఆపుకోలేకపోయారు. అదే సమయంలో పేర్ని నాని సబ్జెక్ట్ ని కాస్తా టర్న్ చేశారు. వైసీపీ క్యాడర్ నిరుత్సాహంతో ఉంది అని అంటున్నారు, వింటున్నాను అని మొదలెట్టిన నాని మీ కోపం ఎమ్మెల్యేల మీద లేక జగన్ మీద అని సూటిగా ప్రశ్నించారు.

ఎమ్మెల్యేల మీద కోపం అయితే మెమెవరం, వైసీపీకి ఏమీ కాదు కదా అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఒక్కసారిగా జగన్ సహా అందరికీ షాక్ తినేలా చేశాయి. మేము ఇలా వచ్చేవాళ్లం, అలా పోయే వాళ్ళం, మీరు అలా కాదు కదా శాశ్వతం, మీరే పార్టీకి ఉండాలి, జగన్ కోసం మీరే పనిచేయాలని కూడా ఆయన సూచించడం విశేషం.

ఇక తనను మాజీ మంత్రిగా కూడా సంభోదించుకున్న నాని కేవలం నాలుగు రోజుల తేడాలో మంత్రి పదవిని పీకేశారని కూడా కామెంట్స్ చేశారు. ఇక ఎమ్మెల్యేగా తాను ఎలా అయ్యానో తెలుసా. జగన్ బీ ఫారం ఇచ్చారు. దాన్ని తీసుకెళ్ళి ఎమ్మర్వో ఆఫీసులో ఇచ్చాం, మీరంతా ప్రచారం చేశారు. జగన్ మీద ప్రేమతో జనాలు గెలిపించారు. దాంతో తంతే అలా ఎగిరి అసెంబ్లీలో పడ్డామని కూడా సెటైరికల్ గా చెప్పుకున్నా తామేమీ వైసీపీకి కాదన్నట్లుగా ఆయన వ్యంగ్యంగానే జగన్ కి చెప్పారని అర్ధమైంది అంటున్నారు.

తాము ఇవాళ ఉంటాం రేపు పోతాం, జగన్ వద్ద అందరి లెక్కలూ ఉన్నాయని, ఆయన ఎవరికి టికెట్ ఇస్తే వారే ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా అని పేర్ని నాని చెప్పడం ద్వారా తన బాధను చెప్పేశారని అంటున్నారు. నిజానికి ఎమ్మెల్యేలు అంతా కూడా వైసీపీ హై కమాండ్ తమని పట్టించుకోవడంలేదని బాధపడుతున్నారని అంటారు. వారి బాధ అంతా పేర్ని నాని నోటి వెంట వచ్చిందా అనిపించేలా ఆయన స్పీచ్ సాగించి అని అంటున్నారు.

ఇక తనను అయిదేళ్ల పాటు మంత్రిగా కొనసాగిస్తారని పేర్ని నాని ఆశ పెట్టుకున్నారని చెబుతారు. ఆయన సమర్ధంగా తనకు అప్పగించిన శాఖలలో పనిచేశారు. అయినా కానీ నానిని తప్పించేశారు. ఆ బాధ అలా ఉండగానే ఇపుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బందరు ఎమ్మెల్యే సీటుకు కూడా ఎసరు వచ్చేలా ఉందని భావించే నాని ఇలా హై కమాండ్ ని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారు అని అంటున్నారు.

బందర్ సీటు విషయంలో ఎంపీ బాలశౌరి గురి పెట్టి ఉన్నారు. ఆయన జగన్ కి సన్నిహితుడు. దాంతో వచ్చే ఎన్నికలో టికెట్ విషయంలో నానికి ఏమైనా డౌట్లు ఉన్నాయా అన్న చర్చ కూడా వస్తోందిట. మొత్తానికి మొదట చంద్రబాబుని దుష్టచతుష్టయాన్ని విమర్శిస్తూనే చివరికి వచ్చేసరికి హై కమాండ్ ని కూడా నాని టార్గెట్ చేశారనే అంటున్నారు మరి.