Begin typing your search above and press return to search.

విప‌క్షాల‌కు క‌త్తులిస్తున్న వైసీపీ ర‌త్త‌య్య‌లు..!

By:  Tupaki Desk   |   30 Jun 2022 1:30 PM GMT
విప‌క్షాల‌కు క‌త్తులిస్తున్న వైసీపీ ర‌త్త‌య్య‌లు..!
X
రాజ‌కీయాల్లో ఒక సామెత ఉంది. మ‌నం మ‌నం ఎంతైనా కొట్టుకుందాం. కానీ, ప్ర‌త్య‌ర్థికి మాత్రం ఛాన్స్ ఇవ్వొద్దు అని! దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి ఇదే మాట చెప్పేవారు. ''ఏంట‌య్యా మీ గోల‌. మీరు మీరు కొట్టుకుని ప్ర‌తిప‌క్షాన్ని బాగుచేస్తారా ఏంటి? ఏదైనా ఉంటే.. త‌లుపులేసుకుని త‌న్నుకోండి.. త‌లుపు తీసి.. కౌగిలించుకోండి!'' అని. దీనికి కార‌ణం.. రాజ‌కీయాల్లో ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌నే. అదేస‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థుల‌కు అవ‌కాశం ఇవ్వ‌రాద‌నే. అందుకే.. అతి పెద్ద పార్టీ కూడా ఒకే ప‌రిధిలో ప‌నిచేసింది. వైఎస్ ఉన్న‌న్నాళ్లు ఎన్ని విభేదాలు ఉన్నా.. ఒకే తాటిపై న‌డిచింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు వైఎస్ అనుంగులే.. వైఎస్‌కు అనుచ‌రుల‌మ‌ని చెప్పుకొనే బాలినేని శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి, కోటం రెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి వంటివారు.. వైసీపీలో ఉన్నారు. మ‌రి ఇక్క‌డ ఏం చేస్తున్నారు? నాటి వైఎస్ జ‌మానా లో అనుస‌రించిన సూత్రాన్ని క‌నీసం ప‌ట్టించుకుంటున్నారా? లేదా? అనేది ఆస‌క్తిగా మారింది.

ఎందుకంటే.. వారు రోడ్డున ప‌డుతున్నారు. వైసీపీని రోడ్డున ప‌డేస్తున్నారు. గ‌తంలో వైఎస్ చెప్పిన‌ట్టు.. ఏదైనా ఉంటే.. చ‌ర్చించుకునేందుకు అవ‌కాశం ఉంది. ఏదైనా.. ఉంటే.. మాట్లాడే చాన్స్ కూడా ఉంది.

కానీ, దీనిని వారు వ‌దిలేస్తున్నారు. పవారు వారు త‌న్నుకుని.. వైసీపీని రోడ్డున ప‌డేసి.. ప్ర‌త్య‌ర్థుల‌కు క‌త్తులు అందిస్తున్నారు. పార్టీలో చిన్న చిత‌కా నాయ‌కులు జంప్ చేసేందుక ఉఅవ‌కాశం ఇస్తున్నారు. ఇదే జ‌రిగితే.. పార్టీ నిర్మాణంపైనే ప్ర‌భావం ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఎన్నో రోడ్లు తిరిగి.. అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డి.. జ‌గ‌న్ అధికారం తెస్తే.. దీనిని ఎంజాయ్ చేస్తున్న నాయ‌కులు.. ఇప్పుడు రోడ్డున ప‌డేసేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. పోనీ.. రేపు ఇదే బాధ్య‌త‌ను తీసుకుని పార్టీ గెలిపించే స‌త్తా వీరికి ఉందా? పార్టీ కాదు.. జ‌గన్‌బొమ్మ లేకుండా.. జ‌గ‌న్ పేరు లేకుండా వారైనా గెల‌వ‌గ‌ల‌రా?

ఇవ‌న్నీ.. సాధ్యం కాద‌ని వారికీ తెలుసు. అయిన‌ప్ప‌టికీ.. మేం పుడింగులం అంటూ.. పార్టీ పుట్టి ముంచేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏ పార్టీలోవిభేదాలు లేవు? ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో నూ గొడ‌వలు ఉన్నాయి. బీజేపీలోనూ అసంతృప్తులు ఉన్నాయి. అంతెందుకు అధికార‌మే ద‌క్క‌ని క‌మ్యూనిస్టుల మ‌ధ్య కాక‌లు రేపే విభేదాలు ఉన్నాయి. అయినా.. వారు రోడ్డున ప‌డుతున్నారా? ఎక్క‌డిక‌క్క‌డ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి వైసీపీలోనే ఎందుకు ఇలా జ‌రుగుతోంది. అధికారం చూసుకుని వీధిన ప‌డితే.. ఇది పోయాక‌.. ప‌ల‌క‌రించే నాయ‌కులు కూడా ఉండ‌ర‌నే విష‌యం వైసీపీ నేత‌లు గ్ర‌హించాల్సి ఉంది.