Begin typing your search above and press return to search.

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులని ఖరారు చేసిన సీఎం ...ఆ నలుగురు ఎవరంటే ?

By:  Tupaki Desk   |   9 March 2020 11:00 AM GMT
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులని  ఖరారు చేసిన సీఎం ...ఆ నలుగురు ఎవరంటే ?
X
ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ పంపే అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. గతంలో ఇచ్చిన హామీలతో పాటు విధేయతే ప్రామాణికంగా పెద్దలసభకి నలుగురు పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అయితే, ఈ నలుగురిలో ఎవ్వరు ఊహించని విధంగా ప్రస్తుత కాబినెట్ లోని ఇద్దరు బీసీ మంత్రులైన మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ లని రాజ్యసభ కు పంపాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ ప్రభుత్వం శాసనమండలి రద్దుకి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనితో మండలిరద్దుతో మంత్రి పదవుల్లో ఉన్న ఎమ్మెల్సీలు మోపిదేవి, పిల్లి సుభాష్, తమ మంత్రి పదవులను కోల్పోనున్నారు. అయితే , పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో తనతో కలిసి నడిచిన వారికి , అన్యాయం చేయకూడదు అని భావించిన సీఎం జగన్ వారిని పెద్దల సభకి నామినేట్ చేయనున్నారని సమాచారం. ఏపీలో శాసన మండలి రద్దు సమయంలోనే వారిద్దరి రాజకీయ భవిష్యత్ తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు.ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక, మూడో స్థానం పార్టీ స్థాపన నుండి తనతో నిలిచిన అయోధ్య రామిరెడ్డికి కూడా రాజ్యసభ సీటు కేటాయించారు. ఇక మరో సీటును ముంబైకి చెందిన వ్యాపారవేత్త పరిమళ్ నత్వానికి కేటాయించినట్లు సమాచారం. స్వయంగా ముఖేష్ అంబానీ వచ్చి నత్వానీకి రాజ్యసభ ఇవ్వాలని అభ్యర్ధించటం తో పాటుగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరిక మేరకే ఈయన అభ్యర్థిత్వం ఖరారైనట్లు తెలుస్తోంది.

మొత్తంగా భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని నత్వానీకి సైతం సీటు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో.. మూడు స్థానాలు వైసీపీకి..ఒకటి స్వతంత్ర అభ్యర్ధి గా నత్వానీని ఏపీ నుండి పెద్దల సభకు పంపనున్నారు. కాగా, మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి ఖాళీ కానున్న మొత్తం నాలుగు సీట్లు.. ఈసారి దాదాపుగా వైసీపీకే దక్కనున్నాయి. ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల సంఖ్య 151 ఉండడంతో రాజ్యసభ అభ్యర్థులను ఈజీగా గెలిపించుకునే అవకాశముంది.