Begin typing your search above and press return to search.

వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్. కృష్ణయ్యపై భూకబ్జా కేసు

By:  Tupaki Desk   |   3 Jun 2022 2:30 PM GMT
వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్. కృష్ణయ్యపై భూకబ్జా కేసు
X
బీసీ సంఘం అధ్యక్షుడు.. వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన ఆర్.కృష్ణయ్య చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. తనపై కృష్ణయ్య రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఆరోపించారు. ఆర్. కృష్ణయ్య వేధిస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో రాయదుర్గం పీఎస్ లో ఆర్.కృష్ణయ్యతోపాటు మరికొందరిపై కేసు నమోదైంది.

ఆర్ కృష్ణయ్యతో తనకు 40 ఏళ్లుగా స్నేహం ఉందని.. తన భూమిని కబ్జా చేసి చంపాలని చూశారని రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్. కృష్ణయ్యపై 447,427,506,384 రెడ్ విత్ 341 సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఆర్.కృష్ణయ్య ఇంతవరకూ స్పందించలేదు.

తెలంగాణలో బీసీ సంఘం నేతగా ఆర్ కృష్ణయ్య ప్రస్థానం మొదలైంది.  2014లో టీడీపీ 15 సీట్లకే పరిమితమైంది. టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఆర్. కృష్ణయ్యను చంద్రబాబు ప్రకటించారు. ఆయన ఎల్ బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అసెంబ్లీలో ఏనాడు పచ్చ కండువా వేసుకోలేదు.. టీడీపీ తరఫున నిలబడలేదు. బాబు కూడా ఎన్నికల తర్వాత ఫలితాలు చూసి ఆర్. కృష్ణయ్యను లైట్ తీసుకున్నారు. తనకు టీడీపీ శాసనసభ పక్ష నేత పదవి ఇస్తారని ఆర్.కృష్ణయ్య కొండంత ఆశలు పెంచుకోగా.. బాబు హ్యాండిచ్చి ఎర్రబెల్లికి ఆ పదవి కట్టబెట్టారు. ఎర్రబెల్లి ఏం తక్కువ తినలేదు. ఏకంగా పార్టీ నాయకుడిగా టీఆర్ఎస్ లో చేరి టీడీపీ మొత్తం టీఆర్ఎస్ లో విలీనం చేశానని ప్రకటించేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి పోటీచేసి ఆర్ కృష్ణయ్య ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా జరిగారు.

ఏపీ సీఎం జగన్ బీసీలకు పెద్దపీట పేరుతో తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్యను సీఎం జగన్  ఏపీ కోటాలో పంపడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా రాజ్యసభ సీటు ఖరారవుతున్న వేళ ఆయన భూకబ్జా కేసులో ఇరుక్కోవడం చర్చనీయాంశమైంది.